Tomato Robbed : బంగారం, వెండి దొంగతనం చేయడం చూశాం. కానీ కూరగాయలు చోరీ చేయడం మాత్రం వినలేదు. కానీ ఆ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. టమాటా ధరలు రూ. వంద దాటడంతో ఖరీదైనవిగా భావించి ఎత్తుకుపోతున్నారు. వరంగల్, కర్ణాటక లో ఈ ఘటనలు జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో దొంగతనాల్లో కొత్త తరహా కావడం విశేషం. భవిష్యత్ లో కూరగాయలకు కూడా కాపలా కాయాల్సిన పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు.
వరంగల్ లో కూరగాయల దుకాణం నిర్వహించే వ్యక్తి తెల్లవారి వచ్చి చూసే సరికి కొట్టో ఉండాల్సిన కూరగాయలు మాయమైపోయాయి. రాత్రి రాత్రే వాటిని ఎత్తుకెళ్లారు. అచ్చం ఇలాంటి ఘటనే కర్ణాటకలోనూ జరిగింది. కూరగాయలు పండించే ఓ రైతుకు చెందిన చేనులో టమాటాలు మొత్తం దోచుకెళ్లారు. దేశంలో టమాటాల ధరలు పెరగడంతో ఇలా చోరీలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
కర్ణాటకలో చేనులోని దాదాపు 60 బస్తాల టమాటాలు మాయం చేశారు. దాదాపు రెండు వేల కిలోల టమాటాలను మార్కెట్ కు తరలిస్తుండగా ముగ్గురు దుండగులు కారులో వాహనాన్ని అనుసరించారు. తమ వాహనాన్ని ఆ రైతు వాహనం ఢీకొందని వారితో గొడవ పడ్డారు. అనంతరం వారిపై దాడి చేసి నష్టపరిహారం డిమాండ్ చేశారు. తరువాత రైతుకు చెందిన వాహనాన్ని తీసుకుని వారి పారిపోయారు. టమాటాల కోసమే వారు ఈ పని చేసినట్లు తెలుస్తోంది.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలో ఇప్పుడు కిలో టమాటాల ధర రూ. 120 నుంచి 150 మధ్య పలుకుతోంది. ఇలా టమాటాల కోసమే దొంగతనాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. టమాటాలు ఎంత పని చేశాయి. చివరకు మనుషులను దొంగలుగా చేస్తున్నాయి.