
YCP: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. సర్వశక్తులు ఒడ్డుతున్నాయి, దీంతో అందరి చూపు ఉత్తరాంధ్రపైనే ఉంది. మొత్తం 37 మంది బరిలో ఉన్నా.. పోటీ మాత్రం నలుగురి మధ్యే ఉంది. అధికార వైసీపీ మద్దతుతో సీతంరాజు సుధాకర్, టీడీపీ మద్దతుతో వేపాడ చిరంజీవిరావు, బీజేపీ మద్దతుతో పీవీఎన్ మాధవ్, వామపక్షాల ఐక్యవేదిక పీడీఎఫ్ అభ్యర్థిగా కోరడ్ల రమాప్రభ పోటీచేస్తున్నారు. అయితే వైసీపీ ఈ ఎన్నికను చాలెంజ్ గా తీసుకుంది. విశాఖ రాజధానిగా ప్రకటించి పావులు కదుపుతున్న సమయంలో..ఎటువంటి ప్రతికూల ఫలితం వచ్చినా.. దాని ప్రభావం రాజధానిపై పడుతుందని అధికార పార్టీ నాయకులు విజయం కోసం అహోరాత్రులు తిరుగుతున్నారు. ఆ పార్టీ కీలక నాయకులు రంగంలోకి దిగారు. ప్రచారం చేయడంతో పాటు సామ, వేద, దండోపాయాలకు దిగుతున్నట్టు జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో కింది స్థాయి సిబ్బందికి చెప్పించి ఓట్లు వేయించే పనిలో ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను అడ్డంపెట్టుకొని ఓట్లు కొల్లగొట్టేందుకు వైసీపీ నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. కొందరు అధికారులు ప్రభుత్వ పెద్దల మెప్పుకొసం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతో సమావేశమై అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశాలివ్వడం సంచలనమైంది. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు కూడా వెళ్లింది. విజయనగరంలో కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులకు అధికార పార్టీ మద్దతు తెలుపుతున్న నేతకు పరిచయం చేసిన సమగ్ర శిక్ష పీవోను సరెండర్ చేశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో సచివాలయ ఉద్యోగులు కరపత్రాలు పట్టుకొని ప్రచారం చేయడం సంచలనంగా మారింది.
అయితే ఎలాగైనా గెలవాలన్న ప్రయత్నంలో అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి చుట్టూ ఇప్పుడు బెదింపుల ఆరోపణలు రావడం హాట్ టాపిక్ గా మారింది. విశాఖలో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ, డైరెక్టర్లను కలిశారు. గిరిజన కార్పొరేషన్ చైర్మన్, ఇంటర్ బోర్డు ప్రాంతీయ సమన్వయకర్తను సైతం కలిసి చర్చించారు. దిగువస్థాయి సిబ్బందితో ఓటువేయించాలని కోరినట్టు సమాచారం. మీకేం కావాలో నేను చూసుకుంటా.. అధికార పార్టీ బలపరచిన అభ్యర్థికి ఓటు వేయించే బాధ్యత నాది. వినకపోతే దూర ప్రాంతానికి బదిలీ చేయండి అంటూ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. అటు వైసీపీ శ్రేణులు ఉత్తరాంధ్రలో మొహరించాయి. విశాఖలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్, ముత్యాలనాయుడు, విజయనగరంలో మంత్రి బొత్స, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి రాజన్నదొర ప్రచారంలో నిమగ్నమయ్యారు.
ప్రధానంగా వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, గృహసారథులు ప్రచారంలో కీలక భాగస్థులుగా ఉన్నారు. పంపకాల పర్వానికి సైతం సిద్ధపడుతున్నారు. ఓటుకు రూ.5 వేలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఏయూను టార్గెట్ చేసుకొని ఓ విశ్రాంత రిజిస్ట్రార్ పంపకాల పర్వానికి తెరలేపినట్టు సమాచారం. పట్టభద్రుల జాబితాను పట్టుకొని వారికి ఫోన్లు చేస్తున్నారు. పనులు చేసిపెడతామంటూ ప్రలోభపెడుతున్నారు. మరో అడుగు ముందుకేసి ఏకంగా ఫోన్ పే ద్వారా నగదు మళ్లిస్తున్నారు. అయితే విశాఖ, విజయనగరం జిల్లాలతో పోల్చుకుంటే శ్రీకాకుళంలో అధికార పార్టీ స్తబ్ధుగా ఉంది. అందుకే కీలక నాయకులు రంగంలోకి దిగారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు టార్గెట్లు ఇచ్చారు.