YCP : ఏపీ సీఎం జగన్ ఇమేజ్ కారణం ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి. తండ్రి అందించిన సుపరిపాలన, ఆయన అకాల మరణం తోనే జగన్ పై విపరీతంగా సానుభూతి పని చేసింది. సాధారణ ఎంపీగా ఉన్న జగన్ కు ఎనలేని ప్రజాదరణ కలగడానికి సానుభూతి ప్రధాన కారణం. కానీ ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైయస్సార్ కుటుంబం నిట్ట నిలువునా చీలిపోయింది. సోదరుడుతో ఉన్న విభేదాలతో షర్మిల తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివేకా హత్యతో ఆయన కుమార్తె సునీత సైతం జగన్ ను విభేదిస్తున్నారు. షర్మిల వెంట నడవనున్నారు. దీంతో రాజకీయ ప్రత్యర్థులకు మించి వీరిద్దరూ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అది ఇబ్బందికర పరిణామమే.
కడప జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది వైయస్సార్ కుటుంబం. జిల్లాతో నాలుగు దశాబ్దాల బంధం వారిది. కానీ ప్రస్తుతం కుటుంబంలో చెలరేగిన వివాదంతో మసకబారుతోంది. కడపలో వైసిపి బలం తగ్గుతోంది. ఇది సహజంగానే కలవరపాటుకు గురి చేసే అంశం. దీనికి తోడు షర్మిల, సునీత కడప జిల్లాలో పట్టు బిగించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. కడప పార్లమెంట్ స్థానంతో పాటు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వారిద్దరూ పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. అదే జరిగితే కుటుంబ పరంగా ఇబ్బందికర పరిస్థితులను జగన్ ఎదుర్కొనున్నారు. నాలుగు దశాబ్దాల ఆధిపత్యానికి చెక్ పడనుంది. ప్రత్యర్థులకు ఈ పరిస్థితులు కలిసి రానున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి పార్టీ నేతలు ఉన్నారు. కానీ కడప జిల్లాలో షర్మిల, సునీతలను ఎదుర్కోవడానికి సొంత కుటుంబ సభ్యులు ఇప్పుడు అవసరం. ఇతర నేతలతో వారిని విమర్శిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కాక తప్పదు. అందుకే జగన్ విజయమ్మను ప్రయోగిస్తారని ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు ఆమె వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంతో ఆమె వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. వైసిపి గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు షర్మిల ఏపీ రాజకీయాల వైపు రావడంతో విజయమ్మ సైలెంట్ అయ్యారు. ఆమె కుమారుడు వైపు ఉంటారా? కుమార్తె వైపు నిలుస్తారా? అన్న బలమైన చర్చ నడుస్తోంది.
అయితే విజయమ్మను ఎలాగైనా వైసీపీలోకి రప్పించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. షర్మిల దూకుడుకు కళ్లెం వేయాలంటే విజయమ్మ అవసరం తప్పనిసరి అని సీనియర్లు జగన్ కు సూచించారు. దీంతో ఆయన తల్లిని అభ్యర్థించినట్లు సమాచారం. ఆమె సానుకూలంగా స్పందించినట్లు కూడా తెలుస్తోంది. విజయమ్మను ఒక్క ప్రచారానికి పరిమితం చేయకుండా.. అవసరమైతే ఆమెతో పోటీ చేయించాలని కూడా జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు షర్మిల వెంట విజయమ్మ నడిచారు. కానీ ఇప్పుడు షర్మిల జగన్ కు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో విజయమ్మ నిర్ణయం ఏమిటనేది తెలియాల్సి ఉంది. అయితే ఆమె కొడుకువైపే నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో విజయం పాత్ర ఏమిటనేది కొద్ది రోజుల్లో తేలనుంది.