ODI World Cup 2023 : వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ కనీసం సెమీ ఫైనల్ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి సెమీస్‌కు ఒక అడుగు దూరంలో ఆగిపోయింది. ఈ ప్రభావం పాకిస్తాన్ క్రికెట్‌ను కకావికలు చేస్తోంది. ఈ దారుణమైన వైఫల్యానికి కారణంగా మొదట బాబర్ ఆజంను కెప్టెన్‌గా దిగిపోవాలంటూ అభిమానులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. అంతకు ముందు చీఫ్ సెలెక్టర్‌గా ఉన్నా ఇంజమామ్ ఉల్ హాక్ వరల్డ్ కప్ మధ్యలోనే వైదొలిగారు. తాజాగా బౌలింగ్ కోచ్, సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ మోర్న్ మోర్కెల్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పీసీబీ ఓ పత్రికా ప్రకటన ద్వారా ధృవీకరించింది.
జూన్‌లోనే నియామకం..
వాస్తవంగా మోర్కెల్ ఈ సంవత్సరం జూన్ నెలలోనే ఆరు నెలల కాంట్రాక్టు కోసం బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఈ డిసెంబర్‌లో గడువు ముగుస్తుంది. వరల్డ్ కప్ వైఫల్యం కారణంగా ఈ లోపే రాజీనామా చేయడం విశేషం. ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ బౌలింగ్ ఎటాక్ యావరేజ్‌గా కనిపించింది. దీంతో ఆయనపై బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సందర్భంగా మోర్కెల్ పాకిస్థాన్ తరఫున తన సేవలను ప్రారంభించాడు. ప్రపంచ కప్ అతని చివరి టోర్నమెంట్. మోర్నీ మోర్కెల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఆఫ్రికా తరఫున మొత్తం 247 మ్యాచ్‌లు ఆడాడు. 318 ఇన్నింగ్స్‌లలో 544 వికెట్లు తీయగలిగాడు. మోర్కెల్ టెస్ట్ క్రికెట్‌లో 160 ఇన్నింగ్స్‌లో 27.67 సగటుతో 309 వికెట్లు, వన్డేల్లో 114 ఇన్నింగ్స్‌లలో 25.32 సగటుతో 188 వికెట్లు, టీ20లో 44 ఇన్నింగ్స్‌లలో 25.34 సగటుతో 47 వికెట్లు సాధించాడు.
ఫేవరెట్‌గా కనిపించి..
ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు జట్టు టైటిల్ పేవరేట్లలో ఒకటిగా పరిగణించబడింది. కానీ టోర్నమెంట్ ప్రారంభమయ్యాక అంచనాలు మారిపోయాయి. లీగ్ దశలో పాకిస్తాన్ తన తొమ్మిది మ్యాచ్‌లలో నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. ఐదు మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. 2023 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఐదో స్థానంతో తన పోరాటాన్ని ముగించింది.