Independence Day 2023 : ఆగస్టు 10 నుంచి 15 దాకా ఏం జరిగింది? నరాలు తెగే ఉత్కంఠ ఎందుకు నెలకొంది

అర్ధరాత్రి 12 గంటలకు స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు భారతీయులందరూ వీధుల్లోకి వచ్చారు. జన గణ మన గీతం ఆలపించారు. భారత ప్రథమ ప్రధానిగా నెహ్రూ ప్రమాణ స్వీకారం చేశారు.

Written By: Bhaskar, Updated On : August 15, 2023 8:19 am
Follow us on

Independence Day 2023 : పాకిస్థాన్‌, భారత్‌లకు 1947 ఆగస్టు 14, 15 తేదీల్లో స్వాతంత్య్రం సిద్ధించింది. రెండు దేశాల ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. అయితే అంతకుముందు ఏం జరిగింది.. ముఖ్యంగా ఆగస్టు 10 నుంచి 15 వరకు రెండు ప్రాంతాల్లో ఉత్కంఠమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఆగస్టు 10..

రాజసంస్థానాలు బాగా ఒత్తిడిలో ఉన్నాయి. భారత్‌, పాకిస్థాన్‌లలో ఏదో ఒకదానిలో విలీనం కావాలని కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ నేతలు మహారాజాలపై ఒత్తిడి తీసుకొచ్చారు. పాక్‌ అనుకూల సింధీ ముస్లింలు జునాగఢ్‌ నవాబును చుట్టుముట్టి పాక్‌లో చేరాలని పట్టుబట్టారు. రాజా యశ్వంత్‌రావు సారథ్యంలోని సందూర్‌ రాజసంస్థానం భారత్‌లో కలిసేందుకు అంగీకరించింది. దేశవిభజన కారణంగా అటు వైపు వారు ఇటు.. ఇటువైపు వారు అటు వెళ్లేందుకు 30 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.

ఆగస్టు 11..

పాక్‌కు వెళ్లే వేల మంది ప్రయాణికులతో ఢిల్లీ రైల్వే స్టేషన్‌ కిక్కిరిసింది. పాక్‌ రాజ్యాంగ సభ సమావేశంలో మహ్మదాలీ జిన్నా తొలి ప్రసంగం చేశారు. పాకిస్థాన్‌ తన జాతీయ జెండాను ఖరారు చేసుకుంది. అమీరుద్దీన్‌ కిద్వాయ్‌ దీనిని రూపొందించారు. భారత్‌లో చేరేందుకు మణిపూర్‌ సంస్థానం అంగీకరించింది. భారత్‌లో దేశభక్తి మిన్నంటింది. వందేమాతరం, ‘1857’ వంటి సినిమాల్లోని గీతాలు ఆలపిస్తూ ప్రజలు వీధుల్లో తిరుగాడారు.

ఆగస్టు 12..

భారత్‌, పాకిస్థాన్‌లతో ‘యథాతథ స్థితి’ ఒప్పందానికి కశ్మీరు మహారాజా హరిసింగ్‌ ప్రతిపాదన. ఢిల్లీ డాన్‌ దినపత్రిక కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఎడిటర్‌ అల్తాఫ్‌ హుస్సేన్‌ ఇంటిని దుండగులు తగలబెట్టారు . రెండు దేశాలను విభజించే సరిహద్దు రేఖలు సిద్ధమయ్యాయి.

ఆగస్టు 13..

పాకిస్థాన్‌లో కలిసేందుకు రైళ్లు ఎక్కడానికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ముస్లిం మహిళలు  కిక్కిరిసిపోయారు. భారత్‌లో త్రిపుర సంస్థానాన్ని విలీనం చేసే ఒప్పందంపై త్రిపుర మహారాణి కంచనప్రవ దేవి సంతకం చేసింది. ఫెడరల్‌ కోర్టు చీఫ్‌ జస్టిస్‌ హరిలాల్‌ జెకిసుందాస్‌ కనియా భారత సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

ఆగస్టు 14..

స్వతంత్ర పాకిస్థాన్‌ ఆవిర్భవించింది. తొలి గవర్నర్‌ జనరల్‌గా మహ్మదాలీ జిన్నా బాధ్యతల స్వీకరించారు.. మొట్టమొదటి ప్రధానిగా లియాఖత్‌ ఆలీ ఖాన్ నియమితులయ్యారు. ఢిల్లీలో మౌంట్‌బాటన్‌ నివాసంపై బ్రిటిష్‌ జాతీయ పతాకం యూనియన్‌ జాక్‌ పతాకం అవనతం చేశారు. భారత రాజ్యాంగ సభ సమావేశమయింది.. స్వతంత్ర భారత తొలి శాసనసభగా ఆవిర్భవించేందుకు చర్చలు జరిగాయి.

ఆగస్టు 15..

అర్ధరాత్రి 12 గంటలకు స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు భారతీయులందరూ వీధుల్లోకి వచ్చారు. జన గణ మన గీతం ఆలపించారు. భారత ప్రథమ ప్రధానిగా నెహ్రూ ప్రమాణ స్వీకారం చేశారు.