Chandrababu: ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కీలకం. ఒక విధంగా చెప్పాలంటే జీవన్మరణ సమస్య. ఈ ఎన్నికల్లో గెలుపోటములపైనే తెలుగుదేశం పార్టీ ఉనికి ఆధారపడి ఉంది. గెలిస్తే చంద్రబాబుకు గౌరవప్రదమైన పదవీ విరమణ లభించనుంది. లేకుంటే మాత్రం చంద్రబాబు ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. అందుకే చంద్రబాబు వయసుకు మించి కష్టపడుతున్నారు.ఒకవేళ ఓటమి ఎదురైతే మాత్రం చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టడం ఖాయం. జగన్ ఎన్ని రకాల ఇబ్బందులు పెడతారో చంద్రబాబుకు తెలియంది కాదు.
గత నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబుపై రివెంజ్ తీర్చుకోవాలని జగన్ భావించారు. సరిగ్గా ఎన్నికల ముంగిట అవినీతి కేసులను మోపగలిగారు. సిఐడి ని అడ్డం పెట్టుకుని చంద్రబాబును అరెస్టు చేశారు. రిమాండ్ కు పంపించగలిగారు. 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచగలిగారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు రాజకీయ జీవితంలో మునుపేన్నడు లేని విధంగా పట్టు బిగించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కేసులు నమోదు చేసినా.. రాజకీయ కోణంలో ఆలోచించి చంద్రబాబును టచ్ చేయలేకపోయారు. చంద్రబాబు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారు. కానీ జగన్ అలా కాదు. సరైన టైమ్ చూసి స్కెచ్ వేశారు. కేసులతో చంద్రబాబు ఉనికిని ప్రశ్నార్థకం చేశారు.
ఈసారి గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వెనుక తనపై ఉన్న కేసులే కారణం. ప్రస్తుతం చంద్రబాబు అన్ని కేసుల్లో బెయిల్ పై ఉన్నారు. కేసులు వేసింది ఏపీ సిఐడి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే దర్యాప్తు సంస్థ అది. రేపు టిడిపి అధికారంలోకి వస్తే చంద్రబాబు చెప్పినట్టు సిఐడి ఆడుతుంది. అప్పుడు తనపై ఉన్న కేసులన్నీ విత్ డ్రా చేసుకుంటుంది. పొరపాటున వైసీపీ అధికారంలోకి వస్తే.. ఇప్పుడుకోర్టు పరిధిలో నడుస్తున్న అన్ని కేసుల్లో పట్టు బిగించే అవకాశం ఉంది. అది చంద్రబాబుకు ఏమంత శ్రేయస్కరం కాదు. 74 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు.. మరో ఐదు సంవత్సరాలు పాటు మాత్రమే యాక్టివ్ రాజకీయాలు చేయగలరు. ఇంతలో జైలు జీవితం పలకరిస్తే ఆయన రాజకీయ చరిత్రకు ఒక మాయని మచ్చగా నిలుస్తుంది. అందుకే చంద్రబాబు ఎన్నికల్లో గెలుపు కోసం వయసుకు మించి కష్టపడుతున్నారు. శక్తి యుక్తులను ప్రదర్శిస్తున్నారు.
మరోవైపు పార్టీ ఉనికి కూడా ఈ ఎన్నికలపై ఆధారపడి ఉంది. గతంలో 2004లో అధికారానికి తెలుగుదేశం పార్టీ దూరమైంది. కానీ అప్పటికే పోరాడేందుకు చంద్రబాబుకు వయసు ఉంది. అందుకే 2014 వరకు.. గెలుపు తలుపు తట్టే వరకు గట్టిగానే పోరాడారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం చంద్రబాబు వయసు 75 సంవత్సరాలు. ఈసారి కానీ ఎన్నికల్లో ఓటమి చవిచూస్తే ఆయన ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయలేరు. చేయాలనుకొని ప్రయత్నించినా ఆయన వయసు సహకరించదు. మరోవైపు కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతారు. జగన్ ఎంత ఇబ్బందులు పెట్టాలో అంతలా పెడతారు. అందుకే చంద్రబాబు తన శక్తికి మించి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు జనసేనతో పొత్తుకు తహతహలాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారానికి వెంపర్లాడుతున్నారు. మరోవైపు పార్టీలో సమన్వయం చేసుకుంటున్నారు. ఇన్ని ప్రయత్నాల వెనుక చంద్రబాబుకు కేసుల భయం వెంటాడుతోంది. అందుకే తన నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని రంగరించి మరి కృషి చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.