Womens Day In Chicago: అంతర్జాతీయ మహిళా దినోత్సవం దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈరోజున మహిళలు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళలు సాధించిన విషయాల గురించి చెప్పుకున్నారు. వివిధ రంగాల్లో మహిళలు చేసిన గొప్పదనం గురించి చాటి చెప్పారు. అయితే విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ముఖ్యంగా చికాగోలోని ఆంధ్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు ఆకట్టుకున్నాయి. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..
చికాగో ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో మార్చి 9న మహిళా వేడుకలను నేషనల్ ఇండియా హబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర సంఘం అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుపల్లి, గీతిక మండల, అనురాధ గంపాల, సౌమ్య బొజ్జల ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళా దినోత్సవ కార్యక్రమానికి తెలుగు మహిళలంతా ఒక్కచోటుకు చేరారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు. ప్రత్యేక కార్యక్రమాల్లో సరదాగా గడిపారు.
నేషనల్ ఇండియా హబ్ లో కార్యక్రమానికి ముందు వేదికను కృష్ణ జాస్తి, తమిశ్ర కొంచాలలు అందంగా అలంకరించారు. ఆ తరువాత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా గణపతి ప్రార్థనా గీతం ఆలపించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ సైనీ నర్ వాదే, మాలతీ రామరాజులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మహిళలు సాధించిన విజయాల గురించి చాటి చెప్పారు. అనంతరం వివిధ రంగాల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు ప్రత్యేక బహుమతులు అందించారు.
మరోవైపు కార్యక్రమం అనంతరం ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లను నరేశ్ చింతమాని, సుజాత అప్పలనేనిలు చేశారు. మయూరి సహకారంతో మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో చికాగో ఆంధ్ర సంఘం ధర్మక్తలు డాక్టర్ భార్గవి నెట్టెం, పవిత్ర కరుమూరి, డాక్టర్ ఉమ కటికి, మల్లీశ్వరి పెదమల్లు, శివబాల జట్ల తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.