- రాబోయే ఎన్నికలపై జన సైనికుల ఆశలు
- పవన్ కల్యాన్ చరిష్మాపై ధీమా
- అభిమానాన్ని ఓట్లుగా మలుచుకునేనా ‘జనసేనాధిపతి’

AP Politics: అశేష అభిమాన గణం.. ఒక్క పిలుపిస్తే ఎంతకైనా తెగించే కొట్లాడే కార్యకర్తలు.. ఒక పార్టీ అధినేతకు ఇంతకన్నా ఏం కావాలి. కానీ తన చరిష్మాను అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా మాత్రం అడుగులు ముందుకు పడడం లేదు. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్. . రాబోయే ఎన్నికల మీద జనసేన సైనికులు పెద్ద ఆశలే పెట్టుకున్నట్లుంది. రాబోయే ఎన్నికల్లో తమ అధినేత పవన్ కల్యాణే సీఎం అంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. పవన్ సీఎం అయ్యేందుకు దోహద పడే కారణాలను చెప్పమంటే మాత్రం నోరిప్పటంలేదు.
టాలీవుడ్ లో తిరుగులేని పాపులారిటీ పవన్ కల్యాణ్ సొంతం. ఏ హీరోకు సాటి లేనంతగా అభిమానులు కేవలం పవన్ కల్యాణ్ కే ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్‌లో ఒక దశలో తన సోదరుడు, మెగా స్టార్ చిరంజీవినే వెనక్కి నెట్టేశాడు. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ అభిమానులు గోల చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఓ ఈవెంట్ లో అభిమానుల కేకలను కంట్రోల్ చేయడానికి స్వయానా మెగా స్టార్ చిరంజీవే కలుగజేసుకొని శాంతింప జేయాల్సిన పరిస్థితి. ఇంకో ఈవెంట్ లో అభిమానులను అదుపు చేయడానికి మరో మెగా బ్రదర్ నాగబాబు స్టేజీ పైనే ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది.
ఇంతటి స్టార్ డమ్ ఉన్న పవన్ కల్యాణ్ రాజకీయ కోణం సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే పాలకుడిగా ఉండేవాడేమో. తనకు అధికారం ముఖ్యం కాదని, ప్రజల తరఫున ప్రశ్నించడానికి తానెప్పుడు ముందుంటానని జనసేన ఆవిర్భావం నుంచే చెప్పుకొస్తున్నాడు పవర్ స్టార్. రెండు టర్మ్ లు గడిచాయి. ఇప్పటికీ అధికారం చేపట్టే దిశగా అడుగులు మాత్రం వేయడం లేదు. ఆ దిశగా తన పొలిటికల్ వేవ్ ను తీర్చిదిద్దుకోలేకపోతున్నాడు. రాజకీయాల కోసం నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా అధికారానికి మాత్రం దగ్గర కాలేకపోయాడు. కానీ అభిమానుల మనసుల్లోంచి ఏ మాత్రం దూరం కాలేదు.
2014 లో టీడీపీ, బీజేపీతో పొత్తుతో పవన్ కల్యాణ్ కు లాభించింది ఏమీలేదు. అదే అతనికి మైనస్ గా మారింది. కేంద్రంలో ఉన్న బీజేపీని, రాష్ర్టంలో ఉన్న టీడీపీని ప్రశ్నించకుండా మిన్నకుండిపోయాడని వైసీపీ కామెంట్లతో రాజకీయంగా దెబ్బతిన్నాడు. 2019లో చేసిన ఒంటరి పోరాటం టీడీపీ ఓటు బ్యాంకును దెబ్బతీయగా, వైసీపీకి కలిసి వచ్చింది. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా అధికార పార్టీలో చేరాడు. మళ్లీ సినిమాల బాట పట్టిన పవన్ కల్యాన్ రాజకీయాలకు మాత్రం దూరంగా లేడు. రెండు వైపులా తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు.
వైసీపీ ఇప్పుడు తన అధికార బలంతో పవన్ కల్యాణ్ ను తొక్కే ప్రయత్నం చేస్తున్నది. జన సేన పార్టీ శ్రేణలకు సరైన దిశానిర్దేశం చేసే నేత లేడు. ఏం చేసినా మళ్లీ పవన్ కల్యాణే ముందుండాలి. సెకండ్ క్యాడర్ ను పెంచుకుంటే తప్ప జనసేన పవర్లో నిలబడే పరిస్థితి లేదు. కాగా ఇటీవల వైసీపీపై నేరుగా విమర్శలు గుప్పిస్తూ ఏపీలో పొలిటికల్ సెంటర్ గా నిలుస్తున్నాడు. ప్రస్తుతం టీడీపీ తన ప్రాభవాన్ని కోల్పోవడం, వైసీపీ పై వ్యతిరేకత పవన్ కల్యాణ్‌కు లాభించే అంశాలు. ఈ సమయాన్ని పవన్ కల్యాన్ సద్వినియోగం చేసుకోగలిగితే 2024 పవర్ ప్లేయర్ గా నిలుస్తాడనంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి నుంచి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం, సెకండ్ క్యాడర్ ను పెంచుకోవడంపై జనసేన భవిష్యత్ ఆధారపడి ఉంది.
టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి, అతని కుమారుడు లోకేష్ పట్ల పార్టీ శ్రేణుల్లో అంత సానుకూలత కనిపించడం లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తున్నది. పవర్ ప్లేయర్ గా నిలవాలంటే పవన్ కల్యాణ్ కు ఇదే సరైన సమయం. బీజేపీతో పొత్తు మరికొంత లాభించే అంశం. తెలుగు రాష్ర్టాలపై దృష్టి సారించిన బీజేపీ తెలంగాణలో కొంత పట్టు సాధిస్తున్నది. ఏపీలోనూ బీజేపీ తన ఉనికిని చాటుకోవాలంటే పవన్ కల్యాణే బెస్ట్ ఆప్షన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని బీజేపీని ఇబ్బంది పెట్టకపోయినా, జనసేన అధినేతకు మాత్రం ప్రోత్సాహం అందిస్తుంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా తమకు లాభించే అంశం ఏ ఒక్కటీ లేదని బీజేపీ భావిస్తున్నది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వైసీపీ పై వ్యతిరేకతను పవర్ స్టార్ ఏ విధంగా తనకు అనుకూలంగా మలుచుకుంటాడో చూడాల్సిందే.
-శెనార్తి..
[…] Kamal Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ పాపం ఆసుపత్రిలో చేరాడు . చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రస్తుతం కమల్ హాసన్ కి ట్రీట్మెంట్ జరుగుతుంది. అసలు కమల్ ఆసుపత్రిలో ఎందుకు చేరారన్న వార్త అభిమానులు ఆందోళనకు గురి చేస్తోంది. కమల్ ఇటీవలే అమెరికా వెళ్లి తన దుస్తుల బ్రాండ్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. […]
[…] Also Read: 2023లో ‘పవర్’ ప్లేయర్ ఎవరు? […]