Amaravathi: అమరావతి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ ఎటువంటి కట్టడాలు లేవు. అయినా, భవిష్య నగరాల్లో ఒకటిగా అమరావతి స్థానం సంపాదించుకుంది. ఇదెలా సాధ్యమైంది. భవిష్య స్మార్ట్ సిటీల్లో అమరావతి ఒకటని ప్రఖ్యాత మ్యాగజైన్ ఆర్కిటెక్చర్ డైజస్ట్ నమూనాలతో సహా ప్రచురించింది.
ఢిల్లీలోని ల్యూటెన్స్, న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ స్ఫూర్తిగా అమరావతి నగరాన్ని నిర్మించాలని ప్రతిపాదన. మొత్తం విస్తీర్ణంలో 60 శాతం పచ్చదనం ఉండేలా ప్లాన్ లో పేర్కొన్నారు. సైక్లింగ్ మార్గాలు, వాటర్ బోటింగ్, విద్యుత్ వాహనాలతో పూర్తిస్థాయి టెక్నాలజీతో అభివృద్ధి చేయాలనేది ఆలోచన. ఇందుకోసం వివిధ సంస్థల నుండి ప్లాన్లను ఆహ్వానించారు. వాటిలో పోస్టర్ అండ్ పార్ట్ నర్స్ సమస్త బృహప్రణాళికను రూపొందించింది. ఇది పూర్తయిన తర్వాత ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా వెలుగొందేది.
అమరావతి కంటే ముందు వరుసలో మెక్సికో స్మార్ట్ సిటీ, అమెరికాలోని టోలేసా, చైనాలోని చెంగ్డు స్కై వ్యాలీ, దక్షిణ కొరియాలోని ఓషియా నిక్స్ భూసన్ ఉన్నాయి.
రాజధాని అంశం కోర్టులో ఉన్నప్పటికీ అమరావతి మాత్రం ప్రపంచం దృష్టిలో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిగానే ఉంది. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు రాష్ట్ర మీడియానే కాకుండా దేశ, అంతర్జాతీయ మీడియా హర్షం వ్యక్తం చేస్తూ కథనాలు ప్రచురించింది. చంద్రబాబును దార్శకునిగా ఆకాశానికి ఎత్తాయి. అప్పట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా సప్త జలాలను తీసుకువచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ కూడా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నా ఒప్పుకున్నారు. అంతేగాక రాజధాని ప్రాంతం తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఉంటున్నట్లు ప్రకటించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు అమరావతిని రాజధానిగా నిర్ణయించి పెద్ద తప్పిదం చేశారని జగన్ విమర్శించడం ప్రారంభించారు. మూడు ప్రాంతాల అంశాలను తెరపైకి తీసుకువచ్చారు.
తాజాగా ‘‘ఆర్కిటెక్చర్ డైజెస్ట్’’ మేగజైన్ భవిష్యత్తులో అత్యద్భుత నగరాల్లో అమరావతికి 6వ స్ధానం కల్పించింది.
అమరావతికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించడంపై టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేత పవన్ కల్యాణ్ కూడా అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపి అమరావతికే ఓటు వేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అమరావతి సరైనదని అనిపిస్తున్నా, ఒక్క వైసీపీ మాత్రం అందుకు ఒప్పుకోకపోవడానికి రాజకీయ కారణాలేనన్న స్పష్టమవుతుంది. అక్కడ గ్రాఫిక్స్ తప్ప.. ఏం లేదన్న జగన్ వాదనలకు భిన్నంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడంపై ఆయన ఏం చెబుతారోనని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.