Under 19 cricket world cup : ఏ క్రీడైనా సరే విజయమే క్రీడాకారుల అంతిమ లక్ష్యమవుతుంది. ఆ విజయం కోసం క్రీడాకారులు సర్వశక్తులూ ఒడ్డుతారు. కానీ అందరి క్రీడాకారులను విజయలక్ష్మి వరించదు.. కానీ ఒక్క అడుగు వేస్తే ట్రోఫీని గెలుస్తామనే దశలో ఓడిపోతే.. ఆ బాధ మామూలుగా ఉండదు. ఆ వేదన చెప్పతీరుగా ఉండదు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని భారత యువ క్రికెట్ జట్టు అనుభవిస్తున్నది.. లీగ్ మ్యాచ్ లలో ఒక్క ఓటమి కూడా ఎదుర్కోకుండా ఫైనల్ వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం సగటు క్రికెట్ క్రీడాభిమానిని నివ్వెర పరుస్తోంది. అది కూడా సీనియర్ జట్టు క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన ఆస్ట్రేలియా చేతిలోనే.. యువ జట్టు కూడా పరాజయం పాలు కావడం భారత అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది.
గత ఏడాది నవంబర్లో మెన్స్ సీనియర్స్ విభాగంలో క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు, ఆస్ట్రేలియా జట్టు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు 240 పరుగులు మాత్రమే చేసింది.. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 240 పరుగుల లక్ష్యాన్ని చేదించింది. కప్ గెలుస్తుంది అనే భారత్ ఆశలను పటాపంచలు చేసింది. లీగ్ దశలో తమను ఓడించిన ఇండియా జట్టు పై ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు మాత్రమే కాదు 2003లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లోనూ ఆస్ట్రేలియా ఇదే తీరుగా భారత్ పై విజయం సాధించింది. ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న ఇండియా జట్టు కేవలం రెండుసార్లు మాత్రమే వరల్డ్ కప్ దక్కించుకుంది.. రెండుసార్లు ఫైనల్ మ్యాచ్ లలో చతికిల పడింది.
ఇక యువ క్రికెట్ జట్టుకు క్రికెట్ వరల్డ్ కప్ లో మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఐదు సార్లు టీం ఇండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. వాస్తవానికి ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించి కప్ గెలుచుకుంటే ఆరవ ట్రోఫీ సొంతమయ్యేది. కానీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలర్ల చేతిలో ఒత్తిడికి గురి కావడంతో భారత్ ఓడిపోయింది. లీగ్ మ్యాచ్ లలో స్వేచ్ఛగా ఆడిన భారత బ్యాటర్లు ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలర్లకు దాసోహం అయ్యారు. ఇద్దరు ముగ్గురు మినహా పేరు పొందిన బ్యాటర్లు మొత్తం ప్రతిఘటించకుండానే పెవిలియన్ దారి పట్టారు. ఒకానొక దశలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేసిన భారత దారుణమైన ఓటమిని మూటకట్టుకుంటుందని అందరూ భావించారు. కానీ అభిషేక్, తివారి 9 ఓవర్ల పాటు ఆస్ట్రేలియా బౌలర్లను ప్రతిఘటించారు. 57 బంతుల్లో 86 పరుగులు చేస్తే గెలుస్తామనే స్థితికి తీసుకొచ్చారు. కానీ ఈ దశలో అభిషేక్ ను ఆస్ట్రేలియా బౌలర్ వీడ్లర్ అవుట్ చేయడంతో భారత్ దాదాపు ఓటమిని అంగీకరించినట్టు అయింది.
ఇక ఈ ఓటమితో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత క్రికెట్ క్రీడాకారులను ఫైనల్ ఫోబియా వేధిస్తోందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లీగ్ మ్యాచ్ లలో స్వేచ్ఛగా ఆడుతున్న క్రీడాకారులు.. ఫైనల్ మ్యాచ్ కు వచ్చేసరికి ఒత్తిడిని అధిగమించలేకపోతున్నారని అంటున్నారు. ఇప్పటివరకు ఆడిన అన్ని లీగ్ మ్యాచ్లలో భారత యువ బాటర్లు ఉదయ్, సచిన్ ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు చూపించారు. కానీ ఫైనల్ మ్యాచ్ కు వచ్చేసరికి తేలిపోయారు. కనీసం వీరు పది పరుగులైనా చేయకపోవడం అది మిగతా ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపించింది. సీనియర్ ఆటగాళ్ల క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోనూ కీలక ఆటగాళ్లు ఇలానే చేతులెత్తేశారు. చివరికి ఆకాశమే హద్దుగా చెలరేగే సూర్య కుమార్ యాదవ్ కూడా టెస్ట్ క్రికెట్ మాదిరి ఆడటంతో భారత్ 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఈ ఓటమితో టీం ఇండియా యువ ఆటగాళ్లు నిర్వేదంలో కూరుకుపోయారు. చివరిగా ఆట ఆడే వాళ్లంతా విజేతలు కారు. ఎవరో ఒక్కరిని మాత్రమే విజయలక్ష్మి వరిస్తుంది. కానీ ట్రోఫీ అందుకునే దశలో ఓడిపోతే ఆ బాధ చాలాకాలం వెంటాడుతుంది.