KCR ,Governor Tamilisai : ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య సఖ్యత కుదిరింది. గురువారం రాజ్ భవన్, ప్రగతి భవన్ చేతులు కలిపాయి. శుక్రవారం సచివాలయంలో గుడి, మసీదు, చర్చి ప్రారంఠభోత్సవంలో సఖ్యత ప్రదర్శించాయి. సీఎం కేసీఆర్ గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌తో ముఖాముఖి భేటీ అయ్యారు. దాదాపు 25 నిమిషాలపాటు ఇరువురూ చర్చించుకున్నారు. మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్ భవన్ ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులకు గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. అనంతరం గవర్నర్‌తో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీరి సమావేశానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలకు ఆమోదం, ఆర్టీసీ సహా పలు పెండింగ్ బిల్లులు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అలాగే, తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపైనా ఇరువురూ చర్చించుకున్నట్లు సమాచారం. అంతేనా.. కొత్త సచివాలయంలో నిర్మించిన ప్రార్థన మందిరాల (ఆలయం, చర్చి, మసీదు) ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు పాల్గొన్నారు. ఇప్పటి వరకూ తూర్పు, పడమరగా ఉన్న గవర్నర్, ముఖ్యమంత్రి సమావేశం కావడం.. ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌కు వెళ్లడం.. గవర్నర్ కొత్త సచివాలయానికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రారంభోత్సవం సందర్భంగా ఇద్దరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయి. సీఎం సచివాలయం మొత్తం తిప్పి చూపించారు. గవర్నర్ కూడా ఆయన చెబుతున్న విషయాలను ఆసక్తిగా విన్నారు.
రాష్ట్రంలో మారిన రాజకీయ చిత్రం
గవర్నర్ తమిళిసై, ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి ఇప్పటి వరకూ నెలకొంది. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సఖ్యత కరువైంది. గవర్నర్ తమిళిసైని బీజేపీ నాయకురాలిగా బీఆర్‌ఎస్ నేతలు అభివర్ణించారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సహా అధికారిక కార్యక్రమాలకు వేటికీ ఆమెను ఆహ్వానించలేదు. అలాగే, నాలుగేళ్లుగా ఎట్‌హోం సహా రాజ్‌భవన్లో జరిగిన కార్యక్రమాలకూ సీఎం, మంత్రులు, బీఆర్‌ఎస్ నాయకులు హాజరు కాలేదు. ఇంకా చెప్పాలంటే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనూ గవర్నర్ ప్రసంగం లేకుండానే పూర్తి చేశారు. చివరికి, ఈ అంశం హైకోర్టుకు చేరడం.. కోర్టు బయట పరిష్కరించుకోవాలని న్యాయస్థానం సూచించడంతో గత బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించక తప్పని పరిస్థితి నెలకొంది. అలాగే, పెండింగ్ బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదంటూ రాజ్‌భవన్‌పై సుప్రీం కోర్టునూ తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. ఇక, గవర్నర్ కూడా అవకాశం చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తనను గుర్తించడం లేదని, గవర్నర్‌గా రాజ్యాంగబద్ధ హోదాకు ఇవ్వాల్సిన ప్రొటోకాల్‌నూ ఇవ్వడం లేదని తమిళిసై పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. కనీసం ఒక మహిళకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా తనకు ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. జిల్లాలకు వెళ్లినప్పుడు కలెక్టర్, అధికారులు తనకు ఇవ్వాల్సిన ప్రొటోకాల్ ఇవ్వడం లేదని పలుమార్లు ఆరోపించారు. ప్రభుత్వం వాహన సదుపాయం కల్పించకపోవడంతో సమ్మక్క, సారలమ్మ జాతరకు ఆమె బస్సులోనే వెళ్లారు. భద్రాద్రిలో వరదల పరిస్థితిని పరిశీలించడానికి రైల్లోనే వెళ్లారు. కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి కానీ, అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు కానీ తనను ఆహ్వానించలేదని, ఆహ్వానిస్తే వెళ్లేదానినని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. క్యాబినెట్, అసెంబ్లీ ఆమోదించిన కొన్ని బిల్లులను తిరస్కరించారు. కొన్నిటిని రాష్ట్రపతికి పంపించారు. ఆర్టీసీ బిల్లును న్యాయ పరిశీలనకు పంపారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నియమించే బిల్లును పెండింగులో పెట్టారు. ఇలా.. దాదాపు నాలుగేళ్లుగా గవర్నర్, ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది.
ఒక్కసారిగా పరిస్థితి మారింది
కానీ, ఇప్పుడు పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇప్పటి వరకూ రాజ్‌భవన్ గడప తొక్కడానికి విముఖత వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు వీలైనంత ఎక్కువ సమయాన్ని అక్కడ గడిపారు. గవర్నర్‌తో ముఖాముఖి సమావేశమయ్యారు. కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఆహ్వానించలేదు. కానీ, సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవానికి ఆమెను ఆహ్వానించారు. ఆ ప్రాంతాలను మొత్తం చూపిం చారు. పూజల్లో, ప్రార్థనల్లో గవర్నర్‌కు సింహభాగం ప్రాధాన్యం ఇచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని, ఇప్పుడు గవర్నర్‌తో సఖ్యతకు కూడా కారణం ఇదేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు ఇటీవల వరుసగా జరిగిన పరిణామాలను ఉదాహరిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ తనయ కవిత వ్యవహారం చల్లబడడం.. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించడం, కమ్యూనిస్టులతో పొత్తును కాలదన్నడం, ఇప్పుడు గవర్నర్‌తో సఖ్యత అన్నీ ఒకదానితో మరొకటి లింకున్న అంశాలేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.