Amit Shah On Jawaharlal Nehru: రాజకీయాల్లో ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఆ ప్రయోజనాల కోసం నాయకులు గతం తాలూకు శత్రుత్వాలను ఒక్కొక్కసారి విడిచి పెడుతుంటారు. అకస్మాత్తుగా స్నేహ జీతం ఆలపిస్తూ ఉంటారు. వారు చేసిన సేవలను కొనియాడుతూ ఉంటారు. గురువారం ఇటువంటి సంఘటనే లోక్ సభ లో జరిగింది. ఢిల్లీ బిల్లుకు సంబంధించి లోక్ సభ లో చర్చ జరుగుతున్నప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తరుచూ దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ను విమర్శించే అమిత్ షా.. ఈసారి మాత్రం ఆయనను కీర్తిస్తూ మాట్లాడారు. ” ఢిల్లీకి రాష్ట్ర హోదాను ఇవ్వడాన్ని దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ తొలి గవర్నర్ జనరల్ రాజగోపాలా చారి వ్యతిరేకించారు. ఇదేదో కొత్తగా భారతీయ జనతా పార్టీ తీసుకు వస్తున్నది కాదు.” అంటూ ప్రస్తుత తమ అవసరానికి కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి తీసుకొచ్చిన ఒకప్పటి విధానాలను కీర్తించారు.
టార్గెట్ అదేనా
గురువారం లోక్ సభలో అమిత్ షా మాట్లాడిన మాటలు.. ఇండియా కూటమిని టార్గెట్ చేసే విధంగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఢిల్లీ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ బిజెపికి అనుకూలంగా మాట్లాడింది. తర్వాత బెంగళూరు నిర్వహించిన సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయం మీద విమర్శలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఢిల్లీ పై నిరసన గళం వినిపించింది. అయితే ఈ కూటమిలో ఉన్న ఆప్ ను ఏకాకి చేయాలనే ఉద్దేశంతో నిన్న అమిత్ షా కాంగ్రెస్ ను స్తుతిస్తూ మాట్లాడినట్టు కనిపిస్తోంది. గతంలో ఢిల్లీకి సంబంధించి జవహర్ లాల్ నెహ్రూ తీసుకున్న విధానాలను ఆయన గుర్తు చేశారు. దీంతో అటు కాంగ్రెస్ పార్టీని డైలామాలో పడేశారు. ఇటు ఆప్ ను ఆత్మ రక్షణలో పడేశారు. అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నమాట.
ఆప్ బయటికి వస్తుందా?
ఇక ఈ బిల్లు మూజువాణి ఓటు ద్వారా ఆమోదం పొందిన నేపథ్యంలో ఇండియాకు కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ బయటకు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ బిల్లు విషయంలో మిగతా విపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మాట్లాడలేదని ఆప్ భావిస్తోంది. గతంలో నిర్వహించిన సమావేశాల్లోనూ ఇదేవిధంగా ఆప్ నేతలు మాట్లాడారు. ప్రస్తుతం ఈ బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని వెనకేసుకు రావడం.. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా విమర్శించకపోవడంతో.. మనసు నొచ్చుకున్న ఆప్ నేతలు కూటమి నుంచి బయటికి రావాలని అరవింద్ కేజ్రీవాల్ మీద ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.