
Telugu Film Industry: పరిశ్రమ ఏదైనా పోటీతత్వం అవసరం. అది ఉన్నప్పుడే ప్రొడక్ట్ క్వాలిటీ పెరుగుతుంది. అయితే ఇది ఆరోగ్యకరమైనదై ఉండాలి. నిజాయితీగా రేసులో పరుగెత్తాలి. ఒకరు ఎదగడం కోసం ఇంకొకరిని క్రిందికి లాగేసే గుణం, ఏ ఒక్కరికీ మంచిది కాదు. చిత్ర పరిశ్రమలో ఈ రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. బాలీవుడ్ వంటి పరిశ్రమల్లో తీవ్ర రూపం దాల్చాయి. ఈ విషయం పలు సందర్భాల్లో రుజువైంది. కొందరు ఒక మాఫియాగా ఏర్పడి అవుట్ సైడర్స్ ని తోక్కేస్తున్నారు, ఎదగనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే వాదన ఉంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం దీని పర్యవసానమే అంటారు. హీరోయిన్ కంగనా రనౌత్ చాలా కాలంగా ఆ మాఫియాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంది.
రోజుల వ్యవధిలో కాజల్, ప్రియాంక చోప్రా బాలీవుడ్ మీద ఆరోపణలు చేశారు. గతంలో కొందరు దర్శకులు సైతం అక్కడ ఒక అనారోగ్య పూరిత వాతావరణం ఉందని వేదన చెందారు. హిందీ పరిశ్రమ వెనుకబాటుకు ఇదే కారణమన్న వాదన తెరపైకి వచ్చింది. బాలీవుడ్ తో పోల్చితే కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్స్ లో ఈ తరహా రాజకీయాలు తక్కువ. అయితే ఎంతో కొంత ఉన్నాయి. ప్రతిభను గుర్తించి గౌరవించడం… మంచి స్థాయిలో ఉన్నవారిని స్ఫూర్తిగా తీసుకోవడం ఎదగడం టాలీవుడ్ లో మాత్రమే మనం చూస్తున్నాం.
తెలుగు చిత్ర పరిశ్రమలో నువ్వు నేను భాయ్ భాయ్ కల్చర్ కనిపిస్తుంది. ముఖ్యంగా హీరోలు, దర్శకుల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొంది. ఒకరి విజయాలను పొగడడం, అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం గమనించవచ్చు. రాజమౌళి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే స్ఫూర్తిగా నిలుస్తున్నారు. టాలీవుడ్ దర్శకులు ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఆయన్ని తలచుకున్నవారే. టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఉన్న సుకుమార్ పలుమార్లు రాజమౌళి ఔన్నత్యాన్ని పొగిడారు.

పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం వెనుక ఆయన ఉన్నారని సుకుమార్ అన్నారు. ఫోన్ చేసి మరీ సుకుమార్ కి రాజమౌళి సలహా ఇచ్చారట. తర్వాత అల్లు అర్జున్, మైత్రీ మూవీ మేకర్స్ తో మాట్లాడి ఐదు భాషల్లో విడుదల చేసే దిశగా అడుగులు వేశామని సుకుమార్ అన్నారు. పుష్ప చిత్ర సక్సెస్ క్రెడిట్ సుకుమార్ రాజమౌళికి ఇవ్వడం ఇక్కడ చూడొచ్చు. ఒక సక్సెస్ ఫుల్ మూవీ తీసిన చిన్న డైరెక్టర్స్ గురించి పెద్దవాళ్ళు ఓపెన్ గా మాట్లాడుతున్నారు.
ఈ మధ్య కాలంలో చందూ మొండేటి, హను రాఘవపూడి, వశిష్ట పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వారి పేర్లు పెద్దల నోటి వెంట వచ్చాయి. తాజాగా ఈ లిస్ట్ లో బలగం వేణు చేరారు. చిరంజీవి వంటి ఒక లెజెండరీ యాక్టర్ అలాంటి ఒక దర్శకుడు గురించి మాట్లాడటం, సన్మానించడం ఎక్కడలేని స్ఫూర్తి నింపుతుంది. మరిన్ని మంచి చిత్రాలు తెరకెక్కించే ఉత్సాహం ఇస్తుంది. హీరోల విషయంలో కూడా ఈ హెల్తీ కండీషన్స్ మనం చూస్తున్నాము. ఎలాంటి సినిమా నేపథ్యం లేనప్పటికీ నిఖిల్, విజయ్ దేవరకొండ, నాని వంటి హీరోలను స్టార్స్ కొనియాడుతున్నారు. వారితో సమానంగా చూస్తున్నారు.

నెపోటిజం అనే మాట తెలుగు పరిశ్రమలో వినిపించకపోవడానికి ఇదే కారణం. టాలీవుడ్ లో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ ఎదగవచ్చు. అది స్టార్ కిడ్ అయినా అవుట్ సైడర్ అయినా. ఇక్కడ ప్రతిభనే కొలమానంగా చూస్తారు. అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ ఉన్నా, హీరోలు చక్కని సఖ్యత కలిగి ఉన్నారు. టాలీవుడ్ లో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్స్ గా అవతరించాడు. వీరి సక్సెస్ ని మిగతా హీరోలు కొనియాడుతున్నారు. స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళుతున్నారు. వీరిలో ఏరా పోరా అని పిలుచుకునేంత సాన్నిహిత్యం ఉంది.
చాలా కాలంగా మెగా వర్సెస్ నందమూరి అన్నట్లు ఉండేది. ఆ అడ్డుగోడలు కూడా బద్దలైన పరిణామాలు మనం చూస్తున్నాము. ఈ రెండు కుటుంబాల హీరోలు ఒక సినిమాలో కలిసి నటిస్తారని ఎన్నడూ ఊహించలేదు. ఎన్టీఆర్-రామ్ చరణ్ ల స్నేహం దాన్ని సాకారం చేసింది. అల్లు అర్జున్ బర్త్ డే వేళ ఎన్టీఆర్ తో ఆయన సోషల్ మీడియా ముచ్చట్లు వారి మధ్య స్నేహానికి రుజువుగా నిలిచాయి. ఎప్పుడూ నేను మేము అని సంభోదించే బాలయ్య పవన్ కళ్యాణ్ తో సరదా సంబాషణలు చేస్తారని అనుకున్నామా? అన్ స్టాపబుల్ వేదికగా అది సాధ్యమైంది.
బాలయ్య గతంలో మెగా ఫ్యామిలీ మీద చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇరు కుటుంబాల మధ్య దూరం పెంచాయి. ఇటీవల ఆయన అల్లు, మెగా కుటుంబాలకు దగ్గర కావడం మనం చూడొచ్చు. తెలుగు పరిశ్రమకు చెందిన హీరోలు, దర్శకులు అన్నదమ్ములుగా మెలుగుతూ ఇతర పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చిత్ర పరిశ్రమలో అత్యంత పోటీతత్వం ఉంటుంది. రేసులో ముందు పరిగెత్తినోళ్లకే లైఫ్. ఈ పరిస్థితుల మధ్య స్నేహపూరిత వాతావరణం మైంటైన్ చేయాలంటే మన మీద మనకు గట్టి నమ్మకం ఉండాలి. ‘అయ్యో మనం వారిలా విజయాలు అందుకోలేకపోతున్నామనే నెగిటివ్ ఫీలింగ్ రాకుండా చూసుకోవాలి. యస్… నేను అంతకంటే పెద్ద విజయం సాధిస్తానన్న ఆత్మవిశ్వాసం ప్రకటించాలి.
టాలీవుడ్ దేశంలోనే పెద్ద పరిశ్రమగా అవతరించడానికి హెల్తీ కాంపిటీషన్ దోహదం చేస్తుంది. టాలెంట్ ఉన్న నటులు, దర్శకులకు ఇక్కడ అవకాశాలు దక్కుతున్నాయి. ఆ విధంగా మంచి కంటెంట్ తో కూడిన సినిమాలు తయారవుతున్నాయి. అందరూ కలిసి కట్టుగా తెలుగు సినిమాను ప్రపంచపటంలో నిలుపుతున్నారు..