Chandrayaan 3 : చంద్రుడు లేకుంటే భూమి పరిస్థితి ఏమిటి?

చంద్రుడు లేకపోతే భూ వాతావరణం, గ్లోబల్ వార్మింగ్ పై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

Written By: Bhaskar, Updated On : August 20, 2023 11:55 am
Follow us on

Chandrayaan 3 : చంద్రయాన్_3, లూనా ప్రయోగాల నేపథ్యంలో చంద్రుడు వార్తల్లో వ్యక్తి అయ్యాడు. సామాజిక మాధ్యమాలు, ప్రధాన స్రవంతి మీడియాలో ఎక్కడ చూసినా చంద్రుడి గురించే చర్చ జరుగుతోంది. చంద్రుడి మీద నీటి జాడలు ఉన్నాయని, రకరకాలైన ఖనిజాలకు అతడు నెలవని అంతరిక్ష ప్రయోగాల ద్వారా తెలుస్తోంది. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇంతకీ చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు? ఇది చాలా మందిలో ఉండే సందేహం. సంబంధించి స్పష్టమైన సమాధానం లేకపోయినప్పటికీ.. రకరకాల సిద్ధాంతాలు మాత్రం వ్యాప్తిలో ఉన్నాయి.

చంద్రుడి పుట్టుకకు సంబంధించి శాస్త్రవేత్తలు రకరకాల సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పటికీ.. ఒక సిద్ధాంతం మాత్రం అందరి ఆమోదం పొందింది. సౌర కుటుంబం ఏర్పడిన సమయంలో అంటే 450 కోట్ల సంవత్సరాల క్రితం కుజుడి పరిమాణంలో ఉండే వస్తువు ఒకటి భూమిని బలంగా ఢీకొట్టింది. దాని వల్ల భూమి చుట్టూ ఒక ధూళి మేఘం ఏర్పడి, అందులోని శిలలు, ఆవిరి, ఇతర పదార్థాలు ఏకమై చంద్రుడిగా ఆవిర్భవించాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఇక చంద్రుడి ఆకర్షణ శక్తి భూమి దాని అక్షం మీద ఉండేందుకు కారణమవుతోంది. చంద్రుడు లేకపోతే భూమి అక్షం మీద నిలిచే విధానంలో తేడా వచ్చి.. భూమి కదలికలలో తేడా ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో రుతువుల్లో అనేక మార్పులకు అవకాశం ఉంటుంది. సముద్రపు ఆటుపోట్లలో కూడా వైవిధ్యం ఉంటుంది. రోజు నిడివి కూడా మారుతుంది. చంద్రుడు లేకపోతే భూ వాతావరణం, గ్లోబల్ వార్మింగ్ పై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం చంద్రుడు భూమికి మూడు లక్షల 84 వేల 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. కానీ 320 కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడు భూమికి రెండు లక్షల 70 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు ఇటీవల అధ్యయనం ఒకటి వెల్లడించింది. అంటే చంద్రుడు ప్రస్తుతం ఉన్న దూరం తో పోల్చితే 70% మేర చేరువగా ఉండేవాడని తెలుస్తోంది. అప్పట్లో భూమి వేగంగా తిరుగుతున్నందువల్ల రోజు నిడివి కూడా తక్కువగా ఉండేది.

ఇక అన్ని అంతరిక్ష ప్రయోగ సంస్థలు చెబుతున్నట్టు చంద్రుడి లోపల భాగం రాళ్లు, ఖనిజాలతో నిండి ఉంది. చంద్రుడి లోపలి భాగం ప్రధానంగా సిలికేట్లతో కూడి ఉంటుంది. చంద్రుడి ఉపరితలంపై మానవ యోగ్యకరమైన వాతావరణం లేదు. పై భాగంలో పెద్ద గుంతలు, పర్వతాలు, లోయలు, మారియా అని పిలిచే పెద్ద, చదునైన సముద్రాలు ఉన్నాయి. అయితే వాటిలో నీరు ఉండదు. పౌర్ణమి రోజుల్లో చంద్రుడు వెలిగిపోతుంటాడు. అయితే అది చంద్రుడి కాంతి కాదు. సూర్యకాంతి. చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. వెలుతురును సృష్టించలేడు. సూర్యుడు నుంచి వచ్చిన కాంతి చంద్రుడి మీద పడి అది ప్రతిబింబిస్తుంది.

వాస్తవానికి చంద్రుడు తెలుపు రంగులో ఉండడు. చంద్రుడిని దగ్గరగా చూసినప్పుడు అది ముదురు బూడిద రంగులో కనిపిస్తుంది. గత ఏడాది శాస్త్రవేత్తలు చంద్రుడి మీద నుంచి తీసుకొచ్చిన మట్టిలో మొక్కలు పెంచే ప్రయత్నం చేశారు. ఇక చంద్రుడి మీదకి వెళ్తే కచ్చితంగా బరువు తగ్గుతాం.  భూమి మీద కంటే చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి తక్కువ. ఒక వ్యక్తి బరువు భూమి మీద 80 కిలోలు అయితే అదే చంద్రుడి మీద బరువు 13.3 కిలోలు మాత్రమే. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి కంటే భూమి శక్తి ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక చంద్రుడి మీద బసాల్ట్ శిలల రూపంలో పురాతనమైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు కాంతిని తక్కువ స్థాయిలో ప్రతిబింబిస్తాయి. అందువల్ల అలాంటి ప్రదేశాలు ఉన్న ప్రాంతం నీడలాగా, వివిధ ఆకారాలుగా కనిపిస్తుంది.