Valentine’s day : ప్రేమంటే రెండు మనసులు కలయిక. కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం లాంటివేవీ చూడకుండా కుదుర్చుకునే ఒక ఒడంబడిక. అలాంటి ప్రేమ కలకాలం నిలిచి ఉంటుంది. అలాంటి ప్రేమికుల కోసం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వచ్చే వాలెంటైన్స్ డే ఎన్నో అనుభూతులు ఇస్తుంది. అయితే ఇలాంటి ప్రేమలో ఉన్న వారిని సభ్య సమాజం లవ్ బర్డ్స్ అని పిలుస్తుంది. నిజానికి ప్రేమకు పక్షులకు ఉన్న సంబంధం ఏంటి? ప్రేమికులను లవ్ బర్డ్స్ అని ఎందుకు పిలుస్తారు?
లవ్ బర్డ్స్ అనేవి ప్రత్యేకంగా ఉంటాయి. ఇవి చిలుక జాతికి చెందిన పక్షులు. ఈ చిలుకల్లో ఆఫ్రికన్ జాతి చెందిన పక్షులు మనుషులను అనుకరిస్తూ మాట్లాడగలవు. కానీ లవ్ బర్డ్స్ సాధారణంగా మాట్లాడవు. అవి ప్రత్యేకమైన శబ్దాలను అనుకరిస్తాయి. అయితే చిన్నప్పటి నుంచి వాటికి మాటలు నేర్పితే కచ్చితంగా మాట్లాడతాయి.
ఇక జంతుశాస్త్ర నిపుణుల అధ్యయన ప్రకారం లవ్ బర్డ్స్ లో 9 వేర్వేరు ఉప జాతులు ఉన్నాయి. వీటిలో దేనికవే ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. మాస్క్ డ్ లవ్ బర్డ్, బ్లాక్ చీక్స్ లవ్ బర్డ్స్, ఫిషర్స్ లవ్ బర్డ్స్, న్యాసా లవ్ బర్డ్స్, స్విండర్న్ లవ్ బర్డ్స్, రెడ్ ఫేస్డ్ లవ్ బర్డ్స్, అబిస్సియన్ లవ్ బర్డ్స్, మడగాస్కర్ లవ్ బర్డ్స్, పీచ్ ఫేస్డ్ లవ్ బర్డ్స్, అన్ని రకాలు ఉన్నాయి. అయితే ఇందులో పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులో ఉండే ప్రేమ పక్షులు చాలా పాపులర్.
ఈ లవ్ బర్డ్స్ చాలా చురుకుగా ఉంటాయి. సాధారణంగా ఈ పక్షులు 10 నుంచి 15 సంవత్సరాల వరకు జీవిస్తాయి. జీవితాంతం ప్రేమలోనే మునిగి తేలుతాయి. సాధారణంగా పక్షులు బహు బంధుత్వాన్ని కలిగి ఉంటాయి. కానీ ప్రేమ పక్షులు జీవితాంతం ఏక భాగస్వామితోనే బలమైన బంధాన్ని సాగిస్తాయి. ఆహార అన్వేషణలో జంట ప్రయాణం సాగిస్తాయి. తమ ముక్కు ద్వారా ఒకదానికొకటి ఒకసారి కోసరి ఆహారం తినిపించుకుంటాయి. ఒకవేళ అనివార్య కారణాలవల్ల ఎదుటి పక్షి చనిపోతే ఇంకో పక్షి వైరాగ్యంలో కూరుకు పోతుందట.. ఆ బాధ తట్టుకోలేక చనిపోతుందట.
ఇక ఈ ప్రేమ పక్షుల్లో ఆడ మగ తేడాను సులభంగా గుర్తించవచ్చు. మగ పక్షులు ఆడవాటికంటే పెద్దగా ఉంటాయి. నల్లటి రెక్కలు ఉన్న మగ ప్రేమ పక్షికి ఎర్రటి ఈకల కిరీటం ఉంటుంది. ఈ పక్షులు కలయిక సమయంలో హార్మోన్ల మార్పులకు గురవుతాయి. ఆ సమయంలో వాటిలో ఈర్ష్య, దూకుడు, కోరిక వంటి లక్షణాలు బాగా పెరుగుతాయట. కొన్ని సందర్భాల్లో తగాదాలు పెట్టుకొని ఒక దాన్ని మరొకటి చంపుకుంటాయట. ఈ పక్షులు చిన్న చిన్న గింజలు, కొన్ని రకాల పండ్లు, కూరగాయలను తింటాయి. అడవులు తగ్గిపోతున్న నేపథ్యంలో లవ్ బర్డ్స్ ను ఇళ్లల్లో చిన్న చిన్న కుండీల్లో, రంద్రాల్లో ఉన్న మట్టి కుండలో పెంచుతున్నారు. ఎందుకంటే వాటికి అడవుల్లో చెట్లకు రంధ్రాలు చేసుకొని జీవించడం అలవాటు. అలాంటి సౌకర్యం కల్పించడం కోసమే పెంపకం దారులు ఆ ఏర్పాటు చేస్తున్నారు.