
AP MLC Elections- YCP Candidates: ఆ పార్టీలో ఓ సామాజికవర్గానిదే పెత్తనం. ఎమ్మెల్యేల్లో ఆ వర్గం వారిదే అగ్రసింహాసనం. సలహాదారుల సంగతి చెప్పనక్కర్లేదు. `మన` వారైతే చాలు.. వేసుకోండి వీరుతాడు అన్నట్టు పదవుల పంపకం జరుగుతోంది. కానీ అనూహ్యంగా సామాజిక న్యాయ మంత్రం జపిస్తున్నారు. సామాజిక సాధికరత కల్పించిన ఘనత తమదే అంటున్నారు. మాటలు కాదు.. చేతల్లో చూపాం అంటున్నారు. ఇంతకీ ఇంత అనూహ్య మార్పుకు కారణమేంటి ? `మన` వారికి వీరుతాడు వేయడానికి వణుకు ఎందుకు ? స‌్టోరీలో చర్చిద్దాం.
వైసీపీ కుల పునాదులతో నిర్మితమైన పార్టీ. రెడ్ల మద్దతు లేకుండా మనుగడ సాగించలేదు. అందుకే కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి రెడ్లను గంపగుత్తగా తెచ్చుకున్నారు. అధికారంలోకి కూడా వచ్చారు. అధికారంలోకి వచ్చాక రెడ్లకు పెద్దపీట వేస్తూ వచ్చారు. ఎమ్మెల్యేల్లో మెజార్టీగా రెడ్డి సామాజికవర్గానికి ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. నామినేటెడ్ పదవుల్లో రెడ్లకు తప్ప మరొకరికి స్థానం లేకుండా చేశారు. అవసరం లేకున్నా వందల సంఖ్యలో సలహాదారుల పదవులు సృష్టించారు. సొంతకులం వారికి పప్పు బెల్లాల్లా సలహాదారుల పదవులు పంచిపెట్టారు. అప్పనంగా జీతం ఇస్తూ, సకల సదుపాయాలు కల్పించారు. ఇంకో రకంగా చెప్పాలంటే రాజకీయ పునరావాసం కల్పించారు. అప్పటి వరకు వైసీపీని అంటిపెట్టుకుని ఉన్నవారికి సలహాదారుల పదవులు పంచిపెట్టారు.
ఎమ్మెల్యే స్థానాలు, నామినేటెడ్ పదవులు, సలహాదారులు.. ఇలా అన్నింటిలో రెడ్డి సామాజికవర్గానికే పెద్దపీట వేశారు. ఇదే సమయంలో ఏపీలోని మిగిలిన సామాజికవర్గాల్లో కూడా చైతన్యం పెరుగుతోంది. వైసీపీలో రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తున్న ప్రాధాన్యతను.. తమ పట్ల చూపుతున్న వివక్షను గమనిస్తు వస్తున్నారు. కులాల వారీగా ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. ఉదాహరణకు ఏపీలో కాపుల జనాభా అధికం. కానీ వారి జనాభాకు తగినట్టుగా ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ ఇవ్వలేదు. కేవలం కాపు నాయకుల్ని తిట్టడానికే కాపు వైసీపీ ఎమ్మెల్యేలను వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. కాపుల్లో చైతన్యం వస్తోంది. వైసీపీ పాలనలో జరిగిన మోసాల్ని గుర్తిస్తున్నారు. బీసీల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. ఎన్నికల ముందు బీసీలకు పెద్దపీట వేస్తామని హామి ఇచ్చి.. ఇప్పుడు రెడ్లకు ప్రాధాన్యత ఇవ్వడం పై గుర్రుగా ఉన్నారు.
ఏపీలోని మిగిలిన సామాజికవర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని వైసీపీ గమనించింది. ముందే జాగ్రత్తపడకపోతే పుట్టి మునుగుతుందని గ్రహించింది. అందుకే నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీలకు అధికంగా కేటాయించింది. తద్వార బీసీల నుంచి వచ్చే వ్యతిరేకతను తట్టుకోవచ్చని భావిస్తోంది. టీడీపీ వైపు వెళ్లకుండా బీసీలను మచ్చికచేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రకటించింది. మెజార్టీ ఎమ్మెల్సీ స్థానాలు బీసీ,ఎస్టీ,ఎస్టీలకు కేటాయించారు. దీని వెనుక వైసీపీ ఎన్నికల వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలోనే బీసీల రాగం అందుకుందని తెలుస్తోంది. సామాజిక న్యాయం గురించి అందుకే పాఠాలు చెబుతోందని అర్థమవుతోంది.

ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు గురించి విశ్లేషణ చేస్తే.. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడక కానుంది. ఎమ్మెల్యే, స్థానిక సంస్థలు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. స్థానిక సంస్థల విషయం చూసినట్టయితే.. ఏపీలోని స్థానిక సంస్థలు 90 శాతానికి పైగా వైసీపీ వశమయ్యాయి. టీడీపీ కనీసం పోటీ కూడా చేయలేదు. కొన్ని స్థానాలు మినహా వైసీపీకే ఏకపక్షంగా గెలుపు దక్కింది. ఇలాంటి నేపథ్యంలో స్థానిక సంస్థల అభ్యర్థుల గెలుపు సునాయాసం అని చెప్పవచ్చు. అదే సమయంలో ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయం చూస్తే.. వైసీపీకి 151 స్థానాలు ఉన్నాయి. వీటితో పాటు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల మద్దతు ఉంది. టీడీపీ బలం నామమాత్రం అని చెప్పవచ్చు. దీంతో ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వైసీపీ వైపే ఉంటుంది. ఇక గవర్నర్ కోటా .. గవర్నర్ కోటాలో కూడా వైసీపీ అభ్యర్థులే గెలిచే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే వైసీపీ ప్రకటించిన 18 ఎమ్మెల్సీ స్థానాలు సునాయాసంగా వైసీపీ వశమవుతాయని చెప్పవచ్చు.