https://oktelugu.com/

Governor Vs KCR : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ ఎందుకు తిరస్కరించింది…? తప్పు ఎవరిది?

బిజెపికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు శ్రవణ్ కు ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు గవర్నర్ షరతులు విధిస్తుండడంతో కెసిఆర్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Written By:
  • Rocky
  • , Updated On : September 26, 2023 / 08:27 AM IST
    Follow us on

    Governor Vs KCR Government : దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు ముందే నో చెప్పారా? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడానికి అర్హతలు అడ్డు వస్తున్నాయని ఆమె 19 న లేఖ రాశారా? అభ్యర్థులు ఇద్దరూ ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు.. సేవా విభాగాల్లో పాల్గొన్నట్టు కనిపించలేదంటూ గవర్నర్ తెలిపారా? రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా చేయకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) చెబుతోందని గవర్నర్ ముందే ప్రకటించారా? అంటే దీనికి అవును అనే సమాధానాలు చెబుతున్నాయి రాజ్ భవన్ వర్గాలు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఇద్దరు అభ్యర్థుల ప్రతిపాదనలను తమిళి సై సౌందరరాజన్ తిరస్కరించిన విషయాన్ని ప్రభుత్వం ఇన్ని రోజులుగా ఎందుకు దాచి పెట్టింది? ఈ నెల 19న గవర్నర్ లేఖ రాసినప్పటికీ ఎందుకు బయట పెట్టలేదు? ఆరు రోజుల తర్వాత, ఆరు రోజుల తర్వాత అది కూడా వాట్సప్ గ్రూపుల ద్వారా ఎందుకు లీక్ చేసినట్టు? ఇప్పుడు రాష్ట్రంలో సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఎదురు గాలి వేస్తున్న నేపథ్యంలో దీనిని రాజకీయంగా వాడుకోవాలని భారత రాష్ట్ర సమితి భావించిందా? లేక గవర్నర్ తో ఇంకా సంప్రదింపులు జరిపి, ఆమెను ఒప్పించే ప్రయత్నం చేసిందా? వెంటనే బయటపడితే ప్రభుత్వం పరువు పోతుందని జంకిందా? సందేహాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఏవి ఏమైనప్పటికీ గవర్నర్ విషయంలో సీఎం ఓ కూడా కొన్ని విషయాలను ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతున్నదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    వాస్తవానికి గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ పేర్లను రాష్ట్ర మంత్రిమండలి జూలై 31న జరిగిన సమావేశంలో ఆమోదించింది. ఆగస్టులో గవర్నర్‌కు పంపించింది. అయితే అప్పటి నుంచి గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పరిశీలనలో పెట్టారు. గవర్నర్‌గా నాలుగేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 8న రాజ్‌భవన్‌లో తమిళిసై ‘ఎ కాఫీ టేబుల్‌ బుక్‌ – ప్యాషన్‌ ఫర్‌ పీపుల్స్‌ ప్రోగ్రెస్‌- ప్లాన్డ్‌ పర్స్యూట్స్‌’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ను మీడియా ప్రతినిధులు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ల ఎమ్మెల్సీ ప్రతిపాదనలపై ప్రశ్నించారు. అప్పుడే గవర్నర్‌ చాలా విస్పష్టంగా సమాధానం ఇచ్చారు. ‘గవర్నర్‌ కోటా కింద రాజకీయపరమైన నియామకాలు ఉండవు. ప్రతిపాదించిన అభ్యర్థుల అర్హతలు తప్పకుండా నిబంధనల ప్రకారం ఉండాలి. సాంస్కృతిక, సామాజిక సేవ, క్రీడలు వంటి రంగాల్లో సేవలందించినవారై ఉండాలి. ఒకవేళ ఆయా రంగాల్లో అభ్యర్థులు సేవలందించినవారైతే… నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తప్పకుండా ప్రతిపాదనలపై సంతకం చేస్తాను. ఈ విషయాలను పరిశీలించడానికి నాకు ఇంకా కాస్త సమయం కావాలి. ఒకవేళ అభ్యర్థులు ఏ రంగంలోనూ ఫిట్‌ కాకపోతే అదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఈ విషయంలో రాజ్యాంగం కూడా గవర్నర్‌ను అడ్డకోజాలదు. అలాగని దీనిని నేను అడ్వాంటేజ్‌గా తీసుకోవడం లేదు’’ అని తమిళిసై స్పష్టంగా చెప్పారు. అంటే. అప్పటికే ప్రభుత్వానికి హెచ్చరిక సంకేతాలు పంపినట్లు అవగతమవుతోంది. కనీసం ప్రభుత్వం సర్దుకుని, గవర్నర్‌ సూచించిన రంగాల్లో అభ్యర్థులు ఫిట్‌ అవుతున్నారో లేదో సరి చూసుకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యవక్తమవుతున్నాయి.

    గతంలో పాడి కౌశిక్‌రెడ్డి విషయంలోనే ప్రభుత్వానికి ఈ విషయం అనుభవమైనా మళ్లీ ఇద్దరు నాయకులు పేర్లను ప్రభుత్వం పంపించిందన్న అభిప్రాయాలున్నాయి. రాజకీయ రంగాన్ని కూడా సామాజిక సేవా రంగంగా పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదనలు చేస్తోంది. కానీ, గవర్నర్‌ రాజకీయ రంగాన్ని సామాజిక సేవా రంగం కింద పరిగణించడం లేదని స్పష్టమవుతోంది.

    అందునే దాచిపెట్టారా?
    దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణల పేర్లను ఎమ్మెల్సీలుగా తిరస్కరిస్తున్నట్లు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈ నెల 19ననే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ పంపించారు. అంటే… సీఎంవోకు కూడా సమాచారం అందినట్లే లెక్క. టీఎఈ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపునిచ్చే టీఎస్ ఆర్టీసీ బిల్లుకు ఈ నెల 14న గవర్నర్‌ ఆమోదం తెలిపారు. టీఎస్ ఆర్టీసీ బిల్లు, ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు జూలై 31న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలోనే ఖరారయ్యాయి. అప్పుడే ఆర్టీసీ బిల్లును కూడా గవర్నర్‌కు పంపారు. ఐదు రోజుల తేడాతో రెండు అంశాలపై గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ ఆర్టీసీ బిల్లును ఆమోదించి, ఎమ్మెల్సీల ప్రతిపాదనలను తిరస్కరించారు. ప్రతిపాదనలను 19న తిరస్కరించగా… ఈ విషయం సోమవారం(25న) బయటకు పొక్కింది. ప్రభుత్వ వర్గాలే ఈ విషయాన్ని వాట్సాప్‌ గ్రూపుల ద్వారా బయట పెట్టాయి. దీంతో ఈ ఆరు రోజుల పాటు సీఎంవో ఎందుకు దాచిపెట్టిందన్నదానిపై రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్‌ను ఒప్పించడానికి ప్రభుత్వం తరపున ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు జరిగాయని సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆరే గవర్నర్‌కు ఫోన్‌ చేసి, ఇద్దరి పేర్లను ఆమోదించాలని కోరినట్లు తెలిసింది. ఇప్పటికే పాడి కౌశిక్‌రెడ్డి పేరును తిరస్కరించారని, కనీసం వీరిద్దరి పేర్లనైనా అంగీకరించాలని అడిగినట్లు సమాచారం. కానీ, గవర్నర్‌ ససేమిరా అన్నట్లు తెలిసింది. ఇప్పటికే బయట చాలా మంది వివిధ రంగాల నిష్ణాతులున్నారని, రాజ్యాంగం పేర్కొన్న అంశాల్లో ఎక్కడా ఫిట్‌ కాని ఇలాంటి వ్యక్తులను ఆమోదిస్తే… తప్పుడు సంకేతాలు వెళతాయని అన్నట్లు సమాచారం. అయితే… గవర్నర్‌ తిరస్కరించిన అంశాన్ని ఆరు రోజుల పాటు దాచి పెట్టడం వెనుక ప్రభుత్వానికి కొంత భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. అప్పటికప్పుడు విషయాన్ని బయటపెడితే… సర్కారు పరువు పోతుందని వెనుకడుగు వేసినట్లు అర్థమవుతోంది. అందుకే కాస్త గ్యాప్‌ ఇచ్చి విషయాన్ని వాట్సాప్‌ గ్రూపుల ద్వారా బయటపెట్టినట్లు చర్చ జరుగుతోంది. కాగా ఈ పరిణామంతో శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ ఆశలు సందిగ్ధంలో పడ్డాయి. బిజెపికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు శ్రవణ్ కు ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు గవర్నర్ షరతులు విధిస్తుండడంతో కెసిఆర్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.