Virat Kohli: విరాట్ కోహ్లి.. పరిచయం అక్కర్లేని పేరు. నిలకడగా పరుగులు సాధించడం, ఫీల్డింగ్ లో చిరుతల కదలడం, ఫిట్‌నెస్‌లో మేటిగా ఉండటం అతడికే సాధ్యం. అందుకే రికార్డులే విరాట్ పేరు మీద ఉండాలని పోటీపడుతుంటాయి. బ్యాట్‌తో క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సాధించిన కోహ్లి మరో ఘనత సాధించాడు. అయితే ఈసారి ఆటలో కాదు..గూగుల్ లో. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌లోనూ సత్తా చాటాడు. గూగుల్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా గూగుల్ చరిత్రలో అత్యధిక మంది శోధించిన అంశాలతో ఎక్స్‌లో ఓ వీడియోను అప్‌లోడ్ చేశారు. ‘‘25 ఏళ్ల క్రితం ఈ ప్రపంచం వెతకడం ప్రారంభించింది. ఇక మిగతాదంతా చరిత్రే’’ అంటూ వీడియో మొదలైంది.
అతని కోసమే ఎక్కువ సెర్చ్‌లు..
గూగుల్ వీడియో ప్రకారం గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అత్యధిక మంది శోధించిన అథ్లెట్‌గా ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో నిలిచాడు. ఎక్కువ మంది శోధించిన ఆట ఫుట్‌బాల్ కాగా, ఎక్కువ మంది శోధించిన సినిమాగా బాలీవుడ్ మూవీ జానర్ నిలిచింది. గూగుల్‌లో ఈ సంవత్సరం అత్యధిక మంది శోధించిన వాటిలో క్రీడా టోర్నీల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో వన్డే ప్రపంచకప్, ఆసియాకప్, మహిళల ప్రీమియర్ లీగ్, ఆసియా క్రీడలు, ఇండియన్ సూపర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, యాషెస్ సిరీస్, మహిళ క్రికెట్ ప్రపంచకప్, ఎస్‌ఏ20 నిలిచాయి.
ఇటీవలే సచిన్ రికార్డు బద్ధలు..
కింగ్ విరాట్ కోహ్లి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును ఇటీవలే బద్ధలు కొట్టాడు. ఐసీసీ వన్డే వరల్ కప్‌లో వన్డే ఫార్మాట్ లో 50 సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్‌గా కోహ్లి చరిత్రకెక్కాడు. గతంలో వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు సచిన్(49) పేరిట ఉంది. అయితే సచిన్ 100 సెంచరీల రికార్డుకు కోహ్లి 20 సెంచరీల దూరంలో ఉన్నాడు. కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి 80 శతకాలు చేశాడు.
వన్డే వరల్డ్‌కప్‌తో సత్తా..
ఇక ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ పరుగుల వరద పారించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు. ప్రపంచకప్ లో 11 మ్యాచ్‌లు ఆడి 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. మూడు శతకాలు, ఆరు హాఫ్ సెంచరీలో ఉన్నాయి. ఓ ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా విరాట్ రికార్డు సాధించాడు.