Radhakrishna – YS Sharmila : రాధాకృష్ణకు వైఎస్ షర్మిల లీక్స్ ఎందుకు ఇస్తోంది!

షర్మిల, సుబ్బారెడ్డి మధ్య జరిగిన సంభాషణ, వారి భేటీ గురించి ఆంధ్రజ్యోతికి మాత్రమే సమాచారం అందడం గమనార్హం. శర్మిల కావాలనే ఈ లీక్స్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Written By: NARESH, Updated On : January 1, 2024 7:36 pm
Follow us on

Radhakrishna – YS Sharmila : వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తన రాజకీయ భవిష్యత్‌పై ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈమేరకు ఆమెను ప్రమోట్‌ చేస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు కీలక అంశాలను లీక్‌ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఏబీఎన్‌ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ “ఎల్లో మీడియా” అని ప్రచారం చేస్తోంది. అలాంటి మీడియాకే షర్మిల రాజకీయపరమైన కీలక సమాచారం అందిస్తుండడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తన సోదరుడిపై షర్మిల తిరుగుబాటు చేసి తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నారనే వార్తలను మొదట ప్రచురించింది ఆంధ్రజ్యోతి. తెలంగాణలో పాదయాత్ర చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతే మొదట ప్రచురించింది. అదేవిధంగా, షర్మిలతో ఆమె మొదటి ఇంటర్వ్యూ చేసింది. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన “ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే” కార్యక్రమంలో ఆమెతో ముఖాముఖిగా మాట్లాడారు, అందులో ఆమె తన కుటుంబంలోని విభేదాల గురించి బహిరంగంగా మాట్లాడడం గమనార్హం.

తాజాగా ఏపీ పాలి‘ట్రిక్స్‌’..
తాజాగా షర్మిల ఏపీ పాలి‘ట్రిక్స్‌’ ప్లే చేస్తున్నారు. ఇందులో భాగంగానే షర్మిల కాంగ్రెస్‌తో చేతులు కలిపారని, అక్కడ పార్టీకి సారథ్యం వహించడానికి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని హైకమాండ్ ఆమెను అభ్యర్థిస్తుందని ఆంధ్రజ్యోతికి లీక్‌ ఇచ్చారని సమాచారం. మొదట్లో విముఖత వ్యక్తం చేసినా, చివరకు తెలంగాణ పార్టీని గాలికొదిలేసి ఆంధ్రాకు స్థావరం మార్చుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం అని కథనం ప్రచురించారు. ఈ పరిణామాలన్నీ షర్మిల తన ప్రణాళికలను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతికి లీక్ చేస్తున్నాయని చూపిస్తున్నాయి. షర్మిలను ఆంధ్రా రాజకీయాల్లోకి రాకుండా చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారంటూ సోమవారం కూడా ఆంధ్రజ్యోతి మరో కథనాన్ని ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం, షర్మిల ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించడం, ఆంధ్రా కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టడంపై జగన్ ఆందోళన చెందుతున్నారని, ఇది వైఎస్సార్‌సీపీలో పెద్ద దుమారాన్ని రేపుతుందని వండి వార్చారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన రాజకీయ యాత్రలో షర్మిలతోపాటు ఉంటానని ప్రకటించగా, ఆయనతోపాటు మరికొంత మంది చేరనున్నారు. 2014లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిన పాతకాలపు కాంగ్రెస్ నేతలు, క్యాడర్ షర్మిల పగ్గాలు చేపడితే మళ్లీ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని కథనంలో వివరించారు.

మామతో రాయబారం..
జగన్ మామ, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఎమ్యెల్యేగా షర్మిల వద్దకు పంపి, ఆంధ్రా రాజకీయాల్లోకి రావద్దని, అది వైఎస్ఆర్ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీస్తుందని ఆమెను అభ్యర్థించారని రాధాకృష్ణ కథనంలో రాశారు. తన సొంత అన్నపై ప్రచారం చేస్తే అది వైఎస్ఆర్ కుటుంబంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, చివరికి అన్నదమ్ములకు పెద్ద నష్టం వాటిల్లుతుందని సుబ్బారెడ్డి ఆమెకు చెప్పారు. అయితే సుబ్బారెడ్డి మాట వినేందుకు షర్మిల సున్నితంగా నిరాకరించారని రాధాకృష్ణ రాశారు. తనకు అవమానాలు ఎదురవుతున్నప్పుడు, తెలంగాణలో రోడ్డెక్కాల్సి వచ్చినప్పుడు మౌనంగా ఉన్నందుకు తన మామపై ఆమె విరుచుకుపడ్డారని ‘‘ఒక్కసారి కూడా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఒక్కరు కూడా కుటుంబంలోని వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. ఈ రోజు ఇప్పుడు జగన్ సంక్షోభంలో ఉన్నందున, నా రాజకీయ జీవితంలో అడ్డంకులు సృష్టించడానికి మీరు నా వద్దకు వచ్చారు’అని ఆమె మందలించారని తెలిపారు. షర్మిల, సుబ్బారెడ్డి మధ్య జరిగిన సంభాషణ, వారి భేటీ గురించి ఆంధ్రజ్యోతికి మాత్రమే సమాచారం అందడం గమనార్హం. శర్మిల కావాలనే ఈ లీక్స్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది.