Pawan Kalyan: ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికైతే బాగానే ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయన రాజకీయం మాత్రం లేటు అన్న అపవాదును ఎదుర్కొన్నారు. అమావాస్య, పౌర్ణమికి మాత్రమే పాలిటిక్స్ చేస్తాడంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. ఖాళీ సమయాల్లో మాత్రమే రాజకీయం చేసి మిగతా టైంలో సినిమా షూటింగ్ లు చేస్తాడని అపప్రదను తెచ్చుకున్నారు.

2014లో జనసేన స్థాపించి రాజకీయాల్లో యాక్టివ్ అయిన పవన్ కళ్యాణ్ అప్పుడు టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చి వారిని గెలిపించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వారిద్దరిని వ్యతిరేకించి వామపక్షాలు, బీఎస్పీతో కలిసి ఏపీ అసెంబ్లీలో తొలి సారి పోటీచేశారు. పవన్ సైతం ఓడిపోయి నీరుగారిపోయారు. దీంతో రాజకీయానికి బ్రేక్ ఇచ్చి ఇప్పుడు వరుసగా నాలుగు సినిమాలు లైన్లో పెట్టారు.
ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సినిమాల కోసం రాజకీయాలను పక్కనపెడుతున్నారన్న విమర్శ ఉంది. అందుకే ఇప్పుడు కొత్త దారిలో వెళ్లేందుకు రెడీ అయ్యారు. డబ్బుల కోసమే సినిమా తీస్తున్నాన్న పవన్.. దాన్ని తనే హీరోగా నటించకుండా నిర్మాణ రంగంలోకి దిగి కూడా వేరే హీరోలతో సినిమాలు చేసి సంపాదించవచ్చని యోచిస్తున్నట్టు తెలిసింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు దరిచేరేలా ప్లాన్ చేసినట్టు తెలిసింది.
రాజకీయాల కోసం సినిమాలను కొద్దిరోజులు పక్కనపెట్టారు. ఇటీవల ఓడిపోయాక రాజకీయాన్ని పక్కనపెట్టి సినిమాలను పూర్తిస్థాయిలో చేస్తున్నారు. అందుకే ఒకేసారి రెండు రంగాల్లో ముందుకెళ్లాలని పవన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారని టాక్.
ప్రస్తుతం 4 సినిమాలు లైన్లో పెట్టిన పవన్ 2023 నాటికి సినిమా షూటింగ్ లు పూర్తి చేసి చివరి ఏడాది పూర్తి స్థాయిలో వచ్చే ఎన్నికల కోసం పనిచేస్తారనే ప్రచారం సాగుతోంది. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి అరడజను ఉన్న మెగా హీరోలతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో సినిమాలు నిర్మించి తద్వారా డబ్బు సమకూర్చుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది మొత్తం సినిమాలు చేసి ఆ తర్వాత పవన్ నిర్మాతగా మారుతారని అంటున్నారు. మరి పవన్ రెండు పడవల ప్రయాణం ఎలా సాగిస్తారన్నది వేచిచూడాలి.