https://oktelugu.com/

Vladimir Putin : పుతిన్ ను విమర్శిస్తే బతికి బట్ట కట్టలేరా?

కాగా, పుతిన్ ను విమర్శించిన 19 మంది ప్రాణాలు కోల్పోగా.. అవన్నీ ఆత్మహత్యలు లేదా ప్రమాదాలని రష్యా అధికారులు చెబుతుండడం విశేషం.

Written By:
  • NARESH
  • , Updated On : February 19, 2024 / 08:55 AM IST
    Follow us on

    Vladimir Putin : “మీరు దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలకు సంబంధించిన అంతర్జాతీయ విషయాలు పరిశీలించండి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు అన్ని దేశాల(ఉత్తరకొరియా అధ్యక్షుడు ఈ పరిధిలోకి రాడు) అధినేతల పేర్లు మారినట్టు కనిపిస్తాయి. ఒక రష్యా అధినేత మాత్రం అలాగే ఉంటాడు. ఎందుకంటే అక్కడ అతని పెత్తనం అలా ఉంటుంది. రష్యా అంటే చిన్న దేశం కాదు కదా.. ప్రపంచ ఆర్థిక రంగాన్ని ఒకప్పుడు శాసించింది. ఇప్పుడు కూడా బలమైన ప్రభావాన్ని చూపిస్తోంది” ఇవీ ఆ మధ్య ఓ ఆంగ్ల పత్రికలో ప్రముఖ కాలమిస్ట్ రాసిన సంపాదకీయంలో ముఖ్యమైన వాక్యాలు. ఈ నాలుగు వాక్యాలు చాలు రష్యాలో పరిస్థితి ఎలా ఉందో చెప్పేందుకు… ఉక్రెయిన్ తో యుద్ధం, యూరప్ తో విభేదాలు, చైనా తో సాన్నిహిత్యం, అమెరికాతో ఎడమొహం పెడ మొహం.. ఇలా తనకు నచ్చిన నిర్ణయాన్నే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్నాడు. తన నిర్ణయాన్నే దేశ నిర్ణయం గా ప్రకటించాడు. తన నిర్ణయం పట్ల దేశంలో వ్యతిరేకత వ్యక్తం కానంతవరకు తనలో మరో మనిషిని బయటి ప్రపంచానికి చూపించలేదు. కానీ ఎప్పుడైతే తన నిర్ణయాలకు వ్యతిరేక స్వరం వినిపించిందో.. ఆ స్వరాలు అనుమానాస్పదంగా కనుమరుగు కావడం ప్రారంభమైంది.

    ఇటీవల రష్యాలో పుతిన్ ను విమర్శించిన వారు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతున్నారు. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి మరణాలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇక తాజాగా రష్యా లో ప్రతిపక్ష నాయకుడు అలెక్సి నావల్ని (Alexey Navalny) కూడా ఇదే తీరుగా మృతి చెందాడు. ఆయన మరణం గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నావల్ని మృతికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కారణమని అతడి భార్య, మద్దతుదారులు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా దేశాధినేత ఆరోపిస్తున్నారు. వీరి ఆరోపణల నేపథ్యంలో పుతిన్ ను విమర్శిస్తే మృత్యువు ఏదో ఒక రూపంలో ముంచుకు వస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఈ మరణాలలో పుతిన్ కుట్ర ఉందా? లేకుంటే ఆ మరణాలన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు లభించాల్సి ఉంది.

    పుతిన్ హయాంలో ఆయనను విమర్శించిన ఎంతో మంది రాజకీయ, సామాజిక, వ్యాపార ప్రముఖులు ఏదో ఒక రూపంలో దుర్మరణం చెందారు.

    రష్యా కిరాయి సైన్యం

    వాగ్నర్ గ్రూప్.. రష్యా కిరాయి సైన్యం గా పేరుపొందింది. దీనికి ప్రిగోజిన్ నాయకత్వం వహించేవాడు. గత ఏడాది ఉక్రెయిన్ పై జరిగిన యుద్ధంలో ఈ గ్రూప్ అత్యంత ముఖ్యపాత్ర పోషించింది. గత ఏడాది చివరిలో రష్యా సైన్యంపై ప్రిగోజిన్ గ్రూప్ తిరుగుబాటు చేయడం ఒకసారి గా కలకలం రేపింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ ప్రిగోజిన్ వెనక్కి తగ్గాడు. అనూహ్య పరిణామాల మధ్య బెలారస్ ఆశ్రమంలో ఆశ్రయం పొందాడు. ఈ విషయాన్ని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుక శెంకో వెల్లడించారు. పుతిన్, ప్రిగోజిన్ మధ్య వివాదాలు లేవని లుక శెంకో వెల్లడించిన కొద్ది రోజులకే ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో కన్నుమూశాడు. అతనితోపాటు అంగరక్షకులు పదిమంది కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు.

    బోరిస్ నెమత్సోవ్

    బోరిస్ నెమత్సోవ్ రష్యా ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఇతడికి రష్యా దేశంలో మంచి పేరుంది. గొప్ప నాయకుడిగా అవతరించే క్రమంలో 2015లో క్రేమ్లిన్ దగ్గర్లోని మాస్కో వంతెన వద్ద కొంతమంది వ్యక్తులు అతడిని కాల్చి చంపారు. ఈ ఘటనలో చెచెన్ కు చెందిన ఐదుగురిని రష్యా బలగాలు అరెస్టు చేశాయి.. అయితే ఈ ఘటన వెనక ఎవరి ప్రమేయం ఉంది అనేది ఇంతవరకు చెప్పలేకపోయాయి. 2014లో క్రిమియాను ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్నప్పుడు పుతిన్ తీరుకు నిరసనగా బోరిస్ నిరసన తెలిపాడు. పుతిన్ తీసుకునే నిర్ణయాలు సరికావంటూ విమర్శించేవాడు. అంతర్జాతీయ వేదికల్లోనూ ఇదే విషయాన్ని చెప్పేవాడు.

    జర్నలిస్ట్ అన్నా

    చెచెన్ నాయకుడు రంజాన్ కదిరోవ్,పుతిన్ పై జర్నలిస్ట్ అన్నా పొలిట్ కోవ్ స్కాయను కిరాతకంగా హత్య చేశారు. అప్పట్లో ఆమె మృతి పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు రష్యాలో పత్రికా స్వేచ్ఛ పై అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు..

    అలెగ్జాండర్ లిట్వినెంకో

    1999 లో మాస్కో అపార్ట్ మెంట్ బాంబుదాడులకు పుతిన్ కారణమని అలెగ్జాండర్ లిట్వినెంకో ఆరోపించాడు. వృత్తిపరంగా ఫెడరల్ సెక్యూరిటీ ఏజెంట్గా పని చేసేవాడు. పుతిన్ హయాంలో జరుగుతున్న ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించాడు.. ఆ తర్వాత 2006లో ఇంగ్లాండ్ లోని లండన్ లో ఇద్దరు రష్యన్ ఏజెంట్లతో కలిసి టీ తాగుతుండగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన తాగిన టీలో విష ప్రయోగం జరిగిందని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. వీరు మాత్రమే కాకుండా పుతిన్ విధానాలను ప్రశ్నించిన వారు ఆత్మహత్యలు చేసుకోవడం, అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోవడం వంటిఘటనలు జరిగాయి. రష్యా వ్యాపారవేత్త ఎంపీ అంటోవ్ 2022 డిసెంబర్లో ఒడిశా రాష్ట్రంలోని రాయగడ హోటల్లో మరణించారు. అంతకు కొద్ది రోజుల ముందు అలెగ్జాండర్ బుజెకోవ్ అనే వ్యాపారవేత్త సబ్ మెరైన్ ఫ్లోటింగ్ ఫంక్షన్ లో అనుమానాస్పదంగా మృతిచెందారు. మాత్రమే కాకుండా ఉక్రెయిన్ దేశం తో యుద్ధ మొదలైనప్పుడు గ్యాజ్ ప్రామ్ యూనిఫైడ్ సెటిల్మెంట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అలెగ్జాండర్ ట్యూ ల్కోవ్ హఠాత్తుగా మృతి చెందాడు. లుక్ ఆయిల్ చైర్మన్ రావిల్ మాగ్నొవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, పుతిన్ ను విమర్శించిన 19 మంది ప్రాణాలు కోల్పోగా.. అవన్నీ ఆత్మహత్యలు లేదా ప్రమాదాలని రష్యా అధికారులు చెబుతుండడం విశేషం. అయితే చనిపోయిన వారందరూ ఏదో ఒక సందర్భంలో పుతిన్ పై ఆరోపణలు చేసిన వారే. ఆయన విధానాలను విమర్శించినవారే..