Ustaad Bhagat Singh : టాలీవుడ్లో హాట్ టాపిక్ తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్-హరీష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ రద్దయిందట. దర్శకుడు హరీష్ శంకర్ హీరో రవితేజ మూవీకి షిఫ్ట్ అయ్యాడట. ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టబోతున్నాడట. సోషల్ మీడియాలో ఈ మేరకు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ అనంతరం ప్రకటించిన చిత్రాల్లో భవదీయుడు భగత్ సింగ్ ఒకటి. హరీష్-పవన్ కాంబోపై ఫ్యాన్స్ లో పిచ్చ క్రేజ్ ఉంది. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కొట్టింది. అలాగే ఫ్యాన్స్ ఆల్ టైం ఫేవరేట్ మూవీగా నిలిచిపోయింది.
పవన్ కళ్యాణ్ ని హరీష్ చూపించినంత మాస్ గా ఎవరూ చూపించలేదనేది ఒప్పుకోవాల్సిన నిజం. అందుకే హరీష్ దర్శకత్వంలో పవన్ మూవీ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. భవదీయుడు భగత్ సింగ్ తో అది సాకారం అయ్యింది. అనుకోని కారణాలతో ఆ స్క్రిప్ట్ కార్యరూపం దాల్చలేదు. అయితే అదే కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రకటించారు. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల షూటింగ్ మొదలుపెట్టారు.
స్పెషల్ సెట్స్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. హీరోయిన్ శ్రీలీల సైతం షూటింగ్ లో పాల్గొంది. హరీష్ ఈ ప్రాజెక్ట్ త్వరిత గతిన పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అనూహ్యంగా నేడు ప్రాజెక్ట్ రద్దయ్యిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయంగా బిజీ కానున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని పక్కన పెట్టేశారట. ప్రస్తుతానికి ఈ మూవీ ఆగిపోయిందంటున్నారు.
దీంతో దర్శకుడు హరీష్ శంకర్ హీరో రవితేజ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారట. త్వరలో హరీష్-రవితేజ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో జులై 28న విడుదలవుతుంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ 50% షూటింగ్ జరుపుకుందని వినికిడి. కాగా పవన్ పూర్తి చేయాల్సిన మరొక ప్రాజెక్ట్ హరి హర వీరమల్లు.