Munugodu TRS : మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉన్నాయి. ఇంతలోపే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి అనుకుంటున్న కెసిఆర్ కు ఇది ఒక రకంగా అగ్నిపరీక్షే. అయితే ఈ పరీక్షలో కెసిఆర్ గెలిచారు. అయితే ఈ విజయం ఆయన ఊహించిన విజయమేనా? దక్కిన పది వేల మెజారిటీతో కెసిఆర్ సంతృప్తిగా ఉన్నారా? అంటే దీనికి లేదు అనే సమాధానం వస్తుంది.. భారీ మెజార్టీతో విజయం సాధించి సత్తా చాటాలని, ప్రజలు తమ వైపే ఉన్నారనే సంకేతాలు బలంగా ఇవ్వాలని గులాబీ శిబిరం భావించింది. మెజార్టీ కలవర పెడుతోంది. మునుగోడు ఉప ఎన్నిక రావడంతో కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టాడు. ఈ సమయంలో ఆయన వేసిన వ్యూహాత్మక ఎత్తుగడ వామపక్షాలను దరి చేర్చుకోవడం. మునుగోడులో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిపిఐ కి, దానికి తోడు సిపిఎంకు అక్కడ ఉన్న ఓటు బ్యాంకు గురించి సంపూర్ణ అవగాహన ఉన్న కేసీఆర్.. వారి మద్దతు పొందడమే తొలి పనిలో పెట్టుకొని విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నికల కదన రంగంలోకి పార్టీ యంత్రాంగాన్ని దింపాడు. ” కేంద్రం రాజగోపాల్ రెడ్డికి 18,000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చిందన్న ప్రచారం దగ్గర నుంచి… మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్” వరకు ఇలా ప్రతి అంశాన్ని ప్రచారం చేశారు.

-80 శాతం మందిని కారెక్కించినా ..
మునుగోడు లోని స్థానిక ప్రజాప్రతినిధుల్లో 80 శాతం మందిని కారెక్కించారు. ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో డబ్బు కట్టలు తెంచుకుంది. మద్యం ఏరులై పారింది. పథకాలకు కొత్త నిబంధనలు వచ్చాయి. నగదు నేరుగా బదిలీ అయిపోయింది. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు నెల రోజులపాటు మునుగోడు పైనే దృష్టి సారించారు. అధికార యంత్రాంగం, ఉద్యోగ సంఘాల మద్దతు, మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ వంటి వన్ని తోడు కావడంతో చివరకు హమ్మయ్యా గెలిచాం అనే ఊరట లభించింది. గెలుపు గెలుపే. కానీ ఇందుకోసం కేసీఆర్ ఎంతగా ఆపసోపాలు పడ్డాడన్నది చూడాలి. మునుగోడులో కేసీఆర్ గెలుపులో కమ్యూనిస్టు పార్టీల మద్దతే కాదు.. కాంగ్రెస్ కోవర్టులు కేసీఆర్ కు సహకరించారు. అంతేనే.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 80 మంది ఎమ్మెల్యేలు, 1000 మంది జడ్పీటీసీలు,ఎంపీపీలు, 11 మంది ఎంపీలు, 16మంది మంత్రులు, స్వయంగా సీఎం కేసీఆర్ తోపాటు కేటీఆర్, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల సహాయం తీసుకున్నారు. ఇక మునుగోడుకు అనేక పథకాల రూపేణా సంక్షేమం, డబ్బులు పంచారు. ప్రతీరోజు , ప్రతీ ఊరిలో ప్రతీ ఇంట్లో ధావతులు ఇచ్చారు. సో ఇన్ని చేయబట్టే టీఆర్ఎస్ గెలుపు సాధ్యమైంది. ఇదీ కూడా ఓ గెలుపేనా? అన్న ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి.
ఇన్ని తరిచి చూస్తే ముందు ఉన్నది గడ్డు కాలం అని అర్థం అవుతున్నది. వచ్చే సాధారణ ఎన్నికల రేసులో కారు ఈజీగా దూసుకుపోయేంత సన్నివేశం లేదని స్పష్టమవుతున్నది. మునుగోడు లో 30 నుంచి 40 వేల మెజార్టీ వస్తుందని అధికార పార్టీ భావించింది. కానీ అది పదివేలకు మాత్రమే పరిమితమైంది. ఇంత డబ్బు, ఇంత మంది నేతలను మోహరించడం వల్లే ఆమాత్రమైనా మెజార్టీ వచ్చిందనే భావన టిఆర్ఎస్ నాయకుల్లో ఉంది. పార్టీ పట్ల యువతలో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని ఆ పార్టీ నాయకులు అంతర్గతంగా అంగీకరిస్తున్నారు.
-పథకాల ప్రభావం అంతంత మాత్రం
ప్రభుత్వం చెబుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల స్పందన అనూహ్యంగా లేదు. మునుగోడు నియోజకవర్గం లోని మొత్తం ఓటర్లు 2.41 లక్షల మంది కాగా.. అందులో 2.38 లక్షల మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులేనని టిఆర్ఎస్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ఇంటింటికి వెళ్లి చెప్పింది. గొర్రెల మేకల కోసం నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి ₹ 1,31,250 నగదు బదిలీ చేసింది. కానీ అందులో సగం ఓట్లు కూడా టిఆర్ఎస్ పార్టీకి రాలేదు.
-సాధారణ ఎన్నికల్లో హోరాహోరి
మునుగోడులో పెట్టినంత ఫోకస్ సాధారణ ఎన్నికల్లో పెట్టడం సాధ్యం కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి నియోజకవర్గంలో వారు చూసుకోవాల్సిందే. మునుగోడు ప్రతిష్టాత్మక ఉప ఎన్నిక కాబట్టి వందల కోట్ల ఖర్చుకు పార్టీ వెనుకాడ లేదు. సాధారణ ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండదు. అత్యధిక నియోజకవర్గాల్లో వామపక్షాలకు మునుగోడు లో ఉన్నంత బలం ఉండదు. మరో వైపు వ్యూహాత్మకమో, ఆకస్మికమో గానీ ప్రత్యర్థి పార్టీని మానసిక ఇబ్బంది పెట్టిన ఫామ్ హౌస్ డీల్స్ సాధారణ ఎన్నికల వరకు ఉండక పోవచ్చు.