https://oktelugu.com/

Unfortunate Indian Cricketers: ఇండియన్ క్రికెటర్లలో అత్యంత దురదృష్టవంతులు వీళ్లే..!

దురదృష్టవంతులైన క్రికెటర్ల జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు అంబటి రాయుడు. 2019 ప్రపంచ కప్ కు ముందు జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా రాణించి సత్తా చాటాడు. కానీ, సెలక్టర్లు రాయుడును జట్టు నుంచి తొలగించారు.

Written By:
  • BS
  • , Updated On : July 24, 2023 / 01:07 PM IST

    Unfortunate Indian Cricketers

    Follow us on

    Unfortunate Indian Cricketers: భారతదేశంలో క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ మరో క్రీడకు లేదు. లక్షలాది మంది యువతీ, యువకులు క్రికెట్లో రాణించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. భారత జట్టులో చోటు కోసం ఆహారహం ఎంతోమంది శ్రమిస్తుంటారు. ఎంతో మంది టాలెంట్ ఉన్నప్పటికీ భారత జట్టులో ఎక్కువ కాలం కొనసాగలేక పోయారు పలువురు ఆటగాళ్లు. ప్రతిభ ఉన్న అదృష్టం కలిసి రాక, గాడ్ ఫాదర్లు లేక ఎంతో మంది భారత జట్టులో చిన్న వయసులోనే చోటు దక్కించుకున్న.. ఎక్కువ కాలం కొనసాగాలేక క్రికెట్ కు దూరం కావాల్సి వచ్చింది. అటువంటి దురదృష్టవంతులైన క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.

    ముందు వరుసలో ఉన్నాడు అంబటి రాయుడు..

    దురదృష్టవంతులైన క్రికెటర్ల జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు అంబటి రాయుడు. 2019 ప్రపంచ కప్ కు ముందు జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా రాణించి సత్తా చాటాడు. కానీ, సెలక్టర్లు రాయుడును జట్టు నుంచి తొలగించారు. అయితే, ప్రపంచ కప్ లో పలువురు ఆటగాళ్లు గాయపడడంతో స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న రాయుడిని సెలెక్టర్లు జట్టులోకి తీసుకోలేదు. దీంతో అంబటి రాయుడు విచారంగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ జాబితాలో వినిపించే మరో పేరు కరుణ్ నాయర్. వీరేంద్ర సెహ్వాగ్ తరువాత 2016లో కరణ్ నాయర్ ఇంగ్లాండ్ పై ట్రిపుల్ సెంచరీ చేసి ఇండియన్ క్రికెట్ చరిత్రలో రెండో బ్యాటర్ గా రికార్డులకు ఎక్కాడు. కానీ, దురదృష్టం నాయర్ ను వెంటాడింది. ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత జట్టులోకి తీసుకోలేదు. సాధారణంగా సెంచరీ చేసిన ఆటగాడు తర్వాతి ఆటలో అయినా జట్టులో స్థానం దొరికే అవకాశం ఉంటుంది. కానీ, ట్రిపుల్ సెంచరీ బాదిన నాయర్ కు చోటు దక్కలేదు క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు.

    వసీమ్ జాఫర్ ను వెంటాడిన దురదృష్టం..

    భారత క్రికెట్ జట్టులో స్టైలిష్ ఆటగాడిగా పేరు సంపాదించాడు వసీం జాఫర్. ది లెజెండ్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జాఫర్ దేశవాళీ క్రికెట్లో ఇప్పటివరకు ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. అతను 186 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో ముంబైకి ఆడుతున్న సమయంలో 14,609 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 46 సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. అయితే, భారత జట్టుకు కఠిన సమయంలో రావడంతో ప్లేయర్ రొటేషన్స్ లో మారుతుండడంతో అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉన్నప్పటికీ దురదృష్టం కొద్ది అతను జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక ఈ జాబితాలో ఉన్న మరో కీలక ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్. పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఓవర్ లోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. 23 ఏళ్ల వయసులో పఠాన్ మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తూ ఉండడంతో అతనికి జూనియర్ కపిల్ దేవ్ గా పేరు వచ్చింది. అయితే, అతన్ని దురదృష్టం గ్రెగ్ చాపెల్ రూపంలో వెంటాడింది. చాపెల్ టీమ్ ఇండియా కోచ్ గా మారిన తర్వాత అతను పఠాన్ ను బలవంతంగా ఆల్రౌండర్ గా మార్చే ప్రయత్నం చేశాడు. రెండింటిని సమానంగా కొనసాగించడంలో పఠాన్ తడబడ్డాడు. దీంతో జట్టులో స్థానం కోల్పోయాడు. 173 అంతర్జాతీయ మ్యాచులు ఆడి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అతని కెరియర్ 27 సంవత్సరాల వయసులోనే ముగిసింది.

    దినేష్ కార్తీక్ ది అదే పరిస్థితి..

    ఇక భారత జట్టులో అత్యంత దురదృష్టవంతుడైన క్రికెటర్లలో దినేష్ కార్తీక్ పేరు కూడా చెప్పుకోక తప్పదు. కార్తీక్ దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ, అతను భారత క్రికెట్ జట్టులో స్థిరమైన స్థానం పొందలేకపోయాడు. ఓపెనర్ గా మొదటి మ్యాచ్ ఆడటమే అతనికి శాపంగా మారింది. అప్పటికే జట్టులో గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ఉన్నారు. దీంతో కార్తీక్ కు ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఇక ధోని ఉండడం వల్ల అతను వికెట్ కీపర్ గాను రెండో స్థానంలో ఉండేవాడు. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ దినేష్ కార్తీక్ భారత అత్యంత దురదృష్టకర క్రికెటర్లలో ఒకడిగా నిలిచి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరందరూ అద్భుతమైన ఆటగాళ్లుగా వెలుగొందే అవకాశం ఉన్నప్పటికీ అవకాశాలు రాక సాధారణమైన క్రికెటర్లుగా మిగిలి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.