Medaram Jatara 2024: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైంది. ఈనెల 18 నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. 6 వేల బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పటికే ప్రకటించారు. ఈమేరకు ఇప్పటికే అన్ని బస్టాండ్లలో ఏర్పాటు చేస్తున్నారు.
భక్తులూ జాగ్రత్త..
ఇక మేడారం భక్తుల రక్షణ కోసం పోలీసులు అనే చర్యలు తీసుకున్నారు. దాదాపు 600 సీసీ కెమెరాలు, 5 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. డ్రోన్లతో కూడా పర్యవేక్షణ చేయనున్నారు. అయితే జాతర సమయంలో రద్దీ అధికంగా ఉండడంతో దొంగలు చేతివాటం ప్రదర్శించే అవకాశం ఉంది. జాతరకు ముందే.. లక్షల మంది భక్తులు వెళ్లొస్తున్నారు. ఈ క్రమంలో దొంగలు తమ పని తాము కానిస్తున్నారు.
కొబ్బరికాయల దుకాణంలో చోరీ..
తాజాగా మేడారంలోని ఓ కొబ్బరికాయల దుకాణంలో దొంగలు పడ్డారు. ప్రధాన గద్దెలకు సమీపంలో పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు కొడుకు అనిల్ మరికొందరితో కలిసి కొబ్బరికాయలు, బెల్లం దుకాణం ఏర్పాటు చేశాడు. అయితే గురువారం రాత్రి ఈ దుకాణంలో చోరీ జరిగింది. రేకుల షెడ్డుతో ఏర్పాటు చేసిన దుకాణంలో రేకుల స్క్రూ తొలగించి లోనికి చొరబడిన దొంగలు రూ.11.42 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.
జాగ్రత్తగా ఉండాలి..
ఇక మేడారంలో భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దొంగలతోపాటు కిడ్నాపర్లు కూడా ఉంటారని, చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. విలువైన ఆభరణాలు దరించి జాతరకు రావొద్దని పేర్కొంటున్నారు. ఆభరణాలు ఉన్నవారు తప్పనిసరిగా గమనిస్తూ ఉండాలని తెలిపారు. ఏమరుపాటుగా ఉంటే దొంగలు కొట్టేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పిల్లలను కూడా ఎత్తుకెళ్లేవారు ఉంటారని, ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని పేర్కొంటున్నారు.
భద్రత ఇలా..
ఇక మేడారంలో 15 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ శబరీష్ తెలిపారు. ఇందులో 50 శాతం మంది ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహిస్తారని తెలిపారు. ట్రాఫిక్ సాఫీగా సాదేందుకు రోడ్లు క్లియర్ చేస్తారన్నారు. భక్తుల కోసం హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ద్విచక్రవాహనాలపై వచ్చేవారు హెల్మెట్ ధరించాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని వెల్లడించారు. మావోయిస్టులు కూడా సంచరించే అవకాశం ఉన్నందున అనుమానితులను తనిఖీ చేస్తామని తెలిపారు.