
Women’s Day 2023: “పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. వారికి పాలించడం ఓ లెక్కా” ఆడవాళ్ళ రాజకీయ ప్రవేశం గురించి ఓ సినిమాలో డైలాగ్ ఇది. కానీ దీనిని మీద జీవితంలో ఘనత వహించిన రాజకీయ నాయకులు నిజం చేయలేకపోతున్నారు. ఫలితంగా లోక్ సభ లో మహిళల ప్రాతినిధ్యం 15% మించడం లేదు. 9 రాష్ట్రాల్లో అయితే 9% లోపు ఉండటం గమనార్హం. ఇక దేశానికే రోల్ మోడల్ అని డప్పులు కొట్టే బీఆర్ ఎస్ పాలన ఉన్న తెలంగాణ లో 4% మాత్రమే అంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ గణాంకాలు చాలు నేతలు మహిళలకు ఏ స్థాయిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తున్నారో చెప్పేందుకు.
ఆఫ్రికా.. పేద ఖండం.. కానీ ఆ ఖండం లో రువాండా లో 61%, క్యూబా 53%, గల్ఫ్ దేశం యూఏఈ పార్లమెంట్ లో 50% మహిళలు చట్ట సభల్లో సభ్యులుగా ఉన్నారు. ఇక భారత్ లో మహిళల ప్రాతినిధ్యం 14%, రాజ్యసభలో 12%. ఇక సగానికి పైగా రాష్ట్రాల్లో మహిళ ఎమ్మెల్యేల సంఖ్య 5% లోపే. లోక్ సభ లో 543 స్థానాలు ఉండగా, మహిళా సభ్యుల సంఖ్య ఎన్నడూ 15% మించలేదు. లోక్ సభ లో ఇప్పటివరకు మహిళల ప్రాతినిధ్యం 14.4% మించలేదు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 8,054 మంది అభ్యర్థులు పోటీ చేయగా… వీరిలో మహిళలు 284(3.54%) మాత్రమే. ఇక వీరిలో గెలిచిన వారు 78(14.36%).

లోక్ సభ తో పోలిస్తే రాజ్య సభ లో మహిళల సంఖ్య మరింత తక్కువగా ఉంది.. ప్రస్తుత రాజ్యసభలో 29 మంది ఎంపీలు కాగా… మొత్తం సీట్లలో వీరిది 12.24 %. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ మహిళా ఓటర్ల సంఖ్య పురుషులతో సమానంగా ఉంటున్నది. కొన్ని చోట్ల 52% మించుతోంది. మొన్నటి దాకా నాగాలాండ్ రాష్ట్రంలో మహిళా ప్రాతినిధ్యమే లేదు. ఇక ఇటీవలి ఎన్నికల్లో ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కాగా 40 స్థానాలు ఉన్న మిజోరాం అసెంబ్లీలో ఒక్క మహిళా ప్రతినిధి లేరు.
తెలంగాణలో ఐదుగురే
తెలంగాణ రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికలు 9 మంది మహిళలు విజయం సాధించారు. అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఉన్నారు.. 2018 ఎన్నికలు ఐదుగురు మాత్రమే గెలిచారు. వీరిలో సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సీతక్క ములుగు, పద్మా దేవేందర్ రెడ్డి మెదక్, హరిప్రియ ఇల్లందు, సునీత ఆలేరు ఎమ్మెల్యేలుగా కొనసాగుతుండగా, సత్యవతి రాథోడ్ మంత్రిగా కొనసాగుతున్నారు.