https://oktelugu.com/

Bharat Brand Rice : ఇక సర్కారువారి ‘భారత్‌ బ్రాండ్‌ రైస్‌’.. కిలో రూ.25 మాత్రమే.. వెనుక మతలబు ఇదే

తాజాగా బియ్యం కూడా విక్రయించనుండడంతో ప్రజలకు పెరుగుతున్న బియ్యం ధరల నుంచి ఉపశమనం లభించనుంది. మొబైల్‌ వ్యాన్లలో కూడా బియ్యం విక్రయించే అవకాశం ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 27, 2023 / 03:37 PM IST
    Follow us on

    Bharat Brand Rice : దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని, బియ్యం ధరల కట్టడికి కేంద్రం రంగంలోకి దిగింది. అన్నపూర్ణ లాంటి భారత దేశంలో తిండి దొరకని పరిస్థితి రావొద్దనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. రాయితీపై కిలో బియ్యాన్ని రూ.25కే విక్రయించాలని నిర్ణయించింది. ఈమేరకు భారత్‌ బ్రాండ్‌ రైస్‌ పేరుతో వీటిని మార్కెట్‌లో అందుబాటులో ఉంచనుంది. పెరుగుతున్న ధరలు వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని గుర్తించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    విక్రయాలు అక్కడే..
    కేంద్రం రాయితీపై అందించే భారత్‌ బ్రాండ్‌ రైస్‌ను నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(నాఫెడ్‌), నేషనల్‌ కో–ఆపరేటివ్‌ కన్య్జూ మర్స్‌ ఫెడరేషన్‌ (ఎన్‌సీసీఎఫ్‌), కేంద్రీయ భండార్‌ అవుట్‌లెట్లలో విక్రయించనున్నారు. ఈ కేంద్రాల ద్వారా కేంద్రం ఇప్పటికే గోధుమ పిండి, పప్పులను భారత్‌ బ్రాండ్‌ పేరుతో విక్రయిస్తోంది.

    పెరుగుతున్న ద్రవ్యోల్బణం..
    దేశంలో నవంబర్‌లో తృణధాన్యాల ధరలు 10.27 శాతం పెరిగాయి. దీంతో నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 8.70 శాతానికి పెరిగింది. అక్టోబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 6.61 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం మొత్తం వినియోగదారుల సూచీలో దాదాపు సంగం ఉంది. ఈ నేపథ్యంలో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) ఈ–వేలం ద్వారా బహిరంగ మార్కెట్‌లోకి తేవడం ద్వారా పెరుగుతున్న గోధుమల ధరలను కేంద్రం నియంత్రించింది. తాజాగా బియ్యం ఆఫ్‌టేక్‌ చాలా తక్కువగా ఉంది. 2024లో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న కేంద్రానికి తృణధాన్యాల ధరలు సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌సీఐ బియ్యం విక్రయాలకు సంబంధించి ఓపెన్‌ మార్కెట్‌ సేల్‌ స్కీంలో మార్పులు చేసింది. ఒక బిడ్డర్‌ కనిష్టంగా ఒక మెట్రిక్‌ టన్ను, గరిష్టంగా 2 మెట్రిక్‌ టన్నులుగా నిర్ణయిచింది. మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించడానికి సరఫరా పెంచడానికి ఈ చర్యలు దోహద పడతాయని కేంద్రం భావిస్తోంది.

    డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేక..
    బియ్యం ధరలు 15 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టే అవకాశం కనిపిస్తోంది. డిమాండ్‌కు తగినట్లుగా ఉత్పత్తి లేకపోవడంతో రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే నియంత్రణకు కేంద్రం రంగంలోకి దిగింది. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది డిసెంబర్‌ 21 నాటికి బియ్యం రిటైల్ ధర కిలోకు రూ.37.99గా ఉంది. ఈ ఏడాది రూ.43.51కి చేరింది. కొన్ని ప్రాంతాల్లో రూ.50 వరకు పలుకుతోంది. ఈ పెరుగుదల ఆగే పరిస్థితి కనిపిచండం లేదు. దీంతో వెంటనే కట్టడి చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. లాభాల కోసం ధరలు పెంచి విక్రయిస్తే చర్యలు చేపట్టాలని హెచ్చరించింది.

    సబ్సిడీపై గోధుమ పిండి, పప్పు..
    ఇక కేంద్రం గోధుమ పిండిని కొన్ని రోజులుగా సబ్సిడీపై విక్రయిస్తోంది. భారత్‌ అట్టా పేరుతో కిలోకు రూ.27.50కు విక్రయిస్తోంది. నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్‌ అవుట్‌లెట్‌లలో ఇది లభిస్తుంది. గత జూలైలో శనగపప్పును భారత్‌ దాల్‌ పేరుతో రిటైల్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని ధర కిలోకు రూ.60గా నిర్ణయిచింది. దీనిని కూడా నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్, సఫాల్‌ వంటి రిటైల్‌ అవుట్‌లెట్లలో విక్రయించింది. తాజాగా బియ్యం కూడా విక్రయించనుండడంతో ప్రజలకు పెరుగుతున్న బియ్యం ధరల నుంచి ఉపశమనం లభించనుంది. మొబైల్‌ వ్యాన్లలో కూడా బియ్యం విక్రయించే అవకాశం ఉంది.