Earthquake : ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌ లో ప్రకంపనలు..

అఫ్ఘనిస్తాన్‌లో తరచు భూకంపాలు సంభవిస్తాయి. ముఖ్యంగా హిందూకుష్‌ పర్వత శ్రేణుల్లో యురేషియన్, ఇండియన్‌ టెక్టోనిక్‌ ఫలకాల మధ్య రాపిడి తలెత్తి భూకంపాలకు కారణమవుతున్నాయి.

Written By: NARESH, Updated On : August 6, 2023 9:59 am
Follow us on

Earthquake : ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం సంభవించిన భూకంపానికి ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంప తీవ్రత రెక్టార్‌ స్కేల్‌పై 5.8గా నమోదైంది. రాత్రి 9:30 గంటలకు ఢిల్లీ, దాని సమీప ప్రాంతాలు, జమ్మూ కశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్‌ మరియు పాకిస్తాన్‌ సరిహద్దుల్లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్‌ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి, శ్రీనగర్, గుల్‌మార్గ్‌తోపాటు మాతా వైష్ణోదేవి మందిరం బేస్‌ క్యాంప్‌ అయిన కత్రా ప్రాంతం, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, ఇతర పాకిస్తాన్‌ నగరాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

హిందూకుష్‌లో భూకంప కేంద్రం..
భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్‌ ప్రాంతంలోని ఉత్తరం వైపు 36.38 ఆక్షాంశంలో, 70.77 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద 196 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి లేదా ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

– వణికిన నోయిడా, జమ్మూకశ్మీర్‌..
శనివారం రాత్రి రాత్రి 9:30 గంటలకు రెండుసార్లు భూమి కంపించిందని నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ప్రీతి శంకర్‌ చెప్పింది. జమ్మూకశ్మీర్‌ భూప్రకంపనలతో వణికిపోయింది. శనివారం ఒక్క రోజే ఏకంగా మూడుసార్లు భూమి కంపించింది. జమ్మూకశ్మీర్‌లో మొదటి భూకంపం ఉదయం 8.36 గంటలకు 129 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. రిక్టర్‌ స్కేల్‌పై 4.8 తీవ్రతగా నమోదైంది. ఇక రెండో భూకంపం రాత్రి 10.24 గంటలకు సంభవించింది. ఈ భూకంప కేంద్రం కాబూల్‌కు ఈశాన్యంగా 75 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఇది రిక్టర్‌ స్కేల్‌పై 5.2గా రికార్డయింది. రెండు రోజుల కిందట అంటే గురువారం తెల్లవారుజామున అండమాన్‌ నికోబార్‌ దీవులలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

అఫ్ఘనిస్తాన్‌లో తరచు భూకంపాలు సంభవిస్తాయి. ముఖ్యంగా హిందూకుష్‌ పర్వత శ్రేణుల్లో యురేషియన్, ఇండియన్‌ టెక్టోనిక్‌ ఫలకాల మధ్య రాపిడి తలెత్తి భూకంపాలకు కారణమవుతున్నాయి.