IPL 2023 Final : ఒక జట్టేమో నాలుగుసార్లు ట్రోఫీ అందుకుంది. సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి సారధ్యంలో ఫైనల్ కు చేరుకుంది. మరో జట్టు గత ఏడాది ట్రోఫీ దక్కించుకుంది. ఈ ఏడాది డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ లోకి ప్రవేశించింది. ఉరకలేస్తే యువ రక్తంతో ఉత్సాహంగా ఆడింది. గత ఏడాది లాగే ఇప్పుడు కూడా ఏకంగా ఫైనల్ లోకి వచ్చేసింది. ఈ రెండు జట్ల ఫైనల్ మ్యాచ్ కు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఐపీఎల్-16వ సీజన్లో ఇక ఒకే ఒక్క మ్యాచ్. రెండు నెలలుగా మండు వేసవిలో క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించిన ఈ మెగా ఈవెంట్లో విజేతను తేల్చేందుకు సమయం ఆసన్నమైంది. ప్రపంచ క్రికెట్లో అతి పెద్ద స్టేడియంగా పిలుచుకునేనరేంద్ర మోదీ మైదానంలో ఆదివారమే ఫైనల్ పోరు. మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో.. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోబోతోంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో తలపడిన ఈ రెండు జట్లే చివరికి లీగ్‌కు ముగింపు పలుకబోతుండడం విశేషం. ఎంఎస్ ధోనీ సేన ఇప్పటికే నాలుగు టైటిళ్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. మరోసారి విజేతగా ఆవిర్భవిస్తే ముంబై ఇండియన్స్‌తో సమంగా నిలుస్తుంది. ఇక హార్దిక్ బృందం ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి ఏడాదే కప్‌ను ఖాతాలో వేసుకుని అబ్బురపరిచింది. ఈసారి కూడా ఆల్‌రౌండ్ షోతో అందరికంటే ముందే ప్లేఆ్‌ఫ్సలో అడుగుపెట్టింది. ఇప్పుడు వరుసగా రెండో టైటిల్‌ను కూడా గెలవాలనే పట్టుదలతో ఉంది. మరి.. గురుశిష్యులుగా పేరు తెచ్చుకున్న ధోనీ, హార్దిక్లలో ఎవరిది పైచేయి కానుందో మరికొన్ని గంటల్లోనే తేలనుంది.
IPL 2023 Final : ఐపీఎల్ ఫైనల్ : ఎవరు గెలిచినా చరిత్రే: నేడే చెన్నై, గుజరాత్ ఫైట్
చెన్నై జట్టుకు ధోని నాయకత్వమే బలం
నిరుడు ఐపీఎల్లో ఆడిన పది జట్లలో చెన్నై తొమ్మిదో స్థానంలో నిలిచింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుందంటే కారణం మహేంద్ర సింగ్ ధోని నాయకత్వమే. జడేజాను కెప్టెన్‌గా చేసి దెబ్బతిన్న ఈ జట్టు తమ పొరపాటును సరిదిద్దుకుని ఉవ్వెత్తున ఎగిసింది. గుజరాత్‌పైనే తొలి క్వాలిఫయర్‌లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టిన చెన్నై ఆత్మవిశ్వాసంతో ఉంది. దీనికి తోడు ఓపెనర్లు రుతురాజ్, డెవాన్ కాన్వే జట్టుకు అతిపెద్ద బలంగా ఉన్నారు. ఇప్పటికే చెన్నై జట్టు తరఫున అత్యుత్తమ ఓపెనర్లుగా నిలిచారు. ఈసారి ఇద్దరూ కలిసి 14 మ్యాచ్‌ల్లో 775 పరుగులు జోడించారు. తొమ్మిదిసార్లు 50+ భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. అందుకే అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లోనూ వీరు శుభారంభం అందించాలని జట్టు కోరుకుంటోంది. మిడిలార్డర్లో రహానె, శివమ్ దూబే, జడేజాలతో పటిష్ఠంగా కనిపిస్తోంది. ఎంఎస్ ధోని ఫినిషర్ పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నాడు. బౌలింగ్ విషయానికి వస్తే పెద్దగా అనుభవం లేని తుషార్ దేశ్‌పాండే, తీక్షణ, పథిరనలను ధోనీ ఉపయోగించుకున్న తీరు అందరూ చూస్తున్నదే. అలాగే పవర్‌ప్లే స్పెషలిస్ట్ దీపక్ చాహర్ ఆరంభంలోనే వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు జడేజా, మొయిన్ అలీల అనుభవం ఉపయోగపడుతోంది. ఇప్పుడు వీరందరి లక్ష్యం ప్రత్యర్థి ఓపెనర్ గిల్‌ను ఎలా అడ్డుకోవాలన్నదే? ఈ విషయంలో జట్టు విజయవంతమైతే చెన్నై టైటిల్‌పై ఆశలు పెంచుకోవచ్చు.
ఉరకలేస్తున్న ఉత్సాహంతో గుజరాత్ జట్టు
బ్యాటింగ్, బౌలింగ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతాలే చేస్తోంది. ఛేదనలో ఇప్పటికే అన్ని జట్లకన్నా ముందుంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ జట్టుకు అతిపెద్ద బలంగా మారాడు. వరుసగా రెండు సెంచరీలు బాదిన ఈ యువ ఆటగాడికి నరేంద్ర మోదీ మైదానం కొట్టిన పిండి. ఇప్పటికే ఇక్కడ ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేసి మరో మ్యాచ్‌లో 94 వరకు వచ్చి ఆగాడు. ఈనేపథ్యంలో గిల్‌పై ఈ కీలక పోరులోనూ టైటాన్స్ భారీ ఆశలే పెట్టుకుంది. మరో ఓపెనర్ సాహాలో నిలకడ లోపించింది. సాయి సుదర్శన్, హార్దిక్, విజయ్ శంకర్, మిల్లర్, తెవాటియాలతో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో స్పిన్నర్ రషీద్ ఈ జట్టు తురుపుముక్కగా ఉంటున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టుకు ఊరటనివ్వడంతో కెప్టెన్ హార్దిక్ కూడా ఈ అఫ్ఘాన్ ఆటగాడి పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాడు. ఇక వెటరన్ పేసర్ మోహిత్ శర్మను జట్టులోకి తీసుకోవడం వరంగా మారింది. మరో పేసర్ షమి ఆరంభంలోనే వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీస్తున్నాడు.
సమఉజ్జీలు
ఎటు చూసుకున్నా ఈ రెండు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో అద్భుతాలు చేయగల ఆటగాళ్లు ఈ రెండు జట్లల్లో ఉన్నారు. కీలక సమయాల్లో రెండు జట్ల కెప్టెన్లు కూడా వివేకవంతమైన నిర్ణయాలు తీసుకుని మ్యాచ్ ఫలితాలను మార్చేశారు. అందుకే బలమైన జట్లతో పోటీపడి ఏకంగా ఫైనల్ పోరుకు వచ్చేశారు. అయితే ఈ రెండు జట్లలో ఏ టీం గెలిచినా చరిత్రే అవుతుంది. ఫైనల్ పోరులో చెన్నై గెలిస్తే ఐదోసారి కప్ అందుకొని ముంబై జట్టు సరసన నిలుస్తుంది. గుజరాత్ జట్టు ఒకవేళ ట్రోఫీ అందుకుంటే వరుసగా రెండవసారి ఐపీఎల్ విజేతగా ఆవిర్భవిస్తుంది.
మూడు మ్యాచ్‌ల్లోనూ చెన్నై ఓడింది
ఇక అహ్మదాబాద్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ చెన్నై ఓడింది. ఇక్కడ మైదానం ఒక పట్టానా కొరుకుడు పడటం లేదని మ్యాచ్ ముగిసిన అనంతరం చెన్నై కెప్టెన్ పలుమార్లు వ్యాఖ్యానించాడు. అయితే ఈ ఫైనల్ పోరుకు ఎలా సంసిద్ధమయ్యాడు అనేదే ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మ్యాచ్‌తో ఐపీఎల్లో అత్యధిక ఫైనల్స్ (11.. పది సార్లు చెన్నై, ఓసారి పుణె నుంచి) ఆడిన ప్లేయర్‌గా ధోనీ రికార్డు కెక్కనున్నాడు.
జట్ల వివరాలు ఇలా
చెన్నై: రుతురాజ్, కాన్వే, దూబే, రహానె, అలీ, రాయుడు, జడేజా, ధోనీ (కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, తీక్షణ, పథిరన (ఇంపాక్ట్).
గుజరాత్: గిల్, సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ (కెప్టెన్), విజయ్ శంకర్, మిల్లర్, రషీద్ ఖాన్, తెవాటియా, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, షమి, లిటిల్ (ఇంపాక్ట్)
మైదానం ఎలా ఉందంటే
ఇక్కడి పిచ్ బ్యాటర్లకుఈ అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్లో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో సగటు స్కోరు 193. ఇందులో ఐదుసార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. మంచు ప్రభావం ఉండకపోవచ్చు. ఆకాశం మబ్బులు పట్టి ఉండే అవకాశమున్నా వర్షంతో మ్యాచ్‌కు ఇబ్బందేమీ లేదు..