TSRTC : హతవిధీ.. అడోళ్ళ దెబ్బ మామూలుగా లేదు… మగాళ్లకి స్పెషల్ బస్ అట!

దీంతో బస్సుల్లో పురుషులు కూర్చోవడానికి సీట్ల కొరత ఏర్పడుతోంది. పైగా హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు పురుషులకు వేరువేరు సీట్లు ఉంటాయి.

Written By: NARESH, Updated On : February 1, 2024 8:53 pm
Follow us on

TSRTC : “మహిళలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం. ఆడవారిని గౌరవించడం మన సంప్రదాయం” అని ఆర్టీసీ బస్సుల్లో ఒకప్పుడు నినాదాలు కనిపించేవి. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలో వచ్చిందో.. ఆడవారి కోసం ప్రత్యేకంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు మహాలక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.. అప్పటినుంచి ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు దొరకడం గగనమయిపోయింది.. మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని బస్సుల్లోనూ ఆడవారికి ఉచిత ప్రయాణం అని చెప్పింది. ఆ తర్వాత దానిని కేవలం పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులకు పరిమితం చేసింది. లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో.. ఉచిత ప్రయాణం అవకాశం కల్పించిన నాటి నుంచి ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లో సీట్ల కోసం ఆడవాళ్లు కొట్లాటకు దిగిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే క్రమంలో తాము టికెట్ కొని బస్సులో ప్రయాణిస్తున్నప్పటికీ.. సీటు లభించడం లేదని వాపోతూ కొంతమంది పురుషులు ధర్నాకు దిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల ఉపాధ్యాయుడు ఆర్టీసీకి బస్సుకు ఎదురుగా కూర్చుని నిరసన తెలిపిన ఉదంతం కూడా ఉంది.. ఈ క్రమంలో కొందరు మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని కోర్టుకు కూడా వెళ్లారు. ఇన్ని పరిణామాల మధ్య హైదరాబాద్ లో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..

మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి హైదరాబాదులో కనీసం పురుషులు నిలబడటానికి కూడా బస్సుల్లో స్థలం ఉండడం లేదు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు తమ బాధను టిఎస్ఆర్టిసి ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ప్రత్యేకంగా చొరవ చూపారు. ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆ నిర్ణయాన్ని అమలు చేశారు. హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఆర్టీసీ ఒక ప్రత్యేక సర్వీస్ ప్రారంభించింది. ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ మార్గంలో ఆర్టీసీ మొట్టమొదటి విద్యార్థుల బస్సు ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ “ఇబ్రహీంపట్నం, పరిధిలో ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువున్నాయి. ఇక్కడ విద్యార్థుల నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.. మొదటి బస్సు ఉదయం 8:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు అదే మార్గంలో తిరిగి వస్తుంది” అని ప్రకటించారు.

మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి బస్సు సౌకర్యాన్ని మహిళలు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఈ పథకం అమలుకు ముందు.. ఆ తర్వాత పోల్చితే దాదాపు 31 శాతం అధికంగా మహిళలు బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని తెలిసింది. దీంతో బస్సుల్లో పురుషులు కూర్చోవడానికి సీట్ల కొరత ఏర్పడుతోంది. పైగా హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు పురుషులకు వేరువేరు సీట్లు ఉంటాయి. గతంలో జరిగిన ఘటన నేపథ్యంలో బస్సు మధ్య భాగం వరకు ఇనుప జాలి వంటిది ఏర్పాటు చేశారు. బస్సు ముందు భాగం నుంచి కండక్టర్ వెనుక వైపు భాగం వరకు మహిళలకు కేటాయించారు. ఆ తర్వాత భాగాన్ని పురుషులకు కేటాయించారు. మహాలక్ష్మి పథకం తర్వాత బస్సుల్లో మెజారిటీ ప్రయాణికుల్లో ఆడవాళ్ళే ఉంటున్నారు. దీంతో పురుషులు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఎల్బీనగర్_ ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివే విద్యార్థులు మహాలక్ష్మి పథకం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వారు డిమాండ్ చేయడంతో ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ బస్సు ఏర్పాటుకు సంబంధించిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.