YCP Govt- Amravati Farmers: రాజమండ్రి వరకూ ఒక ఎత్తు.. అక్కడ నుంచి మరో ఎత్తు. మహా పాదయాత్ర ఎలా చేస్తారో చూస్తామన్నట్టుంది వైసీపీ నేతల వ్యవహార శైలి. ఇన్నాళ్లూ కవ్వింపు చర్యలతో సరిపుచ్చుకున్న వారు రాజమండ్రిలో ఏకంగా దాడులకే దిగారు. మహిళలని చూడకుండా అసభ్యకర పదజాలంతో దూషించారు. వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లు, చివరకు మురుగు నీరు నింపిన సీసాలు, చెప్పులు, రాళ్లతో దాడిచేశారు. వీరంగం సృష్టించారు. 37 రోజుల కిందట అమరావతి రైతులు పాదయాత్ర ప్రారంభించారు. అప్పటి నుంచి వైసీపీ నాయకులు అడుగడుగునా అడ్డు తగులుతూ వస్తున్నారు. అడ్డంకులు సృష్టించారు. వాటన్నింటినీ ప్రజాస్వామ్యయుతంగా అధిగమించి అమరావతి రైతులు పాదయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. వాస్తవానికి అమరావతి రైతుల పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం పన్నాగం పన్నింది. శాంతిభద్రతలను సాకుగా చూపి పోలీస్ శాఖ ద్వారా అడ్డుకునే ప్రయత్నంచేసింది. చివరకు అమరావతి జేఏసీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాదయాత్రకు అనుమతి లభించింది. కోర్టు ఆదేశాలతో పాదయాత్రకు పోలీసులే రక్షణ కల్పించాల్సి వచ్చింది. అయితే విశాఖలో పవన్ ను అడ్డుకున్నామని సంబరాలు చేసుకుంటున్న వైసీపీ.. ఇప్పడు అమరావతి రైతులపై దాడులకు తెగబడింది.

అయితే అమరావతి రైతులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. పేరుకే పోలీసు రక్షణ కానీ.. దారిపొడవునా అడ్డగింతలు, దుర్భాషలతో అసౌకర్యానికి గురవుతున్నాయి. అయినా సంయమనంతో, సహనంతో ముందుకు సాగుతున్నారు. అయితే రాష్ట్ర పోలీస్ బాస్ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటన వైసీపీ శ్రేణులకు అలుసుగా మారింది. మీరు మూడు రాజధానులకు మద్దతుగా నిరసనలు తెలుపుకోండి…కానీ అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవద్దని చెప్పడం దేనికి సంకేతం. అటువంటప్పుడు అధికార పార్టీగా ఉన్న వైసీపీ ఎందుకు తగ్గుతుంది? అసలే తన మాట కాదని పాదయాత్ర చేస్తున్నారని జగన్ అండ్ కో అమరావతి రైతులపై కర్కశాన్ని కడుపులో నింపుకున్నారు. స్వయంగా రాష్ట్ర పోలీస్ బాసే ప్రకటన జారీచేసే సరికి నిరసనల మాటున వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. దాని ఫలితం, పర్యవసానమే రాజమండ్రిలో అమరావతి రైతుల పాదయాత్రపై దాడి.
అటు పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారు. సీఎం పర్యటనకు మూడెంచల భద్రత కల్పించే పోలీస్ శాఖ విపక్ష నాయకులు, ప్రజా సంఘాలు చేపట్టే కార్యక్రమాలకు మాత్రం ముఖం చాటేస్తున్నారు. సవాలక్ష నిబంధనలు, ముందస్తు అరెస్టులతో నిర్బంధాలను కొనసాగిస్తున్నారు. గతంలో ఎమర్జెన్సీ నాటి కాలంలో ముందస్తు అరెస్టులనే మాట వినిపించేది. ఇప్పుడు సీఎం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరారో లేదో ప్రజా సంఘాల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం లేదు. ఇచ్చినా నిబంధనలు, కొర్రీలు పెడుతున్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు వైసీపీ వ్యతిరేకంగా ఉందని తెలుసు.. అడ్డుకుంటుందని తెలుసు.. విధ్వంసాలకు దిగుతుందని నిఘా వర్గాలు హెచ్చరించాయి కూడా. అయినా పోలీసులు రక్షణ కల్పించలేని స్థితిలో ఉన్నారంటే.. దానిని ఏమనుకోవాలి? ఎలా అర్ధంచేసుకోవాలి. ఇదంతా పొలిటికల్ ఫ్రీ ప్లాన్ గా చేసినట్టు తెలుస్తోంది. మున్ముందు ఇలాంటి దాడులు, ప్రతిఘటనలను అమరావతి రైతులు ఎన్నో ఫేస్ చేయాల్సి ఉంటుందని మాత్రం వైసీపీ స్పష్టమైన సంకేతాలివ్వడంలో సక్సెస్ అయ్యింది.

వాస్తవానికి రాజమండ్రిలో పాదయాత్ర అడుగెట్టిన నాటి నుంచో ఏదో జరుగుతుందని అంతా ఊహించారు. వైసీపీ శ్రేణులు ఏర్పాటుచేసిన సభా స్థలి కూడా అభ్యంతరకరంగా ఉంది. దీనిపై పోలీసులు కూడా అడ్డుచెప్పారు. కానీ ఎంపీ మార్గాని భరత్ మాత్రం తాము కలెక్టర్ నుంచి అనుమతులు తెచ్చుకున్నామని.. దబాయించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు మాత్రం ఊరుకోలేదు. దీంతో సభా స్థలిని మార్చారు. అయితే ఏదో జరుగుతుందని ఊహించిన పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే అమరావతి రైతులు వైసీపీ శ్రేణుల భౌతికి దాడిని ఎదుర్కొనేవారు. అయితే నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నా.. జిల్లా ఇన్ చార్జి ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి రాజమండ్రిలో కనిపించలేదు. జిల్లా ఎస్పీగా ఉన్న ఐశ్వర్య రస్తోగి ఇటీవల కేంద్ర కొలువులకు వెళ్లిపోయారు. దీంతో ఇన్ చార్జిగా ఉన్న కోనసీమ ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అసలు రాజమండ్రి వైపు తొంగి చూడకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
ఉత్తరాంధ్ర గర్జన నాడే పవన్ జనవాణి కార్యక్రమాన్ని పెట్టుకోవడాన్ని వైసీపీ శ్రేణులు తప్పుపట్టాయి. మరి అమరావతి రైతుల మహా పాదయాత్ర జరిగినప్పుడు వైసీపీ అలజడులు సృష్టించడానికి పోటీగా కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఆ పార్టీ ఎలా సమర్థించుకుంటుందో చూడాలి. పాదయాత్ర నిర్వహణ బాధ్యతను న్యాయస్థానం పోలీసులకు అప్పగించింది నిజం. అరసవల్లి వరకూ దిగ్విజయంగా ముగించేలా ఆదేశాలిచ్చింది. కానీ సాక్షాత్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలుచేయలేని దౌర్భాగ్య స్థితిలో ఏపీ పోలీసు శాఖ ఉండడం సిగ్గుచేటు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మహా పాదయాత్ర విశాఖ, తరువాత విజయనగరం, అటు తరువాత శ్రీకాకుళం జిల్లాకు చేరుకోవాల్సి ఉంది. అయితే రాజమండ్రి ఇష్యూ జస్ట్ శాంపిలే అన్నట్టు వైసీపీ సంకేతలిచ్చింది. మున్ముందు తన వికృతరూపం చూస్తారని కూడా హెచ్చరికలు పంపినట్టయ్యింది.