CM Revanth Reddy: గులాబీ పార్టీని మోడీ అంతం చేస్తారా? రేవంత్ రెడ్డి తో ఏం చెప్పారు?

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కొంతకాలం అనంతరం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు కూడా ఉన్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : January 21, 2024 12:19 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: రాజకీయాలలో పరస్పర అవసరాలు మాత్రమే ఉంటాయి. ఆ అవసరాలు ఉన్నంతవరకే ఉభయ కుశలోపరి అనే ప్రశ్నలుంటాయి. ఆ తర్వాత ఎవరి దారి వారిదే. అంటే పైకి నవ్వులు.. లోపల కత్తులు.. 2014లో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. కొంతకాలం పాటు రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగింది. ఆ తర్వాత తేడా కొట్టింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి రెండు పార్టీలు చేరుకున్నాయి. ఈ పార్టీల రాజకీయాల్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ వంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే అనూహ్యంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కొంతకాలం అనంతరం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించారు. రేవంత్ రెడ్డి అడిగిన కొన్ని కోరికలను నరేంద్ర మోడీ మన్నించారు. కొన్ని పథకాలకు సంబంధించి నిధులు కూడా మంజూరు చేశారు. సహజంగానే కాంగ్రెస్ పార్టీ అంటే మండిపడే నరేంద్ర మోడీ.. రేవంత్ రెడ్డి కలవగానే సానుకూలంగా స్పందించారు. భుజం తట్టి అభినందించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తమ తోడ్పాటు ఉంటుందని ప్రకటించారు.. అయితే ఇక్కడ వరకే మీడియాలో వచ్చింది.. వారి ముగ్గురి మధ్య ఏం చర్చ జరిగింది? నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డికి ఏం చెప్పారు? దానికి భట్టి ఏం సమాధానం చెప్పారు. అయితే ఇప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకున్నారు. సాధారణంగా ఇంటర్వ్యూలో కొన్ని సానుకూల ప్రశ్నలుంటాయి. కొన్ని అననుకూల ప్రశ్నలు కూడా ఉంటాయి. అయితే రేవంత్ రెడ్డి ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు రాధాకృష్ణ మొదటి దానిని మాత్రమే ఎంచుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య జరిగిన ప్రైవేట్ సంభాషణలో రేవంత్ రెడ్డి కొన్ని విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఆ విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. అందులో ప్రముఖమైనది తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితిని లేకుండా చేయడం.. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని కలిసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితిని లేకుండా చేయండి.. కెసిఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకూడదు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీతో నాకు వైరుధ్యం ఉన్నప్పటికీ.. కెసిఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా బలపడకూడదు అని నరేంద్ర మోడీ చెప్పినట్టు తెలుస్తోంది.. అయితే నరేంద్ర మోడీ చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటే భారత రాష్ట్ర సమితి స్థానంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. భారతీయ జనతా పార్టీ బలపడితే రేవంత్ రెడ్డి పార్టీని వాళ్లు అధికారంలో సజావుగా ఉంచగలుగుతారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే కర్ణాటకలో ఉన్న సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని తాము కూల్చివేస్తామని ఇప్పటికే అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకటిస్తున్నారు. మహారాష్ట్రలో ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ చెప్పినట్టు చేస్తారా? లేక భారత రాష్ట్ర సమితిని తనకు ప్రత్యర్థిగానే ఉంచుకుంటారా? ఒకవేళ భారత రాష్ట్ర సమితి ఆయనకు ప్రత్యర్థిగా ఉంటే రేవంత్ రెడ్డిని అంత సులువుగా పరిపాలన చేయనిస్తారా? మరి ఇన్ని ప్రశ్నల మధ్య రేవంత్ రెడ్డి ఎలాంటి అడుగులు వేస్తారో? సొంత పార్టీ నాయకులను ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో? కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.