New Ration Cards: ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే పెన్షన్ ను రూ. 3 వేలకు పెంచి అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. లక్షలాదిగా కార్డులను అందించి ఈనెల నుంచి రేషన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవడం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా 1,11,321 రేషన్ కార్డులను వైసీపీ సర్కార్ మంజూరు చేసింది. వాటి పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. సచివాలయ ఉద్యోగులు వాటిని పంపిణీ చేస్తున్నారు. ఇలా కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒకవేళ వివిధ కారణాలతో కొత్త కార్డు అందకపోయినా రేషన్ అందించాలని నిర్ణయించింది. కార్డు మంజూరైనట్లు జాబితాలో పేరు ఉంటే.. ఆధార్ కార్డు ఆధారంగా రేషన్ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.
సంక్రాంతి తర్వాత ఏ క్షణం అయినా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. జగన్ ఒకవైపు అభ్యర్థుల ఎంపిక, పార్టీ కార్యకలాపాలు చూస్తూనే.. మరోవైపు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారు. సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని భావిస్తున్నారు. కాగా రేషన్ కార్డుల పంపిణీని వేడుకగా జరపాలని ప్రభుత్వం ఆదేశించింది.