Reliance – Walt Disney : చమురు నుంచి మొదలు పెడితే వస్త్రాల వరకు, జియో ఫోన్ నుంచి మొదలుపెడితే జియో సినిమా వరకు.. అన్ని రంగాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ.. మరో సంచలనానికి తెర లేపారు. బుధవారం భారతీయ మీడియా రంగంలోనే “సెన్సేషన్ బాండింగ్” కుదుర్చుకున్నారు. ఈ డీల్ ద్వారా మీడియా రంగంలో నెంబర్ వన్ కావాలి అనే అతని కల నెరవేరేందుకు ఎంతో సమయం పట్టదని నిపుణులు చెబుతున్నారు.
జీ, సోనీ విలీనం జరుగుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఏం జరిగిందో.. ఆ డీల్ ఆగిపోయింది. ఆ తర్వాత తెరపైకి అనూహ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ ఒప్పందం వచ్చింది. అయితే ఇది జరుగుతుందా? అని చాలామంది దీర్ఘాలు తీశారు. కానీ వారందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ రెండు సంస్థలకు సంబంధించిన మీడియా వ్యాపారాలైన వయా కామ్ 18, వాల్ట్ డిస్నీ విలీనానికి పరస్పరం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ రెండు సంస్థలు కలిపి 70,352 కోట్ల విలువైన సంయుక్త భాగస్వామ్యం ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. సంయుక్తంగా ఏర్పాటు చేసే సంస్థలో రిలయన్స్ 11,500 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. వాస్తవానికి ఈ రెండు సంస్థల మధ్య ఎప్పటినుంచో డీల్ నడుస్తోంది. అయితే అది కార్యరూపం దాల్చకపోవడంతో ఇది జరగదని చాలామంది ఒక అంచనాకు వచ్చారు. కానీ వారందరి అనుమానాలను రిలయన్స్, వాల్ట్ డిస్నీ పటాపంచలు చేశాయి.
బుధవారం కుదిరిన ఒప్పందం ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన వయాకాం 18 స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో విలీనం అవుతుంది. అలా ఏర్పడిన సంయుక్త సంస్థకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సారధ్య బాధితులు వహిస్తుంది. విలీన సంస్థలో రిలయన్స్ కంపెనీకి 16.34 శాతం, వయా కాం 18 కి 46.82 శాతం, డిస్నీ సంస్థకు 36.84 శాతం చొప్పున వాటాలు లభిస్తాయి. ఈ విలీన సంస్థకు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు.
ఈ ఒప్పందాన్ని భారత వినోద పరిశ్రమలో పెను సంచలనమని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ అన్నారు. “ప్రపంచంలో ఉత్తమ మీడియా గ్రూపులో ఉన్న డిస్నీతో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం సంతోషంగా ఉంది. దీనివల్ల మా వ్యాపార అభివృద్ధి మరింత సాధ్యమవుతుంది. దేశంలో ప్రేక్షకులకు తక్కువ ధరకే కంటెంట్ అందించడం సాధ్యమవుతుంది. మా గ్రూపులోకి డిస్నీ కంపెనీని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఒప్పందం ద్వారా దేశంలోనే అతిపెద్ద మీడియా కంపెనీగా అవతరిస్తున్నాం. ప్రేక్షకులకు నాణ్యమైన ఎంటర్టైన్మెంట్ అందించడం ఇకపై మా బాధ్యత.” అని అంబానీ పేర్కొన్నారు..”రిలయన్స్ సంస్థతో చేతులు కలపడం ద్వారా మా బాధ్యత మరింత పెరిగింది. వారితో కలిసి ప్రయాణం చేయడం ఆనందంగా ఉంది.. ఈ బంధం మరింత బలోపేతం అవుతుందని” డిస్నీ సీఈవో బాబ్ ఐగర్ పేర్కొన్నారు.
అతిపెద్ద మీడియా ఒప్పందంగా చెబుతున్న వాల్ట్ డిస్నీ, రిలయన్స్ కలయికకు ఇంకా నియంత్రణ సంస్థలు, వాటాదారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పటికిప్పుడు కాకుండా ఈ రెండు సంస్థల కలయికకు మరో కొంతకాలం పట్టవచ్చని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024 చివరి త్రైమాసికం లేదా 2025 తొలి త్రైమాసికానికి విలీన ప్రక్రియ పూర్తవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. విలీనం పూర్తయితే ఏర్పడే సంస్థ దేశంలోనే అతిపెద్ద వినోద రంగ సంస్థల్లో ఒకటిగా నిలుస్తుంది. స్టార్ ఇండియా పరిధిలో ఎనిమిది భాషల్లో 70 చానల్స్ ప్రసారాలు కొనసాగిస్తున్నాయి. రిలయన్స్ కు చెందిన వయా కామ్ 18 పరిధి నుంచి 38 ఛానల్స్ ప్రసారాలు సాగిస్తున్నాయి. రెండూ కలిపి 120 టీవీ చానల్స్ ఒకే గొడుగు కిందికి వస్తాయి. ఇవి మాత్రమే కాకుండా స్టార్ గ్రూప్ నకు డిస్నీ హాట్ స్టార్, వయాష్ కాం 18 కు జియో సినిమా అనే ఓటీటీ వేదికలు ఉన్నాయి.