https://oktelugu.com/

Telangana BJP : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఇలా చేయాలి

కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోయి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి... ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో బిజెపి నాయకులు బలంగా చెప్పగలిగితే పార్లమెంట్ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 6, 2023 / 09:04 PM IST
    Follow us on

    Telangana BJP : ఈసారి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కమల వికాసం తథ్యమని అందరూ అనుకున్నారు. బిజెపి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ 8 సీట్లతోనే ఆ పార్టీ సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. గోషా మహల్ మినహా సిట్టింగ్ కోల్పోవాల్సి వచ్చింది. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, తల్లోజు ఆచారి వంటి వారు ఓడిపోవడం, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో అంబర్ పేట లో బిజెపి అభ్యర్థి పరాజయం పాలవడం వంటి ఘటనలు ఆ పార్టీని ఇప్పటికీ అంతర్మథనంలో కొట్టుమిట్టాడేలా చేస్తున్నాయి. గత ఏడాది ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎక్కువగా సీట్లు, ఓట్లు సాధించినప్పటికీ.. బిజెపి అధికారంలోకి రావాలి అంటే అది సరిపోదు.
    ఇలా చేస్తే సత్ఫలితాలు
    బీసీ అజెండా తో ఈసారి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లిన భారతీయ జనతా పార్టీకి ఆశించినంత మేర ఓటు బ్యాంకు బదిలీ కాలేదు. అది జరగాలంటే బీసీ ముఖ్యమంత్రి అంశం మీదనే భారతీయ జనతా పార్టీ తుది వరకు పని చేయాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసిన నేపథ్యంలో… భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి విధానాన్ని అత్యంత పకడ్బందీగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి. అవసరమైతే దీనిని ప్రధాన రాజకీయ అంశంగా తెరపైకి తీసుకురావాలి. ఇక ఎస్సీ ఉప వర్గీకరణ విధానాన్ని కూడా చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లాలి. ఇది దళిత సామాజిక వర్గం చిరకాల వాంఛ. ఇప్పటివరకు ఎన్నికైన ప్రభుత్వాలు దళితుల ఉప వర్గీకరణ సంబంధించి ఒక పకడ్బందీ నిర్ణయం అంటూ తీసుకోలేదు. మాదిగల విశ్వరూప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దళితుల వర్గీకరణ పై నిర్ణయం వెలువరించడం.. మందకృష్ణ మాదిగ సమక్షంలో దానిని ప్రకటించడం ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు.. అయితే ఈ ఉప వర్గీకరణ విధానాన్ని దళితుల్లో క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్తే భారతీయ జనతా పార్టీకి మరింత ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.. ఇవి మాత్రమే కాకుండా హిందూ ధర్మ పరిరక్షణ, విస్తృతి ఒక ప్రధాన అంశంగా బిజెపి ప్రకటించాల్సిన అవసరం ఉంది. హిందువుల పార్టీ అని చెప్పుకునే బిజెపి 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని విస్మరించడం కొంతమందిని ఇబ్బందికి గురి చేసింది. ఒకవేళ ఎన్నికల మేనిఫెస్టోలో బిజెపి కనుక ఈ విషయం మీద అత్యంత సీరియస్గా దృష్టి సారించి ఉండి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
    క్షేత్రస్థాయిలో మరింత బలపడాలి
    తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. గత పది సంవత్సరాలలో బలమైన నాయకత్వాన్ని ఏర్పరచుకుంది. క్షేత్రస్థాయి వరకు విస్తరించిన వ్యవస్థలతో అలరారుతోంది. అయితే ఇటువంటి బలాన్ని ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పొందుపరచుకోవాలి. క్షేత్రస్థాయిలో మరింత బలంగా పార్టీని అభివృద్ధి చేసుకోవాలి. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అని తేడా లేకుండా బలపడాలి. గ్రేటర్ హైదరాబాద్ లో ఒక ప్రాంతం అని కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ విస్తరించాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు సాధించింది. ఇక ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానంలో బిజెపి విజయం సాధించింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం చేసుకుంటే సికింద్రాబాద్ తో పాటు మల్కాజి గిరి స్థానంలోనూ బిజెపి గెలిచే అవకాశం ఉంది.. ఎందుకంటే ఈ స్థానాల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు విజయం సాధించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఇక్కడి ఓటర్ల మనోగతం పూర్తిగా మారిపోతుంది. అందుకే ఈ స్థానాల్లో ఈసారి బిజెపి గెలిచే అవకాశం కనిపిస్తోంది.. ఇదే కాకుండా రాష్ట్రంలో ఉన్న మిగతా పార్లమెంటు స్థానాల్లో కూడా బిజెపి క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ చాలా జిల్లాల్లో అధ్యక్షుల పని తీరు అంతంతమాత్రంగా ఉంది. వారిని తప్పించి ఉత్సాహంగా పనిచేసే వారికి అధ్యక్ష పదవి అప్పచెపితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి గణనీయమైన సీట్లు సాధించే అవకాశం ఉంది. అంతేకాదు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది.. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ఓడిపోయి నైరాశంలో ఉంది కాబట్టి.. అది జాతీయంగా అడుగులు వేసే అవకాశం అంతంత మాత్రమే కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోయి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి… ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో బిజెపి నాయకులు బలంగా చెప్పగలిగితే పార్లమెంట్ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది.