https://oktelugu.com/

Gaddar : గద్దర్‌ గుండెకు ఆపరేషన్‌.. ఐసీయూలో పాట.. చనిపోయే ముందు ఏం జరిగింది

గద్దర్ తన గొంతుతో కోట్లాదిమందిలో చైతన్యం కలిగించిన గద్దర్‌.. చివరి క్షణంలోనూ పాటను వదల్లేదు. ఐసీయూలోనూ పాటలు పాడారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతూ కన్నీరుమున్నీరవుతున్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : August 6, 2023 6:27 pm
    Follow us on

    Gaddar : ప్రజా సమస్యలపై పాట రాసి.. దానికి తగ్గట్టు పాదం కదిపి.. ఏలికల గుండెల్లో పిడిబాకై.. పీడిత వర్గాల్లో రగల్‌ జెండాగా ఎగిరిన గుమ్మడి విఠల్‌ రావు.. అలియాస్‌ గద్దర్‌ స్వరం శాశ్వత విశ్రాంతి తీసుకుంది. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లె పోతవు కొడుకో అని పాడిన ఆ గొంతు సెలవు అంటూ వెళ్లిపోయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా అని పాడిన ఆయన స్వరం నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసి పోయింది. గద్దర్‌ మృతి చెందడంతో ఆయన అభిమానులు, విప్లవకారులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. మొన్నటి దాకా హుషారుగా ఉండి, 75 ఏళ్ల వడిలోనూ ఉత్సాహంగా ఉన్న గద్దర్‌ ఎలా చనిపోయారు? దానికి గల కారణాలు ఏంటి?

    గుండెకు సంబంఽధించి వ్యాధితో బాధపడుతున్న గద్దర్‌ ను రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఆయన గుండెకు శస్త్రచికిత్స చేశారు. విజయవంతమైందని చెప్పడంతో ఆయన కుటుంబీకులు, అభిమానులు సంతోషపడ్డారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్‌ అయ్యే వారు. మన మధ్య మాములు మనిషిగా తిరిగేవారు. గుండెకు శస్త్రచికిత్స అయిన తర్వాత ఆయన ఎలా చనిపోయారు? విజయవంతమైందని చెప్పిన తర్వాత ఎలా తిరిగిరాని లోకాలకు ఎలా వెళ్లారు? ఈ ప్రశ్నలకు అపోలో వైద్యులు ఓ ప్రెస్‌ నోట్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

    ఏం చెప్పారంటే?

    ‘గద్దర్‌కు తీవ్రమైన గుండె వ్యాధితో బాధపడుతున్నారు. ఆగస్టు 8న ఆయనకు బైపాస్‌ సర్జరీ చేశాం. ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఊపిరితిత్తుల సమస్య రావడంతో మరణించారు. గతంలో కూడా ఊపిరితిత్తుల సమస్యతోనే ఆయన ఇబ్బందిపడ్డారు. ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలు, వయసు సంబంధిత కారణాలతో ఆధివారం మధ్యాహ్నం గద్దర్‌ కన్నుమూశారు’ అని అపోలో వైద్యులు పేర్కొన్నారు.

    ఐసీయూలోనూ పాటలు పాడారు

    గద్దర్‌ మృతి పట్ల ఆయన కుటుంబీకులు కూడా కీలక ప్రకటన చేశారు. ‘ ఆదివారం ఉదయం బీపీ పెరిగింది. షుగర్‌ లెవల్స్‌ పడిపోయాయి. మధ్యాహ్నం అవయవాలు దెబ్బతిన్నాయి.’ అని గద్దర్‌ కుటుంబీకులు మీడియాకు వెల్లడించారు. అయితే తన గొంతుతో కోట్లాదిమందిలో చైతన్యం కలిగించిన గద్దర్‌.. చివరి క్షణంలోనూ పాటను వదల్లేదు. ఐసీయూలోనూ పాటలు పాడారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతూ కన్నీరుమున్నీరవుతున్నారు. గద్దర్‌ కన్నుమూయడంతో ప్రజా సంఘాల నాయకులు, విప్లవకారులు దిగ్ర్భాంతికి గురవుతున్నారు. ఆయనతో జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.