Chandrababu’s strategies : ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ ఇన్ ఛార్జ్ ల ను ప్రకటిస్తుంటే.. టీడీపీ అదే స్థాయిలో అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తోంది. గురువారం 34 మందితో రెండవ జాబితాలో విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా కడప జిల్లా విషయంలో చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేసినట్టు కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో గత ఎన్నికల్లో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా చేసినట్టు అనిపిస్తోంది. ఇలా గట్టి అభ్యర్థులను ప్రకటించడం పట్ల అధికార పార్టీలోనూ చర్చ జరుగుతోంది.
కడప.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా. గత ఎన్నికల్లో ఇక్కడ క్లీన్ స్వీప్ చేశారు. ఈసారి ఎన్నికల్లో ఇక్కడ టిడిపికి అభ్యర్థులు ఉంటారా? జగన్మోహన్ రెడ్డి కి ఎదురొడ్డి పోటీ చేస్తారా? అనే ప్రశ్నలు ఉదయించాయి. వాటన్నింటినీ పక్కనపెట్టి చంద్రబాబు బలమైన అభ్యర్థులను తెరపైకి తీసుకువచ్చారు. వారికి ఎలాంటి హామీలు ఇచ్చారో పక్కన పెడితే.. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయిలో అభ్యర్థులను నిలబెట్టారు. ముఖ్యంగా అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో చంద్రబాబు చేసిన కూర్పు ఒకింత ఆసక్తికరంగా కనిపిస్తోంది. కడప జిల్లాలో కమలాపురం అభ్యర్థిగా పుత్తా చైతన్య రెడ్డి, ప్రొద్దుటూరు అభ్యర్థిగా నంద్యాల వరదరాజుల రెడ్డిని ప్రకటించారు. వాస్తవానికి కమలాపురంలో నర్సింహారెడ్డికి టికెట్ ఇస్తారని చర్చ జరిగింది. యువతలో మంచి పట్టు ఉన్న అతని తనయుడు చైతన్యను చంద్రబాబు బరిలో దింపారు. ప్రొద్దుటూరు విషయంలో టికెట్ కు సంబంధించి తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక్కడ టిడిపి ఇన్చార్జిగా ప్రవీణ్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన టికెట్ కోసం చివరి వరకు పోరాడారు. ఈయన మాత్రమే కాకుండా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, టిడిపి రాష్ట్ర నాయకుడు సీఎం సురేష్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చివరి వరకు ప్రయత్నం చేశారు. ఒకానొక దశలో టికెట్ తమకే దక్కిందంటూ ప్రచారం చేసుకున్నారు. వాస్తవానికి వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. అయితే ఇలాంటి నేపథ్యంలో వరదరాజుల రెడ్డికి చంద్రబాబు టికెట్ ఖరారు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
ఇక ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. వరదరాజుల రెడ్డి వద్దే శివ ప్రసాద్ రెడ్డి రాజకీయాలు నేర్చుకున్నారు. శివ ప్రసాద్ రెడ్డి ని ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా నియమించింది వరద రాజుల రెడ్డే. కార్యక్రమంలో ఇద్దరు మధ్య రాజకీయ విభేదాలు నెలకొనడంతో శివప్రసాద్ రెడ్డి వరదరాజుల రెడ్డితో దూరం జరిగారు.. ఇదే క్రమంలో వైయస్ చనిపోవడం, వైసిపిని జగన్ ఏర్పాటు చేయడం.. జగన్ కు నమ్మకస్తుడిగా శివ ప్రసాద్ రెడ్డి కొనసాగడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందువల్లే శివ ప్రసాద్ రెడ్డికి జగన్ మోహన్ రెడ్డి రెండుసార్లు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు. ఇక మూడోసారి టిడిపి ద్వారా శివప్రసాద్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇదే సమయంలో దాదాపు 83 సంవత్సరాల వయసు ఉన్న వరదరాజుల రెడ్డిని చంద్రబాబు నియమించడం ఆసక్తికరంగా మారింది.. మరి ఈ పాచికలు కడప జిల్లాలో వర్క్ అవుట్ అవుతాయా? లేదా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుంది.