https://oktelugu.com/

LPG Prices : ఎన్నికల ఎఫెక్ట్ : ఇన్నాళ్లకు ‘మంట’ తగ్గించాడు.. లేదంటే ‘సెగ’ తగులుతుందని మోడీకి తెలుసు!

2024 లోక్‌సభ ఎన్నికలలో దీనిని ఒక పోల్ ఇష్యూగా మార్చే అవకాశం ఉందని తేలడంతోనే బీజేపీ జాగ్రత్త పడి ఈ కంటితుడుపు చర్యలు చేపట్టింది.

Written By:
  • NARESH
  • , Updated On : August 29, 2023 5:33 pm
    LPG Prices

    LPG Prices

    Follow us on

    LPG Prices : ఎన్నికలంటే ప్రజల చేతిలోని ఆయుధాన్ని పదునుగా వాడడం.. నచ్చని నేతను, పార్టీని ఓడించడం.. తమను ముప్పుతిప్పలు పెడుతున్న పార్టీలకు కర్రుకాల్చి వాతపెట్టడం.. అందుకే నాలుగేళ్ల పాటు ప్రజలపై పన్నుల భారాన్ని మోపి వారికి ఎలాంటి సంక్షేమాలు, అభివృద్ధి, పథకాలు పంచని ప్రభుత్వాలు.. ఎన్నికలు రాగానే వరాల జల్లు కురిపిస్తాయి. ప్రజలకు పెట్టిన వాతలకు అయింట్ మెంట్ పూస్తాయి. ఇప్పుడు బీజేపీ కూడా అదే చేసింది. ఆ మంట కనుక తగ్గించకుంటే ప్రజలు మాకు మంట పెడుతారని ముందే ఊహించింది. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ సిలిండర్ పై ఏకంగా రూ.200 తగ్గించడం విశేషం.

    ఎప్పటి నుంచో దేశ ప్రజల నెత్తిన బండ పెట్టి రోజురోజుకు రేటు పెంచుతూ పోతున్న మోడీ సర్కార్ ప్రస్తుతానికి ఉపశమనం కల్పించింది. గృహ వినియోగదారులకు అతిపెద్ద ఉపశమనం కల్పించింది. వినియోగదారులందరికీ ఎల్‌పిజి సిలిండర్‌పై రూ.200 తగ్గింపునకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది.

    ప్రధాన మంత్రి ఉజ్వల యోజనలో నమోదు చేసుకున్న వినియోగదారులకు కూడా ధర తగ్గింపు వర్తిస్తుంది. అంటే లబ్ధిదారులు ఇప్పుడు 14 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌కు రూ. 400 మొత్తం సబ్సిడీని పొందుతారు.

    ” రక్షాబంధన్ , ఓనం సందర్భంగా ప్రభుత్వం ధరను తగ్గించాలని నిర్ణయించింది. 200 రూపాయల తగ్గింపుతో డొమెస్టిక్ సిలిండర్లు అందిస్తారు. దేశంలోని మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన కానుక’’ అని కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై విలేకరుల సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.

    ఉజ్వల పథకం కింద కేంద్రం 75 లక్షల కొత్త LPG కనెక్షన్‌లను కూడా ఉచితంగా అందించనుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ పథకంలో 9.6 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. సబ్సిడీయేతర గృహ LPG సిలిండర్ ధరలు ప్రస్తుతం రూ. 1,103, రూ. 1,129, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో వరుసగా రూ. 1,102.50, రూ. 1,118.50గా ఉన్నాయి..

    జూలైలో చమురు కంపెనీలు దేశీయ ఎల్‌పిజి సిలిండర్ల ధరను రూ. 50 పెంచాయి. మేలో రెండుసార్లు పెంపుదల జరిగింది. ఈ నెల ప్రారంభంలో దేశీయ వంట గ్యాస్ రేట్లను యథాతథంగా ఉంచుతూ చమురు కంపెనీలు వాణిజ్య LPG ధరలను సవరించాయి.
    ద్రవ్యోల్బణం కారణంగా టమోటాలు, ఉల్లిపాయలు సహా సాధారణ ఆహార పదార్థాల ధరలు పెరగడంపై కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఎన్నికల వేళ ఇదీ బీజేపీకి పెద్ద దెబ్బగా పరిగణించే అవకాశాలు లేకపోలేదు. అందుకే బీజేపీ సర్కార్ ఈ నష్ట నివారణ చర్యలు చేపడుతోంది. ధర తగ్గింపును ప్రకటించింది.

    ఇప్పటికే ప్రతిపక్ష కూటమి ఇండియా ధరల పెరుగుదలను నియంత్రించడంలో అసమర్థతపై బిజెపి ప్రభుత్వంపై నిరంతర దాడిని ప్రారంభించింది. రాబోయే రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికలలో దీనిని ఒక పోల్ ఇష్యూగా మార్చే అవకాశం ఉందని తేలడంతోనే బీజేపీ జాగ్రత్త పడి ఈ కంటితుడుపు చర్యలు చేపట్టింది.