https://oktelugu.com/

Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో కులం, అవినీతి, స్వార్థం.. మచ్చుకైనా కానరాని ప్రజాసంక్షేమం?

తెలంగాణలో మిగతా సామాజికవర్గాలు కూడా స్థానిక అభ్యర్థి, పార్టీ, కలిగిన లబ్ధి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందో నిర్ధారించేకుని విడిపోయే అవకాశం కనిపిస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2023 4:05 pm
    Follow us on

    Telangana Elections 2023 : సదువేస్తే ఉన్నమతి పోయిందట.. అచ్చం ఈ సామెత తరహాలోనే ఉన్నాయి తెలంగాణ రాజకీయాలు. ఒకప్పుడు ఉత్తర భారత దేశానికే పరిమితమైన కుల రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలోని అన్ని పార్టీల్లో కనిపిస్తున్నాయి. ఇక బీజేపీకే పరిమితం అనుకున్న మత రాజకీయం.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లోనూ బయటపడుతున్నాయి. కుల మత రాజకీయాల నడుమ తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న మూడు ప్రధాన పార్టీలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశాయి. టిక్కెట్ల ఎంపిక నుంచి ఓట్లు వేయించుకునే వరకూ అన్ని పార్టీలు కులం, మతం చూస్తున్నాయి. వాటికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇక ప్రజల గురించి పట్టించుకునే పార్టీలే కనిపించడం లేదు. గెలిచిన తర్వాత ఆ విషయం అన్నట్లుగా పక్కన పెడుతున్నారు.

    రెడ్లు కాంగ్రెస్‌వైపు..
    తెలంగాణలో రెడ్డి సామాజికవర్గంలో ఎక్కువ శాతం కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపుతోంది. అందుకు అనుగుణంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలకు ఆ పార్టీ ఎక్కువగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది. తమకు మద్దతుగా నిలిచిన సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఎన్నికల్లో ఓట్లు కూడా తమకే పోల్‌ అవుతాయని కాంగ్రెస్‌ అంచనా.

    బీఆర్‌ఎస్‌కు వెలమల సపోర్టు..
    ఇక తెలంగాణలో అతి తక్కువ శాతం జనాభా, ఓటర్లు ఉన్న సామాజికవర్గాల్లో వెలమ ఒకటి. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో కేవలం 6 శాతం మాత్రమే వెలమ సామాజికవర్గం వారు ఉన్నారు. వీరు ఎన్నికలను ప్రభావితం చేసేది కూడా పెద్దగా ఉండదు. కానీ, సీఎం కేసీఆర్‌ స్వయంగా అదే సామాజికవర్గం నేత కావడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యం పెరిగింది. గడిచిన పదేళ్లలో కనీసం నాలుగుకు తగ్గకుండా తెలంగాణ కేబినెట్‌లో వెలమలు మంత్రులుగా ఉంటున్నారు. ఇక ఎమ్మెల్యేలుగా బీఆర్‌ఎస్‌ నుంచి 8 నుంచి 10 మంది పోటీ చేస్తున్నారు. ఆమేరకు కేసీఆర్‌ తన సామాజికవర్గానికి టిక్కెట్లు ఇస్తున్నారు. దీంతో ఆ సామాజికవర్గం 90 శాతం బీఆర్‌ఎస్‌వైపే ఉంటుంది.

    బీజేపీకి బ్రాహ్మణులు, ముదిరాజ్‌లు..
    ఇక బీజేపీ అంటేనే అగ్రవర్ణ పార్టీ అన్న ఒక అపవాదు ఉంది. వెనుకబడిన వర్గాలను పట్టించుకోదు అన్న భావన ఆ పార్టీ నేతలతోపాటు ప్రజల్లో ఉండేది. కానీ మోదీ ప్రధాని అయ్యాక ఆ అభిప్రాయం మారుతోంది. బీజేపీలో బీసీలు కూడా ప్రధాని, ముఖ్యమంత్రి అవుతారని మోదీ నిరూపిస్తున్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశారు. ముస్లింను కూడా రాష్ట్రపతిగా వాచ్‌పేయి ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే తెలంగాణలో మారిన రాజకీయం పరిణామాలతో బ్రాహ్మిణులతోపాటు ఇప్పుడు ముదిరాజ్‌లు కూడా బీజేపీవైపు చూస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. దీంతో బీసీల్లోని అధిక జనాభా ఉన్న ముదిరాజ్‌లు బీజేపీకి అండగా నిలుస్తామంటున్నారు. ఈటల రాజేందర్‌ బీజేపీలో ఉండడం, ఆయన ముఖ్యమంత్రి రేసులో ఉండడంతో ముదిరాజ్‌లు బీజేపీవైపు రావడానికి కారనంగా తెలుస్తోంది. ఇక బ్రాహ్మణులు బీజేపీకి మొదటి నుంచి సపోర్టుగానే ఉంటున్నారు. హిందుత్వ అజెండానే ఇందుకు కారణం.

    ముస్లింలు..
    ఇక తెలంగాణలో 9 శాతం ఉన్న ముస్లింలు బీజేపీ మినహా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం క్రమంగా తెలంగాణ వ్యాప్తంగా పార్టీని విస్తరిస్తోంది. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాలు గెలుస్తోంది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, భైంసా, బోధన్, కామారెడ్డి, జగిత్యాల వంటి మున్సిపాలిటీల్లో ఎంఐఎంకు ప్రాతినిధ్యం ఉంది. ముస్లింలు ఎంఐఎం తర్వాత ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు, తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా ఉంటున్నారు. ఈసారి మారిన రాజకీయాలతో ముస్లిం ఓట్లు మూడి పార్టీలకు చీలిపోయే అవకాశం కనిపిస్తుంది.

    మున్నూరు కాపులు, చౌదరీలు, మిగతా బీసీలు ఎటో?
    ఇక తెలంగాణలో ముదిరాజ్‌ల తర్వాత అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గాలు మున్నూరుకాపులు, యాదవులు. ఈ రెండు సామాజికవర్గాలు తెలంగాణలో పార్టీల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. అందకే కేసీఆర్‌ యాదవుల కోసం గొర్రెల పంపిణీ పథకం తెచ్చారు. మున్నూరు కాపుల కోసం రైతుబంధు తెచ్చారు. తెలంగాణలో వెలమల తర్వాత అత్యధిక భూములు ఉన్నది మున్నూరు కాపులకే అందుకే అందుకే ఇప్పటి వరకు ఆ రెండ సామాజికవర్గాలు బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉన్నాయి. కానీ, ఈసారి పరిస్థితి మారింది. రైతుబంధుతో సబ్సిడీలు కోతపెట్టింది కేసీఆర్‌ సర్కార్, గొర్రెలు మొదటి విడత పంపిణీకే పరిమితమైంది. దీంతో ఆ సామాజికవర్గాలు ఇప్పుడు కాంగ్రెస్‌వైపు చూస్తున్నాయి. చౌదరీలు నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో కొత మంది ఉన్నారు. వీరిని ఏ పార్టీలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో వీరి ప్రభావం కూడా తక్కువే. అందుకే వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇక మిగతా బీసీలు అయిన పద్మశాలీలు సిరిసిల్ల, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్‌ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. ఒక్క సిరిసిల్ల మినహా మిగతా నియోజకవర్గాల్లోని పద్మశాలీలకు బీఆర్‌ఎస్‌ పాలనలో పెద్దగా లబ్ధి జరుగలేదు. దీంతో సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్న పద్మశాలీలు, మిగత జిల్లాల్లో పార్టీల వారీగా చీలిపోతున్నారు. తర్వాత ప్రభావితం చేసేది మాల, మాదిగలు, వీరు తెలంగాణలో ఎక్కువగానే ఉన్నారు. కానీ, ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు పట్టుపడుతుండగా, మాలలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ సామాజికవర్గాలు కూడా విడిపోయి వేర్వేరు పార్టీలకు అండగా నిలుస్తున్నారు. ఈసారి బీజేపీ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచిన మాదిగలు ఈసారి బీజేపీవైపు మళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఈనెలలో నిర్వహించే మాదిగల విశ్వరూప సభకు ప్రధాని మోదీ కూడా హాజరవుతున్నారు. మాలలు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది.

    తెలంగాణలో మిగతా సామాజికవర్గాలు కూడా స్థానిక అభ్యర్థి, పార్టీ, కలిగిన లబ్ధి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందో నిర్ధారించేకుని విడిపోయే అవకాశం కనిపిస్తుంది.