https://oktelugu.com/

OYO Ritesh Agarwal : ఒకప్పుడు సిమ్ కార్డులు అమ్మిన ఈ వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలోనే రెండో యువ బిలియనీర్.. ఓయో రితీష్ సక్సెస్ స్టోరీ

ఇతర దేశాల్లోనూ అందుబాటు ధరలకే ఓయో సంస్థ.. రూమ్స్ ను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇలా 22 సంవత్సరాలకే రితేష్ అగర్వాల్ బిలియనీర్ అయ్యాడు. సిమ్ కార్డులు అమ్ముకునే దశ నుంచి 9000 కోట్లకు యజమానిగా ఎదిగాడు.

Written By:
  • Rocky
  • , Updated On : July 13, 2023 / 10:13 PM IST
    Follow us on

    OYO Ritesh Agarwal Success Story: కష్టేఫలి అంటారు కదా.. ఇతడు విషయంలో అది నూటికి నూరుపాళ్ళు నిజమైంది. అదృష్టం తలుపు తట్టినప్పుడే అవకాశాలను వినియోగించుకోవాలి అని అంటారు కదా.. అది ఇతడి విషయంలో రుజువైంది. ఇంకా ఇలాంటి ఉపమానాలు ఎన్ని ఉపయోగించినా ఇతడి ఆర్థిక విజయం ముందు దిగదుడుపే. అంతలా ఎదిగిపోయాడు మరి. మార్కెట్ వర్గాలు రాకెట్ లాంటి అతని వ్యాపార వేగాన్ని చూసి మరో గౌతం ఆదాని అవుతాడని కీర్తిస్తున్నారు. ఇండియన్ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని మరీ ముఖ్యంగా ఆతిధ్య రంగాన్ని మర్మియే షేక్ చేస్తాడని చెబుతున్నారు. ఇంతకీ ఎవరు అతడు? బిజినెస్ సక్సెస్ స్టోరీ ఏంటో? మీరూ చదివేయండి.

    డిగ్రీ కూడా పాస్ కాలేదు

    రితేష్ అగర్వాల్.. ఈ పేరు కంటే.. ఓయో రితేష్.. అని గూగుల్లో టైప్ చేస్తే తెలుస్తుంది అతగాడి వ్యాపార స్టామినా. కేవలం 29 సంవత్సరాల ఈ యువకుడు ఆతిథ్య రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. డిగ్రీ కూడా పాస్ కాని ఈ యువకుడు కార్పొరేట్ వ్యాపారస్తులకు కొత్త బిజినెస్ పాఠాలు చెబుతున్నాడు. ప్రతి ఏడాది తన వ్యాపారాన్ని అంతకంతకు విస్తరిస్తూ వేల కోట్లకు ఎదుగుతున్నాడు. వాస్తవానికి రితేష్ అగర్వాల్ పెట్టుబడి పెట్టింది రిలయన్స్ లాంటి పెట్రో కెమికల్స్ వ్యాపారం లోనో, మహీంద్రా లాంటి ఆటోమొబైల్స్ లోనో, టాటా లాగా ఎయిర్ లైన్స్ లోనో కాదు. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించని ఆతిథ్య రంగంలో.. ఆతిథ్యరంగం అంటే పెద్దపెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ కాదు.. సూటిగా చెప్పాలంటే హోటల్ రూమ్స్ .. అవి కూడా త్రీ స్టార్ కంటే తక్కువ.. అందులోనే పెట్టుబడి పెట్టి కనీవినీ ఎరుగని స్థాయిలో లాభాలు గడించాడు. ఇప్పటికీ ఇంకా గడిస్తూనే ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దేశంలో ఉన్న హోటల్ రూమ్స్ మొత్తం ఇప్పుడు ఓయో కంపెనీ చేతిలోకి వెళ్లాయి. మార్కెట్లో సుమారు 90% వాటా ఈ కంపెనీది అంటే ఆశ్చర్యం కలిగించక మానదు.

    అదే కలిసి వచ్చింది

    మనం విహారయాత్రకో, మరేదైనా పని నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు.. మన మదిలో మెదిలే మొదటి ఆలోచన ఎక్కడ ఉండాలని? ఏదైనా హోటల్లో ఉండాలి అంటే సవాలక్ష నిబంధనలు.. దీనికి తోడు స్థానికేతర సమస్య. ఇక ధర గురించి ఆలోచిస్తే.. జేబు మొత్తం ఖాళీ అయిపోతుంది.. సరిగా ఇలాంటి సమస్యను తన ఇంట్లోకి బంధువులు రావడం ద్వారా స్వయంగా ఎదుర్కొన్న రితేష్ అగర్వాల్ ఓయో ఆలోచనకు తెరదీశాడు. సిమ్ కార్డులు అమ్మిన అనుభవంతో.. అనుకోకుండా లభించిన ఫెలోషిప్ తో.. వ్యాపారం మొదలుపెట్టాడు. ముందుగా తన సొంత రాష్ట్రం ఒడిశా బిస్సాంకటక్ పట్టణంలో చిన్న స్థాయి హోటల్స్ లో ఉన్న గదులను అద్దెకి తీసుకున్నాడు. నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో ఈ పట్టణంలో సౌకర్యాలు అంతంత మాత్రం గానే ఉండేవి. ఈ పట్టణంలో పని ఉండి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి గదులు దొరకడం చాలా ఇబ్బందికరంగా మారేది. రితేష్ అగర్వాల్ ఈ పట్టణంలో ఖాళీగా ఉన్న గదుల వివరాలను ఒక యాప్ రూపంలోకి తీసుకువచ్చాడు. దీనికి తోడు తక్కువ ధరలోనే మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించే లాగా ఏర్పాటు చేశాడు. ముందుగానే ఆ హోటల్స్ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది విజయవంతం కావడంతో క్రమక్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించడం మొదలుపెట్టాడు. ఇలా అతడి ఓయో రూమ్స్ మార్కెట్ విలువ 79,360 కోట్లకు చేరుకుంది.

    19 సంవత్సరాలకే చదువు మానేశాడు

    ఒడిశా రాష్ట్రానికి చెందిన రితేష్ అగర్వాల్ 19 సంవత్సరాల వయసులోనే చదువు మానేశాడు.. చదువు మానేయడంతో అందరూ అతడిని ఎగతాళి చేసేవారు. వీటిని లెక్కచేయకుండా పారిశ్రామికవేత్త కావాలన్న అతని కల సహకారం చేసుకునేందుకు ధైర్యంగా ముందడుగు వేశాడు. చదువు మానేసిన తర్వాత రితేష్ ఇంట్లో గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉండడానికి ఇంట్లో చోటు కూడా లేకపోయేది. ఈ నేపథ్యంలో సిమ్ కార్డులు అమ్ముకుంటూ రితేష్ జీవనం సాగించేవాడు. ఒకరోజు ఇంట్లో ఏదో కార్యక్రమం ఉండడంతో చుట్టాలు వచ్చారు. దీంతో ఇంట్లో వారి అల్లరి ఎక్కువైంది. మరోవైపు బంధువులు టీవీని ఎక్కువ సౌండ్ పెట్టుకొని చూసేవారు. రితేష్ ఎంత కంట్రోల్ చేసుకున్నా అతని వల్ల కాకపోయేది. దీంతో ఓయో రూమ్స్ ఆలోచనకు బీజం పడింది. కానీ డబ్బులు లేకపోవడంతో వెంటనే అమలు చేయలేకపోయాడు. కంపెనీ ప్రారంభం కోసం డబ్బుల కోసం వేచి చూస్తున్న క్రమంలో ప్రముఖ రచయిత “పీటర్ తీల్” ఫెలోషిప్ కు ఎంపికయ్యాడు. ఈ ఫెలోషిప్ తో రితేష్ కు లక్ష డాలర్లు అంటే దాదాపుగా 80 లక్షలు సహాయంగా అందాయి. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ డబ్బులతో ఓయో రూమ్స్ స్థాపించాడు రితేష్. క్రమంగా ఓయో రూమ్స్ కు ఆదరణ పెరిగింది. ఇలా దేశవ్యాప్తంగా అది విస్తృతమైంది. ఇప్పుడు ఇతర దేశాల్లోనూ అందుబాటు ధరలకే ఓయో సంస్థ.. రూమ్స్ ను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇలా 22 సంవత్సరాలకే రితేష్ అగర్వాల్ బిలియనీర్ అయ్యాడు. సిమ్ కార్డులు అమ్ముకునే దశ నుంచి 9000 కోట్లకు యజమానిగా ఎదిగాడు.