https://oktelugu.com/

Telangana Group 1: బంగారు తెలంగాణలో 1.5 కోట్లు లేవు.. అందుకే గ్రూప్_1 రద్దయింది

గతేడాది అక్టోబరు-16న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు బయో మెట్రిక్‌ తీసుకోగా.. ఈ ఏడాది జూన్‌-11న రెండోసారి నిర్వహించిన పరీక్షకు మాత్రం తీసుకోలేదు. పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం వెనక ప్రధాన కారణం కూడా ఇదే.

Written By:
  • Rocky
  • , Updated On : September 25, 2023 / 02:19 PM IST
    Follow us on

    Telangana Group 1: వందల కోట్లు ఖర్చుపెట్టి కొత్త సచివాలయం కట్టొచ్చు. వేల కోట్లు ఖర్చు చేసి కాలేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద పెట్టి బాండ్ల మీద బాండ్లు కుదువ పెట్టి అప్పులు తీసుకురావచ్చు. కానీ తెలంగాణ కోసం కొట్లాడిన యువతకు కోటిన్నర ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి మనసు రాలేదు. ఫలితంగా గ్రూప్_1 రద్దయింది. ఇదేదో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ కాదు.. సాక్షాత్తూ హైకోర్టులో వాదనల సందర్భంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాయర్ స్పష్టికరించిన తీరు. ప్రశ్న పత్రంపై కనీసం హాల్ టికెట్ నెంబర్ ముద్రించేందుకు కూడా టీఎస్ పీఎస్సీ వద్ద పైసలు లేవని చెప్పడం విశేషం. దేశంలోనే సంపన్న రాష్ట్రంలో కొలువులు భర్తీ చేసే కమిషన్ దుస్థితి ఇలా దిగజారింది అంటే దీనికి కచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వేలాది కోట్లను ప్రాజెక్టుల కోసం, వందలాది కోట్లను మీడియాలో ప్రచారం కోసం ఖర్చు చేసే ప్రభుత్వం పోస్టుల భర్తీ నిర్వహణ కోసం కోటిన్నర కూడా ఇవ్వలేదంటే ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. “గ్రూప్‌-1ప్రిలిమినరీ పరీక్షలో బయో మెట్రిక్‌ అమలు చేసేందుకు రూ.1.5 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పటికిప్పుడు ఆ మొత్తాన్ని సమకూర్చుకోలేం. అందుకే, ఆ విధానాన్ని తొలగించాం.”
    హైకోర్టులో వాదనల సందర్భంగా టీఎస్ పీఎస్సీ న్యాయవాది చెప్పారంటే ఉద్యోగుల భర్తీపై ప్రభుత్వ ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు.

    నిజానికి, నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రతిసారీ నిధుల కొరత లేకుండా గతంలో ప్రభుత్వాలు స్పెషల్‌ ఫండ్‌ విడుదల చేసేవి. కానీ, గ్రూప్‌-1 ఉద్యోగ నియామకాల ప్రకటన వెలువడిన తర్వాత సర్కారు ప్రత్యేక నిధులేమీ ఇవ్వలేదు. కనీసం గ్రూప్‌-1 పరీక్ష ఒకసారి రద్దు అయ్యాక కూడా నిధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు. నిధుల సమస్య తీవ్రంగా ఉన్నందునే పరీక్ష నిర్వహణకు సంబంధించిన భద్రతాపరమైన అంశాల్లో కమిషన్‌ రాజీ పడాల్సి వచ్చిందని స్పష్టమవుతోంది. పోలీసు కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల దరఖాస్తుకు వసూలు చేసే రుసుము రూ.1000. అలాగే, ఇటీవల ముగిసిన గురుకుల ఉపాధ్యాయుల పోస్టుల దరఖాస్తులకు రుసుము రూ.1000. త్వరలో జరగనున్న జూనియర్‌ లెక్చరర్ల పరీక్షకు అభ్యర్థులు చెల్లించిన రుసుము రూ.1000. ఇలా టీఎస్ పీఎస్సీ తప్ప ఇతర నియామక బోర్డులు నిర్వహించే ప్రతి పరీక్షకు దరఖాస్తు రుసుము కింద వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఏమీ విడుదల చేయడం లేదు. దాంతో, ఖర్చంతా దరఖాస్తు రుసుము ద్వారానే వసూలు చేస్తున్నారు. కానీ, రాష్ట్రంలోనే అత్యున్నత పరీక్షగా భావించే గ్రూప్‌-1 పరీక్షకు మాత్రం టీఎస్ పీఎస్సీ రూ.200 దరఖాస్తు రుసుముగా వసూలు చేసింది. దరఖాస్తు రుసుము అందరికీ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో రుసుము తక్కువ వసూలు చేస్తున్నారు. అయితే, పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలంటే అన్ని భద్రతా చర్యలూ తీసుకోవడానికి ఒక్కొక్కరికి దాదాపు రూ.1000 వరకూ ఖర్చవుతుంది. ఇక్కడ ఒక్కో దరఖాస్తుకు అదనంగా చేయాల్సిన 800 రూపాయలను టీఎస్ పీఎస్సీకి ఎవరు ఇవ్వాలి? నిజానికి, ఈ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే నిధులను కేటాయించాల్సిన సర్కారు.. తన బాధ్యతను విస్మరించినందునే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రెండోసారి రద్దుకు ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.

    గతేడాది అక్టోబరు-16న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు బయో మెట్రిక్‌ తీసుకోగా.. ఈ ఏడాది జూన్‌-11న రెండోసారి నిర్వహించిన పరీక్షకు మాత్రం తీసుకోలేదు. పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం వెనక ప్రధాన కారణం కూడా ఇదే.పరీక్షల నిర్వహణలో ఫెయిల్‌ ‘మా కొలువులు మాకే’ అన్న ప్రధాన నినాదంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తయిన తర్వాత కానీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. ఎట్టకేలకు, నోటిఫికేషన్‌ ఇచ్చినా.. తొలిసారి పేపర్‌ లీకేజీతో పరీక్షను రద్దు చేసింది. అప్పటికే ఉద్యోగాలు వదులుకుని.. సుదీర్ఘకాలంపాటు సెలవులు పెట్టుకుని.. కోచింగ్‌ సెంటర్లకు లక్షలాది రూపాయలు చెల్లించుకుని రాత్రింబవళ్లు ప్రిపేరైన అభ్యర్థులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక్కడ లీకేజీ కుట్ర మొత్తం టీఎస్ పీఎస్సీ వేదికగానే సాగడంతో అటు కమిషన్‌, ఇటు ప్రభుత్వం అభాసుపాలయ్యాయి. దాంతో, మళ్లీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను నిర్వహించాల్సి వచ్చింది. ఒకసారి అభాసుపాలు కావడంతో రెండోసారి నిర్వహణకు ఇటు టీఎస్ పీఎస్సీ అటు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుని ఉండాలి. కానీ, టీఎస్ పీఎస్సీలో ఎటువంటి ప్రక్షాళన చేయకుండా తొలిసారి ప్రిలిమ్స్‌ను నిర్వహించిన బృందంతోనే మళ్లీ పరీక్ష నిర్వహించారు. మరోసారి నిర్వహణలో కూడా టీఎస్ పీఎస్సీ దారుణంగా విఫలమైంది. ఈసారి పరీక్ష నిర్వహణలో అసమర్థత, నిర్లక్ష్యం బయటపడ్డాయి. దాంతో, ఇటు టీఎస్ పీఎస్సీతోపాటు అటు ప్రభుత్వంపై అభ్యర్థులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే మిగిలిన నోటిఫికేషన్ల సందర్భంగా వసూలు చేసినట్లు వెయ్యి రూపాయలు దరఖాస్తు రుసుము పెడితే తామే ఇచ్చే వాళ్లమని, ఉద్యోగాలు వదులుకుని, కోచింగ్‌ సెంటర్లకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన తమకు మరో రూ.800 పెద్ద ఇబ్బంది కాబోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ, ప్రభుత్వ తీరుతో ఇప్పుడు తమకు ఆర్థిక, మానసిక, శారీరక క్షోభ తప్పడం లేదని మండిపడుతున్నారు.

    గత ఏడాది అక్టోబరు 16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నిర్వహించాక.. టీఎస్ పీఎస్సీ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఫ్యాక్చువల్స్‌ కంటే అనలిటిక్‌కు ప్రశ్నల్లో ప్రాధాన్యమిచ్చింది. పుస్తకాలు చదివి సంపాదించే విజ్ఞానం కంటే.. లోకజ్ఞానం, కరెంట్‌ అఫైర్స్‌కు ప్రాముఖ్యతనిచ్చింది. యూపీఎస్సీని మించి అత్యంత కఠినంగా ప్రిలిమినరీని నిర్వహించిందని, దీన్ని బట్టి మున్ముందు యూపీఎస్సీ సహా.. మిగతా రాష్ట్రాల పీఎస్సీలు ప్యాటర్న్‌ను మార్చుకుంటాయనే విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ, పేపర్‌ లీకేజీ వ్యవహారం కారణంగా పరీక్ష రద్దుతో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీర్తి ఒక్కసారిగా అథఃపాతాళానికి పడిపోయింది. మరో వైపు ఒకసారి జరిగిన పొరపాట్లను సరిద్దుకుని ముందుకు సాగాల్సిన టీఎస్ పీఎస్సీ.. జూన్‌ 11వ తేదీన పరీక్ష తేదీని ప్రకటించడంలోనూ దుందుడుకుతనాన్ని ప్రదర్శించింది. కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరినా.. తమ నిర్ణయమే ఫైనల్‌ అన్నట్లు వ్యవహరించింది. తేదీ విషయంలో పునఃసమీక్షకు కూడా యోచన చేయలేదు. నిర్ణయించిన తేదీకి పరీక్ష జరిగి తీరుతుందని స్పష్టం చేసింది. కానీ, పకడ్బందీ చర్యలను విస్మరించింది. మొదటిసారి ప్రిలిమ్స్‌ సమయంలో ఒక్కో సెంటర్‌లో రెండు లేదా మూడు డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్లను (డీఎఫ్ ఎండీ), హ్యాండ్‌ హెల్డ్‌ మెటల్‌ డిటెక్టర్లను (హెచ్‌హెచ్‌ఎండీ) వినియోగించి అభ్యర్థులకు శల్య పరీక్షలను నిర్వహించింది. చేతి గడియారాలు, ఉంగరాలను కూడా అనుమతించలేదు. రెండోసారి పరీక్షను నిర్వహించినప్పుడు మాత్రం సెంటర్‌కు ఒకటి చొప్పున మాత్రమే డీఎ్‌ఫఎండీలను ఏర్పాటు చేసింది. హెచ్‌హెచ్‌ఎండీలు అక్కడక్కడా కనిపించలేదు. బయో మెట్రిక్‌ను కూడా విస్మరించి, హైకోర్టుతో మొట్టికాయలు కొట్టించుకుంది.