Kalvakuntla Kavitha : ఏమిటి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్.. కవిత అరెస్టుకు ఎలా కారణమైంది?

ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి కోటి రూపాయలు ఇచ్చినట్టు సిబిఐ గుర్తించింది. రిటైల్ వ్యాపారులకు క్రెడిట్ నోటు జారీ చేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్టు సిబిఐ గుర్తించింది. మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ ఆరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండే ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్టు సిబిఐ అధికారులు గుర్తించారు.

Written By: NARESH, Updated On : March 15, 2024 10:33 pm

MLC Kavitha

Follow us on

Kalvakuntla Kavitha : ఈడీ అధికారులు మొత్తానికి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు. లిక్కర్ స్కామ్ లో ఆమె కూడా నిందితురాలు కాబట్టి అరెస్టు చేశామని ప్రకటించారు. ఇంతకీ ఏమిటి ఈ లిక్కర్ స్కామ్? ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురుకు ఈ కుంభకోణంతో ఏంటి సంబంధం? ఇందులో ఉన్న నిందితులు ఎవరు?

ఇదీ అసలు కారణం

2021లో ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ విధానంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలకు మద్యం అమ్మకాలను అప్పగిస్తూ గతంలో ఉన్న పాలసీ విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం మార్చేసింది. కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఆ విధానం కుంభకోణానికి దారి తీసిందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న రాజకీయ నేతలు అరెస్టయ్యారు. ఈ జాబితాలో ఎమ్మెల్సీ కవిత కూడా చేరింది. శుక్రవారం కవిత ఇంట్లో నాలుగు గంటలకు పైగా సోదాలు నిర్వహించిన అనంతరం ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు.

అలా మొదలైంది

ఢిల్లీలో ఉన్న మద్యం దుకాణాలకు సంబంధించి ముందుగా ఒక ఎక్స్ పర్ట్ కమిటీని ఢిల్లీ ప్రభుత్వం నియమించింది. అనంతరం కొంతకాలానికి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో ముగ్గురితో కమిటీని నియమించింది. వారు ఇచ్చిన సిఫారసులపై అధ్యయనం చేసేందుకు మళ్లీ ముగ్గురు మంత్రులతో కమిటీని నియమించింది. అనంతరం వారు ఇచ్చిన సూచనల ప్రకారం చాలా కాలంగా ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారం ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించడం ద్వారా 9,500 కోట్ల ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. ఇక కొత్త లిక్కర్ పాలసీని లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపించి ఆమోదముద్ర వేయించుకుంది. అయితే కొత్తగా ఏర్పాటు చేసే మద్యం దుకాణాలకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తప్పనిసరని లెఫ్టినెంట్ గవర్నర్ షరతు విధించారు. దానికి ప్రభుత్వం ఒప్పుకుంది. కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మధ్య దుకాణాలు తెరుచుకున్నాయి. ఇక కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. తెల్లవారుజామున మూడు గంటల వరకు షాపులు తెరిచి ఉంచేవారు. చివరికి మద్యం హోమ్ డెలివరీ కూడా నిబంధనలు సడలించారు.

ఆయన రాకతో..

2022 ఏప్రిల్ నెలలో నరేష్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీ కొత్త చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. లిక్కర్ పాలసీని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఈ బాగోతం మొత్తం వెలుగులోకి వచ్చింది. లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని, మద్యం దుకాణాల కేటాయింపులో తప్పులు జరిగాయని ఆయన గుర్తించారు. చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ అదే ఎడాది జూలైలో సిబిఐ విచారణకు ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించడం అప్పట్లో ఆరోపణలకు తావిచ్చింది. అయితే తాము ఆశించినంత స్థాయిలో ఆదాయం పెరగడం లేదని, అందుకే పాలసీని రద్దు చేశామని ఢిల్లీ ప్రభుత్వం సమర్ధించుకోవడం విశేషం. మరోవైపు తొలి త్రైమాసికానికి బడ్జెట్ అంచనాల కంటే దాదాపు 35% తక్కువ ఆదాయం రావడంతో.. తెర వెనుక ఏదో జరుగుతోంది అనే ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. మరోవైపు మద్యం దుకాణాల కేటాయింపులో ఇష్టానుసారంగా వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి. మద్యం పాలసీలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల మేర నష్టం చేశారని సిబిఐ దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు మద్యం వ్యాపారులు చెల్లించాల్సిన 145 కోట్ల పనులు ప్రభుత్వం కోవిడ్ పేరుతో మాఫీ చేసింది. ప్రతి బీర్ కేస్ కు చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వ మాఫీ చేసింది. ఎల్ -1 కేటగిరి లైసెన్సుల జారీ విషయంలో లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి కోటి రూపాయలు ఇచ్చినట్టు సిబిఐ గుర్తించింది. రిటైల్ వ్యాపారులకు క్రెడిట్ నోటు జారీ చేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్టు సిబిఐ గుర్తించింది. మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ ఆరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండే ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్టు సిబిఐ అధికారులు గుర్తించారు.