https://oktelugu.com/

Revanth Reddy : తెలంగాణకు కేంద్రం సహకరిస్తోందా? రేవంత్ ఏం మంత్రం వేశారు?

మొత్తానికి నెల బాలుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చాలానే రాటు తేలినట్టు కనిపిస్తోంది. అంటే ఈ ఐదేళ్లు ఇలానే ఉంటుందంటే.. చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అది కాంగ్రెస్. ఆ పార్టీలో ఏదైనా జరగవచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : January 8, 2024 / 12:55 PM IST
    Follow us on

    Revanth Reddy : గతంలో అంటే సరిగ్గా ఒక నెల క్రితం కేంద్రం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అగ్గిమీద గుగ్గిలమయ్యేది. తాము ఎన్ని ప్రతిపాదనలు పంపినప్పటికీ కేంద్రం సహకరించడం లేదని ఆరోపించేది. భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసేవారు. నరేంద్ర మోడీ పిసినారి అని, కేవలం గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే ఆయన అన్నీ చేస్తారని.. తెలంగాణ విషయంలో మొండి చేయి చూపుతారని ఆరోపించేవారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల నుంచి మొదలుపెడితే ముఖ్యమంత్రుల సమీక్షల వరకు ఢిల్లీకి వెళ్లడానికి తెలంగాణ నిరాసక్తత ప్రదర్శించేది. చివరికి ఆగస్టు 15, జనవరి 26 కు సంబంధించి ఢిల్లీలోని ఎర్రకోట లో నిర్వహించే స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శకటాలు కూడా పంపేదికాదు. అక్కడిదాకా ఎందుకు కొన్ని కొన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కూడా అందజేసేది కాదు. ఫలితంగా అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పూడ్చలేనంత ఆగాథం ఏర్పడింది. కెసిఆర్ ప్రతి విషయంలో రాజకీయాల కోణం లోనే చూడటంతో ఈ పరిస్థితి దాపురించిందని అప్పట్లో ఆరోపణలు వినిపించేవి. ఎన్నికల్లో ఓటమి అనంతరం భారత రాష్ట్ర సమితి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అటు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మెల్లిగా పాలనపై పట్టు బిగిస్తోంది.

    ఈ దేశంలో రాష్ట్రాల మీద పెత్తనం సాగించేది కేంద్రం కాబట్టి.. చాలా విషయాలు దాని ఆధీనంలోనే ఉంటాయి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి వివిధ పనులు, కేంద్ర సర్వీసుల ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించి వినతులు సమర్పించుకుంటాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఇదే దిశలో కేంద్రంతో సయోధ్య కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. రేవంత్ రెడ్డి ఏం మంత్రం వేసారో తెలియదు గాని కాంగ్రెస్ అంటేనే మండిపడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రేవంత్ రెడ్డి కోరగానే అపాయింట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించినప్పుడు సాదానంగా విన్నారు. అంతేకాదు వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేంద్రం సహకారం ఉంటుందని ఆయనకు హామీ ఇచ్చారు.. గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తనను ఈ విధంగా కోరలేదని.. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉంటాయని.. తెలంగాణ రాష్ట్రానికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ప్రకటించారు.. అంతేకాదు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా హైదరాబాదులో ఉన్న రక్షణ శాఖకు సంబంధించిన భూముల బదాలయింపుకు కూడా ఓకే చెప్పారు. దీనివల్ల కంటోన్మెంట్ ఏరియాలో అభివృద్ధి పనులు వేగంగా జరిగే అవకాశం ఉంది. ఇక ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా నిధుల కేటాయింపుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం తీసుకునే వివిధ రుణాలకు సంబంధించి కూడా వెసులుబాటు కల్పించారు. ఇక కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఐపీఎస్ ల కేటాయింపుల విషయంలో సానుకూలత వ్యక్తం చేశారు. ఇవే విషయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

    గతంలో తెలంగాణ ప్రభుత్వం తరఫునుంచి కేంద్రానికి పెద్దగా ప్రతిపాదనలు వెళ్లేవి కాదని.. ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినా ముఖ్యమంత్రి స్వాగతం పలికే వారు కాదని.. పైగా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వస్తే వినూత్న విధానాలలో నిరసనలు తెలిపే వాళ్ళని.. కానీ అలాంటి పద్ధతులను తాను అవలంబించుకోవాలని అనుకోవడం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.. రాష్ట్రానికి కేంద్రం సహకారం అవసరం కాబట్టి.. బిజెపితో మాకు రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ.. దానిని ఎన్నికల సమయం వరకే చూస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసే విషయాన్ని కూడా రాహుల్ గాంధీతో చెప్తే.. ఆయన పచ్చ జెండా ఊపారని.. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్లాలని సూచించారని రేవంత్ వివరించారు. అంటే ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి కాగానే ఒకసారిగా లౌక్యాన్ని ఒంట పట్టించుకున్నారు. అందుకే ఒక రాజకీయ నాయకుడికి వ్యూహ చతురతతో పాటు అణిగిమణిగి ఉండాలనే కనీస స్పృహ కూడా ఉండాలి. అప్పుడే అతడిని అందరూ ఆదరిస్తారు. కెసిఆర్ విషయంలో లోపించింది ఇదే. రేవంత్ విషయంలో కనిపిస్తోంది ఇదే. అంటే నెలరోజుల పాలనలోనే అలా ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కావచ్చు. అన్నం వండేటప్పుడు ఉడికిందా లేదా అని చూడడానికి రెండు లేదా మూడు మెతుకులు మాత్రమే పట్టి చూస్తాం. బియ్యం మొత్తాన్ని కాదు. రేవంత్ పాలన విషయంలోనూ కొన్ని లోపాలు ఉండొచ్చు. ఢిల్లీకి వెళ్తున్నప్పుడు భట్టి విక్రమార్కను తీసుకెళ్తున్నప్పుడు అనుమానాలు రావచ్చు. కానీ ఆయన ప్రభుత్వంతో వైరం కోరుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వానికి సహకరించండి అని మాత్రమే అడుగుతున్నారు. రాధాకృష్ణతో చెప్పిన మాటల ద్వారా కేంద్రం కూడా తనకు అనుకూలమే అని పరోక్షంగా రేవంత్ సంకేతాలు ఇచ్చారు. ఇక్కడ తనపై విమర్శలు చేస్తున్న బిజెపి నాయకులకు కూడా సరైన సమాధానం చెప్పారు. అటు బిజెపితో పొత్తు కోసం వెంపర్లాడుతున్న భారత రాష్ట్ర సమితి నాయకులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికి నెల బాలుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చాలానే రాటు తేలినట్టు కనిపిస్తోంది. అంటే ఈ ఐదేళ్లు ఇలానే ఉంటుందంటే.. చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అది కాంగ్రెస్. ఆ పార్టీలో ఏదైనా జరగవచ్చు.