Vinodhaya Sitham Vs Bro Movie : కంటెంట్ ఉంటే కటౌట్ అక్కర్లేదని ‘తమిళ వినోదయ సీతం’ నిరూపించింది. అసలు ఆ సినిమాలో హీరో లేడు. ఓ 70 ఏళ్ల ముసలాయనే హీరో. ఇక దర్శకుడు సముద్రఖని దేవుడిగా నటించాడు. వీరిద్దరూ ఫేమ్ లేనివారే.. అందుకే కథను నమ్ముకొని తీశారు హిట్ కొట్టారు. కానీ తెలుగులో ఆ తమిళ ఫార్ములా హిట్ కాదని భయపడ్డారు. అందుకే కమర్షియల్ గా తీశారు. ఇక్కడా మూడు రోజులకే 100 కోట్లు కొల్లగొట్టారు.
వినోదాయసితం లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీని పవన్ కళ్యాణ్ వంటి మాస్ హీరోతో చేయడం పెద్ద సాహసం. చిన్న ఒరలో పెద్ద కత్తిని ఇరికించడం వంటిది. అందులోనూ తెలుగు ప్రేక్షకుల అభిరుచి వేరు. స్టార్ హీరోల నుండి కమర్షియల్ చిత్రాలు మాత్రమే కోరుకుంటారు. త్రివిక్రమ్ చొరవతో వినోదాయసితం రిమేక్ కి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. బ్రో కోసం మూలకథలో సమూల మార్పులు చేశారు. చెప్పాలన్న పాయింట్ మాత్రం ఒకటే. కాగా వినోదాయసితం-బ్రో చిత్రాల మధ్య ప్రధాన వ్యత్యాసాలు ఏమిటో ఒకసారి చూద్దాం…
ఒరిజినల్ వినోదాయసితం కథ పరిశీలిస్తే… ఈ చిత్ర టైటిల్ అర్థం విభిన్నమైన నిర్ణయం అని. పరశురామ్ అనే ఒక 70 ఏళ్ల వృద్ధుడు లైఫ్ అంటే పర్ఫెక్ట్ గా బ్రతకడమే అనుకుంటాడు. క్రమశిక్షణకు మారుపేరైన పరుశురామ్ సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు. వృత్తిలో, కుటుంబ సభ్యుల పట్ల చాలా బాధ్యతగా ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అప్పుడు టైం(సముద్రఖని) తనని పరలోకానికి తీసుకెళతాడు. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్ని మిగిలి ఉన్నాయి. సెకండ్ ఛాన్స్ కావాలని పరశురామ్ కోరుకుంటాడు.
అసలు జీవితం అంటే ఏమిటో తెలియజెప్పాలనే ప్రణాళికలో భాగంగా టైం పరశురామ్ కి 90 రోజుల సమయం ఇస్తాడు. ఈ 90 రోజుల్లో నువ్వు చేయాలనుకున్న పనులు పూర్తి చేసుకుని తిరిగి వచ్చేయాలని టైం కండీషన్ పెడతాడు. అప్పుడు పరశురామ్ కి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. జీవితం అనేది మనం అనుకున్నట్లు ఉండదు. మనం చూసే కోణం వేరు అసలు జరిగేది వేరని తెలుసుకుంటాడు. తన ప్రణాళికలు మొత్తం రివర్స్ అవుతుంటే తట్టుకోలేకపోతాడు. టైం సెకండ్ ఛాన్స్ ఇవ్వడం వలన పరశురామ్ కి లైఫ్ అంటే ఏమిటో తెలిసి వస్తుంది..
వినోదాయసితంలో పరుశురాం పాత్రకు భార్య, పిల్లలు ఉంటారు. వాళ్లతో ఆయన ఎమోషనల్ జర్నీ హృద్యంగా సాగుతుంది. వాళ్ళ మంచి కోరిన ఆయనకు వాళ్ళు షాక్స్ ఇస్తారు. టైం పాత్రను సముద్రఖని చేశారు. ఆయన ఇమేజ్ కి చక్కగా సెట్ అయ్యింది. సినిమా ఆద్యంతం కోర్ పాయింట్ చుట్టూ తిరుగుతుంది. సముద్రఖని ఎక్కడా అనవసర సన్నివేశాల జోలికి పోలేడు. చివరి వరకు హ్యూమర్, ఎమోషన్స్ తో నడిపించి… క్లైమాక్స్ గుండెను తాకే సన్నివేశాలతో ముగించాడు. చక్కని సందేశంతో కూడా ఎమోషనల్ స్టోరీ నుండి ప్రేక్షకులు బయటకు రాలేరు.
ఇదే కథను పవన్ కళ్యాణ్ తో చేయాల్సి వచ్చినప్పుడు దర్శకుడు సముద్రఖని ఛాలెంజింగ్ తీసుకున్నారు. త్రివిక్రమ్ మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ఆయన ముందుకు వెళ్లారు. తంబి రామయ్య చేసిన 70 ఏళ్ల పరశురామ్ పాత్రను సాయి ధరమ్ చేశారు. అంటే యువకుడిగా మార్చి రాశారు. పాత్ర తీరు ఒకటే. అక్కడ భార్య, కూతురు, కొడుకు ప్రధాన పాత్రకు అనుసంధానంగా పాత్రలు రాసుకున్నారు.
బ్రో మూవీలో సాయి ధరమ్ పాత్రకు అనుసంధానంగా లవర్, మదర్, సిస్టర్స్ రోల్స్ రాశారు. ఇక అసలైన ఛాలెంజ్ సముద్రఖని పాత్రను పవన్ కళ్యాణ్ కి రాయడం. సినిమాను మార్కెట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా చూపిస్తే కుదరదు. ఒరిజినల్ లో సముద్రఖని పాత్ర నిడివి చాలా తక్కువ. ఇక్కడ పరిధి 70% శాతానికి పెంచారు. పవన్ సన్నివేశాలను సాధారణంగా లాగించేస్తే అంత పెద్ద హీరో ఉన్నదానికి అర్థం ఉండదు. అందుకే కమర్షియల్ అంశాలు జోడించారు.
సాయి ధరమ్ తేజ్ కి పాటలు, ఫైట్లు, పవన్ కళ్యాణ్ వింటేజ్ గెటప్స్, సాంగ్స్ అందులో భాగమే. ఇవి ఫ్యాన్స్ వరకు బాగా వర్క్ అవుట్ అయ్యాయి. అయితే ఎమోషనల్ కంటెంట్ ని దెబ్బతీశాయి. కుటుంబంతో ఎమోషనల్ సన్నివేశాలు నిడివి తగ్గిపోయింది. ఒరిజినల్ వినోదాయసితంలో ఫ్యామిలీ డ్రామా క్లైమాక్స్ కి పీక్స్ చేరుతుంది. ప్రేక్షకులు పూర్తి స్థాయిలో కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. బ్రో మూవీలో ఇది ఒకింత మిస్ అయ్యింది.
వినోదాయసితం కథకు అనుగుణంగా నటులను ఎంచుకున్నారు.స్క్రీన్ పై ప్రేక్షకులు నిజ జీవిత పాత్రలను చూసిన అనుభూతి కలుగుతుంది. బ్రో మూవీలో స్టార్ క్యాస్ట్ కారణంగా సహజత్వం అనేది తగ్గింది. హీరోయిన్స్, ఐటెం సాంగ్స్, ఫైట్స్ ఈ కథకు ఏ మాత్రం నప్పవు. అయితే బ్రో మూవీలో చాలా వరకు జస్టిఫై చేశారు.
పవన్ కళ్యాణ్ ఈ సినిమా పారితోషికంగా దాదాపు 50 కోట్లు తీసుకున్నాడు. కానీ పవన్ ను చూసే జనాలు దీనికి 100 కోట్లు మూడు రోజుల్లోనే ఇచ్చారన్నది మరువకూడదు. ఇక ఓటీటీ, డిజిటల్, థియేట్రికల్ రన్ ఉంది. సో పవన్ స్టామినాకు సరితూగేలాగానే సినిమా నడిచింది. పవన్ ఆ జోష్ ను సినిమాలో చూపించాడు. ఆ దేవుడి పాత్రకు న్యాయం చేసాడు. అన్నింటి కన్నా తమిళ పాత్రలు బాగా ఎమోషనల్ గా పండాయి. తెలుగులో కుటుంబ బంధాలు అంతగా ఎలివేట్ కాలేదన్న టాక్ ఉంది. కొంచెం ల్యాగ్ కనిపిస్తోంది. పవన్ డామినేషన్ ఉంది. నటన పరంగా రెండు భాషల్లో అందరూ బాగానే చేశారు. తమిళ్ తెలుగు ప్రేక్షకుల అభిరుచిని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ కంటెంట్ కనపడింది. ఇక్కడ హీరోయిజం ఎలివేట్ అయ్యింది. మిగతా అంతా సేమ్ టు సేమ్. అందుకే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేయడంతో చిత్రాన్ని ఆదరిస్తున్నారు
వినోదాయసితం ప్రాజెక్ట్ ని బ్రోగా మలచడంలో దర్శకుడు సముద్రఖని, త్రివిక్రమ్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. అయితే ఒరిజినల్ చూసిన వాళ్లకు బ్రో చాలా ఆర్టిఫీషియల్ గా ఉంటుంది. ఆ కథ తెలియనివారు ఫ్రెష్ స్టోరీ భావనలో ఎంజాయ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ కి ఈ రీమేక్ వర్క్ అవుట్ అవుతుందా? లేదా? అనే సందేహాలను పటాపంచలు చేస్తూ మూవీ మంచి విజయం సాధించింది.