https://oktelugu.com/

Tomato Prices: టమాట ప్రియులకు ఇది శుభవార్త!!

టమాటా ధరలు దిగి వస్తుండడంతో రైతులు ఉసూరుమంటున్నారు. మంచి డిమాండ్‌ ఉండడంతో చాలా మంది రైతులు తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చే టమాటా సాగు ప్రారంభించారు.

Written By: Raj Shekar, Updated On : August 8, 2023 10:36 am

Tomato Prices

Follow us on

Tomato Prices: రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్న టమాటా ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. భారీగా పెరిగిన ధరలతో రెండు నెలలుగా కొంత మంది టమాటాలు కొనడం, వాడడమే మానేశారు. డబుల్‌ సెంచరీని దాటి ట్రిపుల్ సెంచరీవైపు పయనిస్తుందని అంచనా వేశారు. కానీ గత మూడు రోజులు టమాటా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. దిగుబడి పెరగడంతోనే టమాటా ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు టమాటా రాక పెరగడంతో ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లోని పలు రైతు బజారుల్లో కిలో టమాటా రూ.63 నుంచి రూ.70 పలుకుతోంది. ఇక రిటైల్‌లో కిలో రూ.120 నుంచి రూ.140 పలుకుతోంది. దీంతో సామాన్యులు కాస్త ఉపశమనం పొందుతున్నారు.

ఉసూరుమంటున్న రైతులు..
టమాటా ధరలు దిగి వస్తుండడంతో రైతులు ఉసూరుమంటున్నారు. మంచి డిమాండ్‌ ఉండడంతో చాలా మంది రైతులు తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చే టమాటా సాగు ప్రారంభించారు. దీంతో దిగుబడి క్రమంగా పెరుగుతోంది. మార్కెట్లకు వచ్చే టమాటా పెరిగింది. దీంతో ధర క్రమంగా దిగి వస్తుంది. భాగ్యనగరానికి 10 రోజుల కిందటి వరకు రోజుకు 600 నుంచి 900 క్వింటాళ్ల వరకు టమాటా వచ్చేది.. కానీ సోమవారం 2,450 క్వింటాళ్ల టమాటా వచ్చింది. దీంతో టమాటా ధర తగ్గింది.

కర్నాటక, రాయల సీమలో పెరిగిన దిగుబడి..
ఇటీవలి భారీ వర్షాలకు తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్రలో టమాటా తోటలు తుడిచిపెట్టుకుపోయాయి. కానీ ఆంధ్రాలోని రాయలసీమ, కర్ణాటకలో మాత్రం టమాటా సాగు పెరిగింది. దీంతో రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కర్ణాటక నుంచి భారీగా టమాటా రావడంతో ధర తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణలోనూ టమాటా దిగుబడి పెరిగింది. హైదరాబాద్‌ చుట్టు పక్కల జిల్లాలైన రంగారెడ్డి, వికారాబాద్, మెదక్‌ జిల్లాల నుంచి కూడా టమాటా అధికంగా వచ్చింది. ఫలితంగా ధరలు తగ్గాయి.

రూ.40కి చేరే అవకాశం..
టమాటా రాక ఇలాగే పెరిగితే మరో పది రోజుల్లోల కిలో టమాటా రూ.40 లకు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కిలో టమాటా రూ.40 నుంచి రూ.50 మధ్యలో ఉంటే వినియోగదారులు, రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండని చెబుతున్నారు.

పెరిగిన టమాటా సాగు..
మరోవైపు టమాటా ధరలు పెరగడంతో చాలా మంది రైతుల తమ పొలాల్లో టమాటా సాగు మొదలు పెట్టారు. దీంతో వారి ఇంటి అవసరాలను తీర్చుకుంటూ మిగిలితే బయట అమ్ముతున్నారు. దీని వల్ల కూడా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే హోల్‌ సేల్‌ మార్కెట్‌ టమాటా నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తారు. మేలు రకానికి ఎక్కువగా.. రెండో రకానికి కాస్త తక్కువగా అధికారులు ధర నిర్ణయిస్తారు. అయితే వ్యాపారులు మాత్రం అన్ని రకాల టమాటాకు ఒకే ధరలను వసూలు చేస్తున్నారు. రైతు బజారులో కిలో రూ.63 అని బోర్డు పెట్టి రూ.100 లకు విక్రయిస్తున్నారు.