Chandrababu On CID: స్కిల్ డెవలప్మెంట్ కేసునకు సంబంధించి చంద్రబాబును సిఐడి విచారిస్తోంది. చంద్రబాబును రెండు రోజులు పాటు సిఐడి కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. శనివారం తొలిరోజు విచారణ పూర్తయింది. రెండో రోజు ఆదివారం ఉదయం 9:30 గంటలకు సిఐడి అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ రెండు రోజులపాటు సుమారు 15 గంటల పాటు సిఐడి విచారిస్తోంది. ప్రధానంగా చంద్రబాబుపై మోపిన 34 అభియోగాలతో పాటు… లోకేష్, కిలారి రాజేష్, చంద్రబాబు పిఎ శ్రీనివాస్ పాత్ర పై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
అయితే తొలి రోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కావలసిన విచారణ.. రెండు గంటలపాటు ఆలస్యంగా ప్రారంభమైంది. ఇది ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు చంద్రబాబు న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కస్టడీని పొడిగించాలని కోర్టును కోరేందుకే అలా వ్యవహరించారని ఆరోపించారు. అయితే తొలి రోజు మొదటి సెషన్ లో మూడు గంటలకు పైగా సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. ప్రతి గంటకు ఇద్దరు చొప్పున అధికారులు చంద్రబాబును ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సహకరించిన ఆధారాలను అనుగుణంగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ఎందుకు అమెరికా పారిపోయాడు? పెండ్యాల శ్రీనివాస్ అమెరికా వెళ్లేందుకు విమాన టిక్కెట్లు ఎవరు తీసుకున్నారు? సి మెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్ తో ఏ ఏ లావాదేవీలు నిర్వహించారు? చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ కు ఇన్కమ్ టాక్స్ శాఖ ఇచ్చిన నోటీసులపై ఏమంటారు? డిజైన్ టెక్ కంపెనీ అధిపతి కన్వెల్కర్ తో ఉన్న అనుబంధం ఏంటి? షెల్ కంపెనీల ఏర్పాటు వెనుక ఎవరెవరు ఉన్నారు? స్కిల్ డెవలప్మెంట్ నిధుల విడుదలకు ఎందుకు తొందర పడ్డారు? అధికారులపై ఎందుకు ఒత్తిడి తెచ్చారు? కీలకమైన ఫైలు ఎలా మాయమయ్యాయి? వంటి ప్రశ్నలతో చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేసినట్లు తెలుస్తోంది.
తనకు ఏ ప్రమేయము లేదని చంద్రబాబు చెబుతూనే.. కొన్నింటి విషయంలో స్పష్టమైన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని టిడిపి అనుకూల మీడియా రాసుకొచ్చింది. కానీ వైసీపీ అనుకూల మీడియా మాత్రం చంద్రబాబు నోరు తెరవడం లేదు.. సిఐడికి సహకరించడం లేదన్న ధోరణిలో వార్తలను, కథనాలను వండి వార్చింది. అయితే అంతా ఊహాగానాలే కానీ.. స్పష్టమైన వివరాలేవీ తెలియడం లేదు. విచారణ అంశాలను బయట పెట్టవద్దని సిఐడి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో.. ఆ విషయలేవి బయటకు రావడం లేదు. అటు సిఐడి వర్గాలతో పాటు.. బాబుకు సంబంధించిన లాయర్లు అక్కడే ఉన్న నేపథ్యంలో.. విచారణ లో లేవనెత్తిన అంశాలు ఇవి అంటూ వివరాలు బయటకు రావడం విశేషం.