Heavy Rains: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకటే వర్షాలు. అది కూడా రోజుల తరబడి. గతంలో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం లేదు. వాగులు పొంగుతున్నాయి. వంకలు పొర్లుతున్నాయి. చెరువులు అలుగులు పోస్తున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. పట్టణాలు నీట మునుగుతున్నాయి. నగరాలు కాకావికలమవుతున్నాయి. కాలం కాని కాలంలో వర్షాలు కురుస్తుండడంతో మనిషి జీవితం అస్తవ్యస్తమవుతోంది. పంటలన్నీ చేతికొచ్చే సమయంలో జలార్పణమవుతున్నాయి. రోడ్లు కొట్టుకుపోతుండటంతో ప్రభుత్వానికి ₹కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. గతంలో ఒకటి లేదా రెండు మహా అయితే మూడు రోజుల వరకే వర్షం పరిమితమయ్యేది. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి కురిసేది. కానీ కొన్నేళ్ల నుంచి వర్షం కురిస్తే రోజుల తరబడి ఉంటున్నది.

ఎందుకు ఈ అకాల వర్షాలు
వాతావరణంలో ఆకస్మాత్తుగా చోటుచేసుకుంటున్న మార్పులకు అసలు కారణం భూమి వేడెక్కడం.. సైన్స్ పరిభాషలో చెప్పాలంటే గ్లోబల్ వార్మింగ్. భూమి మీద వాతావరణం సూర్యరశ్మీని గ్రహించి వేడెక్కుతుంది. ఆ వేడిని చుట్టూ వ్యాపింప చేస్తుంది. ఇదే లేకపోతే భూమి చల్లగా ఉండి అసలు జీవించడానికి పనికొచ్చేది కాదు. అయితే సహజంగా ఏర్పడే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు మనుషులు చేసే పనులు మరింత వేడిని పెంచుతున్నాయి. ఆధునిక వ్యవసాయం, పురుగు మందుల వాడకం పెరగటం, కాలుష్యం వల్ల మరిన్ని ఉద్ఘారాలు విడుదలై వాతావరణం లో వేడిని మరింత ఎక్కువ చేస్తున్నాయి. వాస్తవానికి వాతావరణంలో కార్బన్ డై యాక్సైడ్ సహజంగా ఉంటే ప్రకృతి సమతుల్యం అసలు చెడిపోదు. కానీ పెట్రోలు ఉత్పత్తుల వాడకం పెంచడంతోపాటు వాటి నుంచి వెలువడే కార్బన్డయాక్సైడ్ ను గ్రహించే చెట్లను ఇష్టానుసారంగా కొట్టేస్తుండటంతో కర్బన సంబంధ, సల్ఫర్ సంబంధ ఉద్గరాలు పెరిగిపోతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి తర్వాత గాలిలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు 30 శాతం, వాయువులు 140 శాతం పెరిగాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. పైన మండే సూర్యుడు కింద చల్లని సముద్రాలు ఉండగా పర్యావరణానికి మనం కలిగించగల నష్టం ఏపాటిదిలే అనుకున్న మనిషి… దాన్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. గనుల్ని ఇష్టానుసారంగా తవ్వడం, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఘన, ద్రవ, వాయు వ్యర్థాలను ఇష్టానుసారంగా గాలిలోకి, నీటిలోకి వదలడం వల్ల పర్యావరణ చక్రం గతి తప్పుతోంది. విద్యుత్ అవసరాలకు బొగ్గును మండిచడం, వ్యవసాయ అవసరాలకు, గృహ అవసరాలకు అడవులను ఇష్టానుసారంగా కొట్టేయడం, సముద్రాలను డంపింగ్ యార్డ్ లుగా మార్చడం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
Also Read: India- Russia: ఉక్రెయిన్, రష్యా యుద్ధం భారత్ రిటైర్లకు వరం

ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి
మనిషి శరీర ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగితేనే తట్టుకోలేడు. కొంతకాలంగా భూమి ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. మనిషి చేస్తున్న విధ్వంస పనులే భూమి వేడిని అంతకంతకు పెంచుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతల పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోంది. అక్కడ మంచు కరిగితే మనకొచ్చే ముప్పు చాలా తీవ్రంగా ఉంటుంది. అదే తీరిన కరుగుతూ ఉంటే ఈ శతాబ్దం అంతానికి సముద్ర నీటిమట్టం ఒక మీటర్ వరకు పెరుగొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మాల్దీవులు, సీ షెల్స్ వంటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన దీవులన్నీ మునిగిపోతాయి. లండన్, వియత్నాం నెదర్లాండ్స్ బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో చాలా భాగం ముంపునకు గురవుతుంది. అధికంగా సముద్రతీరం ఉన్న మనదేశంలోనూ నష్టం అపారంగా ఉంటుంది. కలకత్తా, చెన్నై, ముంబాయి, కేరళ వంటి వాటిపై ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది.

ఏపీలో నెల్లూరు మునిగిపోతుంది
972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో మునిగిపోయే జాబితాలో నెల్లూరు ముందుంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. శ్రీకాకుళంలోని లోతట్టు ప్రాంతాలకు, దివిసీమకు ముప్పు ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ శతాబ్దంలో మనిషికి అన్నింటికన్నా పెద్ద ముప్పు వాతావరణ మార్పుల వల్లే సంభవిస్తోందని తేల్చి చెప్తున్నారు. వర్షాలకు
హైదరాబాద్, చెన్నై, ముంబయ్, ఢిల్లీ, కలకత్తా వంటి మహా నగరాలు అతలాకుతలం అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మొన్న నవంబర్లో కురిసిన వర్షాలకు తిరుమల తో పాటు రాయలసీమ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాల్లో ఏటా వరదలు రావడం పరిపాటిగా మారింది. ఇక కేరళ రాష్ట్రాన్ని వరదలు వదలటం లేదు. ఈ మూడు రాష్ట్రాల పరిధిలో ఒకప్పుడు వేల కొద్దీ చెరువులు ఉండగా… ప్రస్తుతం ఆ సంఖ్య వందలకు పడిపోవడం సమస్య ఉత్పన్నమవ్వడానికి కారణంగా పర్యావరణ వత్తులు చెబుతున్నారు. చెరువు ముంపు ప్రాంతంలోనూ ఇళ్లు నిర్మించడం.. నాలాలను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టడం ద్వారా నీటి ప్రవాహం గతి తప్పి కాలనీలకు కాలనీలను ముంచేస్తోంది. ఇక అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంటలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల ఆహార కొరత ఏర్పడుతోంది.

పారిశ్రామిక అభివృద్ధికి కళ్లెం వేస్తేనే
జనాభాలో అతి త్వరలో చైనాను దాటే అవకాశం ఉన్న మన దేశంలో విపత్కర పరిస్థితులు ఉత్పన్నమైతే నా కుటుంబాలు ఆకలికి ఆల్మట్టించాల్సి వస్తుంది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి యువత రోడ్డు మీద పడతారు. వీటన్నింటికీ మూలం అభివృద్ధి పేరుతో చేస్తున్న విచ్చలవిడితనం. దీనికి కళ్లెం వేయాలి. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ఉత్పన్నమవుతున్న కాలుష్యానికి చెక్ పెట్టాలి. విరివిగా మొక్కలు నాటాలి. అవి వృక్షాలుగా ఎదిగేంతవరకు సంరక్షించాలి. ముఖ్యంగా అభివృద్ధి పేరుతో అడవులను ఇష్టానుసారంగా కొట్టేసే ప్రక్రియకు స్వస్తి పలకాలి. కాలుష్య నియంత్రణకు నడుం బిగించకపోతే.. ఇష్టానుసారంగా వాడుతున్న పెట్రో ఉత్పత్తులకు కళ్లెం వేయకపోతే.. భవిష్యత్తు తరాలు అసలు క్షమించవు.