https://oktelugu.com/

YCP: సంక్షేమం సరే.. జాబ్ క్యాలెండర్లు, మెగా డీఎస్సీలు ఏవి జగనన్న?

గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ తెరపైకి తెచ్చారు. హోదా తేవడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపణలు చేశారు. హోదా వచ్చి ఉంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడేవని అభిప్రాయపడ్డారు.

Written By:
  • Dharma
  • , Updated On : January 25, 2024 / 01:41 PM IST
    Follow us on

    YCP: జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు ఐదేళ్లు అవుతోంది. మరో రెండు నెలల గడువు మాత్రమే ఆయన ప్రభుత్వానికి ఉంది. అన్ని చేశానని జగన్ చెబుతున్నారు. ఇప్పుడు ప్రజలు వద్దన్నా దిగిపోతానని సానుభూతి మాటలు ఆడుతున్నారు. అయితే ఆయన ఏం చేశారు? ఏం చేయలేదు? అన్నదానిపై లోతైన చర్చ నడుస్తోంది. అభివృద్ధి కంటే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. కానీ కొన్ని అంశాల్లో స్పష్టమైన వెనుకబాటు కనిపిస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగం పెరిగింది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఆశించిన స్థాయిలో కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న విమర్శ ఉంది. లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని.. ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని.. మెగా డీఎస్సీ తో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తానని జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఇందులో విఫలం చెందారన్న విమర్శ ఎక్కువగా ఉంది.

    గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ తెరపైకి తెచ్చారు. హోదా తేవడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపణలు చేశారు. హోదా వచ్చి ఉంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడేవని అభిప్రాయపడ్డారు. తాను అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్లతో పాటు మెగా డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. కానీ ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు? ఎన్ని మెగా డీఎస్సీలు ఇచ్చారు? అని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పలేని స్థితిలో జగన్ ఉన్నారు. ఐదేళ్లలో ఐదు జాబ్ క్యాలెండర్లు ఇచ్చి ఉంటే ఆయన చెప్పినట్టు లక్షల్లో కాకున్నా వేలల్లో ఉద్యోగాలు దక్కే అవకాశం ఉండేది. ఒకే ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ప్రకటించినా దాని ఫలితం కంటే కీడే ఎక్కువ. వృధా ప్రయాసే తప్ప ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు లేవు. ఇటీవల గ్రూప్స్ ఉద్యోగాల పేరుతో నోటిఫికేషన్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకునే విధానంలో అడ్డుకట్ట వేశారు. అందుకే జాబ్ క్యాలెండర్లు అంటేనే నిరుద్యోగులు మండిపోయేటంత పరిస్థితి ఏపీలో దాపురించింది.

    ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అన్న మాట వైసీపీ పాలనలో వినిపించలేదు. చంద్రబాబు హయాంలో ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియను సైతం నిలిపివేశారు. నాలుగు సంవత్సరాలుగా అదిగో డీఎస్సీ.. ఇదిగో డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ భ్రమలు కల్పించారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామంటూ కబుర్లు చెబుతున్నారు. మెగా డీఎస్సీ అని పెద్ద పెద్ద మాటలు చెప్పడంతో గత నాలుగు సంవత్సరాలుగా నిరుద్యోగ అభ్యర్థులు వ్యయ ప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల్లో కోచింగ్ తీసుకుంటున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ఉపాధ్యాయ పోస్టుపై ఆశలు పెట్టుకుని అహోరాత్రులు శ్రమిస్తున్నారు. కానీ ఎన్నికల ముంగిట మెగా డీఎస్సీను ప్రకటించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. దీంతో సీరియస్ గా దృష్టి పెట్టిన వారి ఆశలపై నీళ్లు చల్లారు. జగన్ చెప్పినట్టు ప్రత్యేక హోదా లేదు. జాబ్ క్యాలెండర్ లేదు. మెగా డీఎస్సీ ప్రకటన లేదు. కానీ తన పాలనలో అన్ని సవ్యంగా అయినట్లు సంతోషం వ్యక్తం చేస్తూ జగన్ చేస్తున్న ప్రకటనలే కొంచెం అతిగా ఉన్నాయి. సంక్షేమం విషయంలో జగన్ చెబుతున్న మాటలో వాస్తవం ఉన్నా.. ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రం ఆయన చెబుతున్న మాటలకు నిరుద్యోగ యువత కనీసం విశ్వసించడం లేదు. ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.