SC Classification: తెలంగాణలో ఎన్నికలకు మరొక ఐదు రోజులు ఉన్నాయి. ఈ లోగానే పలు ఆసక్తికతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సంవత్సరాలుగా మూలన పడి ఉన్న కీలక సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాయి.. ముఖ్యంగా ఎన్నికలవేళ అవి తెరపైకి రావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ఆయా సామాజిక వర్గాల్లోనూ చర్చకు దారితీస్తున్నాయి. ఇక ఇటీవల ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేయడం తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఎస్సీ వర్గీకరణకు తన మద్దతు ఉంటుందని మందకృష్ణ మాదిగ ప్రకటించడం ఒక్కసారిగా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎస్సీ వర్గీకరణకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని నరేంద్ర మోడీ హామీ ఇవ్వడం.. ఇచ్చిన హామీ మేరకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేయడం ప్రస్తుతం ప్రాధాన్య సంతరించుకుంది.. వాస్తవానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గత 12 రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వేదికగా జరిగిన మాదిగల విశ్వరూప సభలో కీలక ప్రకటన చేశారు. అనంతరం ఇచ్చిన మాటను అమలులో పెట్టేశారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కమిటీ ఏర్పాటుకు నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు.. అంతేకాకుండా కేబినెట్ సెక్రటరీ తో పాటు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది.
30 ఏళ్ల పోరాటం
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు. అప్పట్లో పలు మార్లు వర్గీకరణకు సంబంధించి ఆయన ఉద్యమాలు కూడా చేశారు. కొన్ని పాలక ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి తర్వాత దాటవేశాయి. ఇన్ని సంవత్సరాలకు నరేంద్ర మోడీ రూపంలో మందకృష్ణ మాదిగ పోరాటానికి ఒక తుది రూపు వచ్చింది. మందకృష్ణ మాదిగ కోరుకున్నట్టుగానే వర్గీకరణకు సంబంధించి తాము కట్టుబడి ఉన్నామని నరేంద్ర మోడీ ప్రకటించడం.. అందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడంతో మందకృష్ణ మాదిగ పోరాటం ఫలించే సూచనలే కనిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన విశ్వరూప సభకు వచ్చినప్పుడు.. ఆ వేదిక మీద ఉన్న మందకృష్ణ మాదిగ ఉద్వేగానికి గురయ్యారు. ఆయనను గుండెలకు హత్తుకొని నరేంద్ర మోడీ అనునయించారు.. నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ కోసం తీసుకున్న నిర్ణయాన్ని మందకృష్ణ మాదిగ అభినందించారు. ఆయన తనకు లభించిన పెద్ద అన్నగా కొనియాడారు. ఇదే సమయంలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని.. అతడు నాకు చిన్న సోదరుడు లాంటివాడని పేర్కొన్నారు. అతని పోరాటం వల్లే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముందడుగు పడిందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని బిజెపి ఆకాంక్ష అని నరేంద్ర మోడీ అప్పట్లో స్పష్టం చేశారు. అంతేకాదు మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామని.. వన్ లైఫ్ వన్ మిషన్ లాగా పోరాటం చేస్తున్నారని కొనియాడారు.
గేమ్ చేంజ్ అవుతుందా
వర్గీకరణకు సంబంధించి నరేంద్ర మోడీ కమిటీని ఏర్పాటు చేయడం వల్ల రాజకీయ సమీకరణాలు మారుతాయని విశ్లేషకులు అంటున్నారు. నరేంద్ర మోడీ తీసుకున్న ఈ నిర్ణయం ఇటు తెలంగాణలో మాత్రమే కాకుండా దేశం మొత్తం ప్రభావం చూపిస్తుందని వారు అంటున్నారు. తెలంగాణలో బీసీల తర్వాత ఎస్సీ ఓటర్లే అధికంగా ఉన్నారు. గత రెండు పర్యాయాలు వీరు తెలంగాణ రాష్ట్ర సమితికి జై కొట్టారు. అయితే వీరిని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే భారత రాష్ట్ర సమితి వాడుకుంటుంది అనే ఆరోపణలు ఉన్నాయి. పైగా వీరి సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో దళితులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్య అయినటువంటి వర్గీకరణ చేపట్టాలని నరేంద్ర మోడీ నిర్ణయించారు. దీనివల్ల తెలంగాణ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా బిజెపికి దళితుల నుంచి మద్దతు లభిస్తుందని నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని బిజెపి వర్గాలు అంటున్నాయి. అయితే తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో దళితుల వర్గీకరణ తమకు మైలేజ్ తీసుకువస్తుందని బిజెపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 33 స్థానాల్లో ప్రభావం చూపిస్తామని మొన్నటిదాకా బిజెపి నాయకులు అనుకున్నారు. అయితే తాజాగా ఎస్సీ వర్గీకరణకు నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపడంతో ఆ ప్రభావం మరిన్ని నియోజకవర్గాలపై ఉంటుందని బిజెపి నాయకులు చెబుతున్నారు.