Students : ఇప్పుడు ర్యాంకుల వెంట అందరూ పరుగులుపెడుతున్నారు. మన చిన్నప్పుడు అందరూ సర్కార్ బడుల్లోనే చదివారు. నాడు చదువు చాలీచాలకుండా అందింది. కానీ ఇప్పుడు లక్షలు పోసి ఐఐటీ, నీట్ వంటి చదువులను చిన్నప్పటి నుంచే రుద్దుతున్నాం. ఆడుకోవాల్సిన బాల్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ మానసిక ఒత్తిడికి గురవుతోంది. బిచ్చగాడు మూవీ తీసిన స్టార్ హీరో విజయ్ ఆంటోనీ లాంటి కూతురు కూడా అంత సంపాదన.. సౌకర్యాలు ఉండి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విద్యార్థుల ఆత్మహత్యలపై అందరి దృష్టి నెలకొంది.
విద్యార్థులు తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను ఎదుర్కోవడానికి వారికి సరైన మార్గదర్శకత్వం, సలహాలు కచ్చితంగా అవసరం.
భారతదేశంలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మొత్తం జనాభాలో 53.7% ఉన్నారు. అయితే ఇటీవల చాలా ఆందోళన కలిగించే విషయం దేశ వ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు, ఈ ఏడాది 2023లో గడచిన ఏడు నెలల్లో కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు 20 మంది ఆత్మహత్య చేసుకుని మరణించారని ప్రభుత్వం పేర్కొన్నది. ప్రభుత్వం దృష్టిలో ఇంకా నమోదు కాని మరణాలు ఎన్ని ఉన్నాయో ఆందోళన కలిగిస్తోన్న విషయం.
ఎన్.సి.ఆర్.బి, ఏ.డి.ఎస్.ఐ నివేదిక ప్రకారం భారతదేశంలో 1997 నుండి 2021 వరకు సుమారు 64,114 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వీళ్ళందరూ 30 సంవత్సరాల లోపు వాళ్లేనని తెలియజేస్తోంది.
కేవలం 2021 సంవత్సరంలోనే దేశంలో 13,089 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం బాధాకరం, అంటే ప్రతిరోజూ 35 మందికి పైగా మరణించారని అర్ధం. ఇందులో ప్రాధమిక స్థాయి 15.8%, మధ్య స్థాయి 19.1%, సెకండరీ స్థాయి 24.0%, హయ్యర్ సెకండరీ స్థాయి 16.2%, డిప్లొమా 1.2% గ్రాడ్యుయేట్ 4.6%, ప్రొఫెషనల్ 0.3%, నిరక్షరాస్యులు 11.0%, అక్షరాస్యత/నిరక్షరాస్యత ధృవీకరించని వాళ్ళు 7.8% గా వున్నారు. ఎక్కువగా మహారాష్ట్ర లో (1834), మధ్య ప్రదేశ్ లో (1308), తమిళనాడు లో (1246), కర్ణాటక లో (855), ఒడిశా (834) రాష్ట్రాల్లో ప్రాణ నష్టం అధికంగా వున్నది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు శృంగార సంబంధాలు, ప్రేమ వైఫల్యాలు, చదువుకు మధ్య లో అంతరాయం, పరీక్షల్లో ఫెయిల్ కావడం, కార్పొరేట్ చదువు ఒత్తిడి, ఒంటరితనం, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, ప్రాణ స్నేహితుల మరణం, సైబర్ బెదిరింపులు & నేరాలు, కుటుంబ సభ్యుల సరైన మద్దతు లేకపోవటం, చెడు స్నేహాలు, డ్రగ్స్, ఆల్కహాల్, ఆర్థిక సమస్యలు వంటివి అనేక కారణాలు వున్నాయి. ఈ విచారకరమైన పరిస్థితులకు దారితీసిన ముఖ్య కారణం వీరికి సరైన సమయంలో “కౌన్సెలింగ్”, “మార్గదర్శకత్వం” లేకపోవడమే.
విద్యార్థులకు వారి దైనందిన జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతుంటాయి, ఆ సమస్యలను ఎదుర్కోవటానికి వారికి మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్ చాలా అవసరం. ఎందుకంటే ఆ సమస్యలని వాళ్ళు ఒంటరిగా ఎదుర్కోవడం కొన్నిసార్లు కష్టం. అందుకే సరైన మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్ తప్పనిసరిగా మొదట వారి కుటుంబాల నుండి ప్రారంభమవ్వాలి, అంతేకాకుండా కుటుంబ సభ్యులు (పిల్లల) ఆ విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో ప్రముఖ పాత్ర పోషించాలి. వారిని ఇబ్బంది పెడుతున్న సమస్యలను పరిష్కరించడానికి వారికి ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని ఆ కుటుంబం ఆ విద్యార్థులకు అందించాలి. కానీ ఈ ఆధునిక జీవితం (హైటెక్ టెక్నాలజీ) సృష్టించిన ఒత్తిడి కారణంగా విద్యార్థులకు వారి కుటుంబాల నుండి కౌన్సెలింగ్ పొందడం చాలా కష్టంగా వున్నది. అంతేకాకుండా వారి తల్లిదండ్రులు కూడా వారి సామాజిక, కుటుంబ బంధంపై ఒత్తిడి మరియు ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఒక విధంగా చూస్తే విద్యార్థుల ఆత్మహత్యలకు వాళ్ళ కుటుంబమే ప్రధాన కారణమని తెలుస్తుంది. అటువంటి సందర్భాలలో మంచి స్నేహితులు మరియు విద్యా సంస్థలు తప్పనిసరిగా ఆ ఖాళీని పూరించాలి, విద్యార్థులకు అవసరమైన మానసిక సహాయాన్ని అందించాలి.
విద్యార్థులు ఎదుర్కొనే వివిధ సమస్యలకు వారు చేస్తోన్న చెడు స్నేహాలు కారణం కావచ్చు. అలానే కొంత మంది మంచి స్నేహితుల వలన ఆందోళన, ఒత్తిడి మరియు నిస్పృహల నుండి ఉపశమనం లభించినా, స్నేహితుల విషయం లో జాగ్రత్త అవసరం. కుటుంబ పరంగా, వారు చదువుకునే సంస్థలలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై శిక్షణా కార్యక్రమాలు ఉండాలి, వారు వారి ప్రయోజనాలతో పాటు వారి స్నేహితుల ప్రయోజనం కోసం, ఈ సమాజ ప్రయోజనాల కోసం పాటుపడేలా చెప్పాలి. ఆధ్యాత్మిక భావాలు, యోగా, మెడిటేషన్ లాంటి వాటిపై అవగాహన కల్పించాలి. వ్యక్తిత్వ వికాసానికి సమగ్ర విధానాన్ని ప్రతిబింబించాలి. క్రీడలల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. సామాజిక ఆర్ధిక సమస్యలపై అవగాహన కల్పించాలి. సైబర్ సెక్యూరిటి పై ఖచ్చితంగా తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండాలి. సోషల్ మీడియా అవసరంమేరకు మాత్రమే ఉపయోగించాలి. మాదక ద్రవ్యాలు, మత్తుపదార్ధాలు, ఆల్కహాల్ లపై అవగాహన కల్పించాలి. సమాజంలో సాటివారిపై ప్రేమ, దయ లాంటి సంబంధాలను పెంపొందించేలా చెప్పాలి. అన్నిటికన్నా కుటుంబ సభ్యుల పర్యవేక్షణ అన్నీ విషయాలలో శ్రద్ధవహించాలి తద్వారా విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టవచ్చు.
ఈ ఆత్మహత్యల నివారణకు అన్ని పాఠశాలలు/సంస్థలు వారి విద్యార్థుల మానసిక ఆరోగ్య సవాళ్ల గురించి ప్రతిరోజు వాళ్ళకి ఒక పీరియడ్ 30ని౹౹ మానసిక ఆరోగ్య సలహాదారుని తో విద్యార్థుల మానసిక క్షేమాన్ని బలపరచటానికి కౌన్సెలింగ్ ఇవ్వాలి. 45ని౹౹ క్రీడలకు ప్రోత్సహించాలి. కానీ చాలా పాఠశాలల్లో/సంస్థలలో ఎలాంటి కౌన్సెలింగ్ సర్వీస్, క్రీడలకు అవకాశం లేదు. కనీసం మానసిక ఆరోగ్య నిపుణులు పనిచేసే సంస్థలతోనైనా దేశంలోని ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించి, తద్వారా వారు తమ విద్యార్థులకు సలహాదారులుగా పని చేసేలా అయినా చేయాలి. ఈ విధానం ప్రభుత్వ ఉపాధ్యాయులతో చేయించవచ్చు. కానీ ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న ఉపాద్యాయులు తక్కువ వేతనంతో ఉన్నారు. మరలా మానసిక ఆరోగ్య సలహాదారులుగా వ్యవహరించడం వల్ల వారికి అదనపు ఒత్తిడి చాలా ఎక్కువ కావచ్చు. కానీ ఇలాంటి ఆచరణల వలన విద్యార్థులలో మానసిక ఉల్లాసాన్ని నింపవచ్చు.
ఈ విచారకరమైన పరిస్థితి మారాలని, ఈ ఆత్మహత్యలను నిరోధించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 2003 వ సంవత్సరంలో ఐ.ఎ.ఎస్.పి (ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివేన్షన్) ఏర్పాటు చేసి ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినోత్సవం గా ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10 న, అక్టోబర్ 10 న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆయా ప్రభుత్వాలతో, ప్రజలతో కలిసి ఆత్మహత్యల నివారణకు అవగాహన కల్పిస్తూ ఆత్మహత్యకు ప్రత్యామ్నాయం వున్నదని ఆత్మవిశ్వాసం అనే వెలుగును నింపడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుంది.
అంతేకాకుండా భారత ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మునుపెన్నడూ లేని విధంగా మెంటల్ హెల్త్ చట్టాన్ని 2017 న పొందుపరిచి తద్వారా మానసికంగా బాధపడుతున్న వారికి మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందిచేందుకు దోహదపడుతున్నారు. అంతేకాకుండా కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఆందోళన, ఒత్తిడి, నిరాశ, ఆత్మహత్య ఆలోచనలు తదితర మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు అండగా “కిరణ్” అనే 24/7 పనిచేసే హెల్ప్ లైన్ నెంబర్ 1800-599-0019 ను పొందుపరిచి అనేక సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చొరవతో ఆత్మ నిర్బర్ అభియాన్ కింద “మనోదర్పన్” ప్రారంభించారు. దీని లక్ష్యం కోవిడ్ పరిణామాల తరవాత విద్యార్థులలో, కుటుంబ సభ్యులలో, ఉపాధ్యాయులలో వారి మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం మానసిక, సామాజిక సహాయాన్ని అందిస్తున్నారు. ఇంతేకాకుండా నవంబర్ 21, 2022 న జాతీయ ఆత్మహత్య నివారణ వ్యూహం (ఎన్.ఎస్.పి.ఎస్) ప్రకటించింది. ఈ పాలసీ దేశంలోనే మొట్టమొదటిసారిగా భారత ప్రజలు ఆత్మహత్య చేసుకోకుండా నిరోధించేందుకు దోహదపడుతుంది. దీని లక్ష్యం 2020తో పోలిస్తే 2030 నాటికి ఆత్మహత్యల మరణాలను 10% తగ్గించడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తోంది.
విద్యార్థుల, యువత భారాన్ని తగ్గించడానికి వారి సమస్యలను వారి కుటుంబ సభ్యులు శ్రద్ధగా విని సమిష్టి గా ఆలోచించడం ద్వారా వారి ఆందోళనలను, సమస్యలను పరిష్కరించవచ్చు, ఇకపై ఆత్మహత్యలు జరగకుండా నిరోధించడానికి వారికి సరైన కౌన్సెలింగ్ ఇవ్వవచ్చు. విద్యార్థులకి, ఉపాధ్యాయులు మానసిక శిక్షణ ఇవ్వడం, విద్యాసంస్థలకు కౌన్సెలర్‌లు లేదా సామాజిక కార్యకర్తలను నియమించడం, ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వ జాతీయ పాలసీ లు ఉపయోగించుకోవడం, ఆత్మహత్యలను పరిష్కరించే విస్తృత కార్యక్రమాలను రూపొందించడం వలన ఆత్మహత్యల రేటును తగ్గించవచ్చు. పౌరులందరూ ఆత్మహత్యల నివారణే మన అంతిమ లక్ష్యంగా భావించాలి.
-నూతలపాటి రవికాంత్
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
9704444108
thewriterravikanthnutalapati@gmail.com